తెలంగాణ భూమిలో కవిత్వం పండుతుంది
‘కవితల జాతర’ కార్యక్రమంలో కవి కె.శివారెడ్డి
హైదరాబాద్: కవులు ప్రజల పక్షం వహించాలని ప్రముఖ కవి, విమర్శకులు కె.శివారెడ్డి అన్నారు. తెలంగాణ భూమిలోనే కవిత్వానికి కావల్సిన పదును ఉందని, ఈ నేలలో ఎక్కడ దున్నినా కవిత్వం పండుతుందని ఆయన చె ప్పారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ప్రజా సాహిత్యాన్ని ప్రొత్సహించేందుకు ‘కవితల జాతర’ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివారెడ్డి మాట్లాడుతూ కవులు గోడలకు చెవులను ఇస్తారు.. చెట్లకు కళ్లను ఇస్తారు.. భూమికి మాట నిస్తారని అన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ గతం, వర్తమానాల్ని అవగతం చేసుకోగలిగిన వారే భవిష్యత్తులో దిశా, నిర్దేశం చేయగలుగుతారని అన్నారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ కవికి అధ్యయనంతో పాటు సామాజిక ఆచరణాత్మకమైన బాధ్యత ఉండాలని అన్నారు. జీవితంలో విభిన్న కోణాలను ఆవిష్కరించే విధంగా కవిత్వం ఉండాలన్నారు.
సాహిత్యంలో ఉన్న గొప్పతనం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రపంచానికి తెలి సిందన్నారు. ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడుతూ కొత్తతరం సాహితీ వేత్తలకు పాత కవుల ప్రోత్సాహం ఉండాలన్నారు. పాలకులు అమ్మవలే అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రాం త కవులు, కళాకారులు.. ప్రజల వైపా? ప్రభుత్వం వైపా తేల్చుకోవాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆనందాచారి మాట్లాడుతూ శివరాత్రి రోజు జరుగుతున్న సాహిత్య ఉత్సవంలో ముగ్గురు శివ కవులున్నారని, వారే.. శివారెడ్డి, జూలూ రి గౌరీశంకర్, నిఖిలేశ్వర్ అని చమత్కరించారు. ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు తంగిరాల చక్రవర్తి, వల్లభాపురం జనార్దన, సునంద, రత్నకుమార్, రౌతు రవి, ఆనంద్ కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు, సాహితీ వేత్తలు అమ్మంగి వేణుగోపాల్, బండారు సుజాత శేఖర్, విమల, గుడిపాటి, మోత్కుపల్లి నరహరి, శిలాలోలిత తదితరులు తమ కవితలను చదివి వినిపించారు.