
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సొంత పార్టీలోని నేతలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడేళ్లుగా పుట్టలో దాక్కున్న బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబును హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మూడేళ్లుగా ఈ బురదపాములు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు.
మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరుగుతున్న తెలుగునాడు స్టూడెంట్ ఫ్రంట్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) శిక్షణ తరగతుల సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి బయటకు రాగా చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment