కయ్యానికి రెఢీ
- గంటా జోరుతో అయ్యన్న బేజారు
- ఎదురుదాడికి తెగింపు
- ఆసక్తికరంగా టీడీపీ వర్గ పోరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల మధ్య సఖ్యత నేతిబీరలో నెయ్యి చందంగా మారింది. నగరం గంటాకు, రూరల్ జిల్లా అయ్యన్నకు అని ‘ఊళ్లు పంచేస్తూ’ సీఎం చంద్రబాబు చేసిన పెద్ద మనుషుల ఒప్పందానికి ఆదిలోనే హంసపాదు పడింది. జిల్లాను పూర్తిగా తన గుప్పిట పెట్టుకోవాలన్న లక్ష్యంతో గంటా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ దూసుకుపోతుంటే, అయ్యన్న చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వస్తోంది. అసహనానికి గురైన అయ్యన్న ఏకంగా గంటాను నేరుగా ఢీకొనేందుకు తెగించేశారు. అందుకు ఎన్నికల ముందు ఓ చిన్న కేసును తెరపైకి తేవడం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు సూచికగా నిలుస్తోంది.
చక్కబెట్టేస్తున్న గంటా
అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని జిల్లాపై ఆ దిపత్యం సాధించేందుకు మంత్రి గంటా చకచకా పావులు క దుపుతున్నారు. వీలైనంత ఎక్కువగా విశాఖలోనే ఉంటూ అధికారులతో సమీక్ష సమావేశాలతో హడావుడి చేస్తూ జిల్లా కు తానే బాస్ అనే సంకేతాలు ఇస్తున్నారు.
విద్యా శాఖ మం త్రి అయినప్పటికీ అన్ని శాఖల అధికారులతో ఆయన నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలే ఇందుకు నిదర్శనం. ఎక్సయిజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. జిల్లా మంత్రి అన్ని శాఖల ఉన్నతాధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం రివాజు. కానీ ఒక్కో శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించడం మాత్రం గంటా వ్యూహాన్ని చెప్పకనే చెబుతోంది.
ఇక జిల్లా కలెక్టర్ బదిలీ... అనూహ్య రీతిలో వుడా వీసీ యువరాజ్ కొత్త కలెక్టర్‌గా నియమితులు కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కలెక్టర్ నియామకంతో గంటా మాట చెల్లుబాటు అయ్యిందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇతర ఉన్నతాధికారుల నియామకంలోనూ ఆయన హవానే నడుస్తుందని కూడా చెప్పుకుంటున్నాయి.
అయ్యో!... అయ్యన్న
ఈ పరిణామాలు సహజంగానే మంత్రి అయ్యన్నకు ఇబ్బం దికరంగా మారాయి. సీనియర్ మంత్రి అయినప్పటికీ ఆయ న నర్సీపట్నంలో చిన్నాచితకా కార్యక్రమాలకే పరిమితమవ్వాల్సి వస్తోంది. కొత్త కలెక్టర్ నియామకంతోసహా పలు కీలక నిర్ణయాలపై అయ్యన్నకు కనీస సమాచారం ఉండడం లేదని ఆయన వర్గీయులే చెబుతున్నారు. గంటాకు దీటుగా దూకుడుగా వ్యవహరించలేక ఆయన వెనుకబడిపోతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఢీ అంటే ఢీ : గంటా జోరుతో అసహనంతో రగలిపోతున్న అయ్యన్న వర్గం ఎదురుదాడికి దిగాలని నిర్ణయించుకుంది. కానీ గంటా మాదిరిగా వ్యూహాత్మకంగా వెళ్లలేక... నేరుగానే ఆయనతో తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది. అందుకు ఎన్నికల ముందు నాటి ఓ కేసును సాధనంగా మలచుకుంది. అప్పట్లో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న గంటా అయ్యన్నను ఇబ్బంది పెట్టేందుకు తన ‘సన్నిహిత బృందం’ ద్వారా ప్రయత్నించారు. దీనిపై అప్పట్లోనే అయ్యన్న తీవ్రంగా స్పందించి గంటా సన్నిహితులు, మరికొందరిపై నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తదనంతరం గంటా టీడీపీలో చేరడంతో ఆ ఫిర్యాదు గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ అయ్యన్న హఠాత్తుగా బుధవారం ఆ కేసును తిరగదోడారు. పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గంటాకు పరోక్షంగా సంబంధం ఉండడంతోపాటు... ఆయన సన్నిహితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి కేసును బిగించడం ద్వారా అయ్యన్న నేరుగా కయ్యానికి కాలుదువ్వినట్లైంది. ఈ పరిణామాలు టీడీపీతోపాటు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరి మున్ముందు గంటా, అయ్యన్నల ఆధిపత్యపోరు మరెన్ని మలుపులు తిరగనుందో చూడాల్సిందే.