ఫిఫ్టీ.. ఫిఫ్టీ
- విశాఖపై పెత్తనం గంటాకు..
- అయ్యన్నకు రూరల్ జిల్లా
- పోలీస్ శాఖలో బదిలీలకు సర్వాధికారాలు వారికే
- ఊళ్లు పంచేసిన టీడీపీ అధినేత!
- కీలక పోస్టింగుల కోసం అధికారుల పైరవీలు
- తమవారి కోసం మంత్రుల ప్రతిపాదన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు... అయ్యన్నపాత్రుడు... వారిద్దరూ అసలే ఉప్పూనిప్పూ. అందుకే వర్గపోరు ఎందుకని భావించారో ఏమో ఇద్దరికీ ‘ఊళ్లు పంచేశారు’. అందుకు పోలీసు శాఖలో బదిలీలే తొలి మజిలీ కానున్నాయి. కీలక పోస్టింగులపై కన్నేసిన అధికారులు వారిద్దర్నీ ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. వర్గ సమీకరణలే ప్రధాన ప్రాతిపదికగా... అస్మదీయ అధికారులకు అందలమే లక్ష్యంగా ఈ బదిలీల ప్రహసనానికి తెర వెనుక యత్నాల కథ కమామిషు ఇదిగో ఇలా ఉంది.
మీ వాళ్లెవరో చెప్పండి
గ్రేటర్ విశాఖకు సంబంధించినంతవరకు గంటాయే అంతా చూసుకుంటారు... రూరల్ జిల్లా వ్యవహారాల్లో మాత్రం అయ్యన్న మాటే చెల్లుతుంది అని సీఎం చంద్రబాబు తేల్చేసినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సిటీ వరకు గంటా, రూరల్ జిల్లాకు సంబంధించి అయ్యన్నలు సూచించిన మేరకు చేస్తామని చెప్పేశారుట. వచ్చే నెల మొదటివారం తర్వాత ఏసీపీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐల బదిలీల ప్రక్రియ చేపడతామని కూడా వెల్లడించారు. దాదాపు 70 మందికి స్థాన చలనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటకే పెద్దపీట వేస్తూ ఈ బదిలీల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
మీ వాడినే...
కీలక పోస్టింగులపై కన్నేసిన పోలీసు అధికారులు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సామాజికవర్గ సమీకరణలను ప్రస్తావిస్తూ పైరవీలు తీవ్రతరం చేశారు. ‘నేను మీ వాడినే’నని బీరకాయ పీచు సంబంధాలను ప్రస్తావిస్తూ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు. వర్గ సమీకరణలకే ప్రా ధాన్యమిచ్చే అధికార పార్టీ నేతలు కూ డా వారివైపే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు కొన్ని మచ్చుతునకలు...
విశాఖ సిటీ సౌత్‌లో ఉన్న ఓ ఉన్నతాధికారి మధురవాడలో పోస్టింగ్‌పై కన్నేశారు. భవిష్యత్తులో కీలక వ్యవహారాలకు భీమిలి నియోజకవర్గమే ప్రధాన కేంద్రం కానుందని ఆయన గుర్తించారు. మంత్రి గంటాతో మొదటి నుంచి టచ్‌లో ఉంటూ వచ్చారు. తాజాగా ‘నేను మీ వాడినే... మీ దగ్గరకే తీసుకుపొండి’అని విన్నవించుకోగా ఆయన సరేనన్నారు.
పీఎం పాలెం, భీమిలీలలో పోస్టిం గుల కోసం కూడా ఇద్దరు అధికారులకు గంటా మాట ఇచ్చారని తెలుస్తోంది.
అనకాపల్లిలో ప్రస్తుతం అంతగా ప్రాధాన్యంలేని స్థానంలో ఉన్న ఓ అధికారి చోడవరంలో పోస్టింగ్ కోరుకోగా అయ్యన్న అభయమిచ్చారు.
పరవాడ,పెందుర్తిలలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు కూడా అంత కంటే మంచిస్థానాల కోసం మంత్రి
అయ్యన్న వర్గీయుల నుంచి హామీ పొందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు జిల్లాకు వచ్చేందుకు పైరవీలు ముమ్మరం చేశారు.
నిబద్ధతకు విలువ లేదా!
కేవలం వర్గ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తూ బదిలీలకు రంగం సిద్ధం చేస్తుండడం పట్ల పలువురు పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనితీరు... నిబద్ధత... ట్రాక్ రికార్డు అనేవేవీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. విశాఖ సిటీలో పని చేస్తున్న ఓ అధికారి ఇటీవల అధికార పార్టీ నేతను కలవగా...‘మా వాడికి మాటిచ్చేశాను’అని చెప్పేశారు. తన ట్రాక్ రికార్డును ఆయన చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ నేత వినిపించుకోకుండా వెళ్లిపోయారు. త్వరలో జరగనున్న పోలీసు అధికారుల బదిలీలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ ఉదంతమే సూచిక అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. అందండీ సంగతి!