k. shiva reddy
-
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
తెలంగాణ భూమిలో కవిత్వం పండుతుంది
‘కవితల జాతర’ కార్యక్రమంలో కవి కె.శివారెడ్డి హైదరాబాద్: కవులు ప్రజల పక్షం వహించాలని ప్రముఖ కవి, విమర్శకులు కె.శివారెడ్డి అన్నారు. తెలంగాణ భూమిలోనే కవిత్వానికి కావల్సిన పదును ఉందని, ఈ నేలలో ఎక్కడ దున్నినా కవిత్వం పండుతుందని ఆయన చె ప్పారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజా సాహిత్యాన్ని ప్రొత్సహించేందుకు ‘కవితల జాతర’ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివారెడ్డి మాట్లాడుతూ కవులు గోడలకు చెవులను ఇస్తారు.. చెట్లకు కళ్లను ఇస్తారు.. భూమికి మాట నిస్తారని అన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ గతం, వర్తమానాల్ని అవగతం చేసుకోగలిగిన వారే భవిష్యత్తులో దిశా, నిర్దేశం చేయగలుగుతారని అన్నారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కవికి అధ్యయనంతో పాటు సామాజిక ఆచరణాత్మకమైన బాధ్యత ఉండాలని అన్నారు. జీవితంలో విభిన్న కోణాలను ఆవిష్కరించే విధంగా కవిత్వం ఉండాలన్నారు. సాహిత్యంలో ఉన్న గొప్పతనం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రపంచానికి తెలి సిందన్నారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ కొత్తతరం సాహితీ వేత్తలకు పాత కవుల ప్రోత్సాహం ఉండాలన్నారు. పాలకులు అమ్మవలే అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రాం త కవులు, కళాకారులు.. ప్రజల వైపా? ప్రభుత్వం వైపా తేల్చుకోవాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆనందాచారి మాట్లాడుతూ శివరాత్రి రోజు జరుగుతున్న సాహిత్య ఉత్సవంలో ముగ్గురు శివ కవులున్నారని, వారే.. శివారెడ్డి, జూలూ రి గౌరీశంకర్, నిఖిలేశ్వర్ అని చమత్కరించారు. ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు తంగిరాల చక్రవర్తి, వల్లభాపురం జనార్దన, సునంద, రత్నకుమార్, రౌతు రవి, ఆనంద్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు, సాహితీ వేత్తలు అమ్మంగి వేణుగోపాల్, బండారు సుజాత శేఖర్, విమల, గుడిపాటి, మోత్కుపల్లి నరహరి, శిలాలోలిత తదితరులు తమ కవితలను చదివి వినిపించారు.