న్యూఢిల్లీ: అక్షరాస్యతలో దేశంలోకెల్లా అగ్రస్థానంలో ఉన్న కేరళ మరో ఘనతను సాధించింది. దేశ ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ లక్ష్యాన్ని అందుకోవడంలోనూ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ నెల 11 నాటికి... నూటికి నూరుపాళ్లు బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. కేరళలో ఒక్కో కుటుంబం కనీసం ఒక్కో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే గోవా కూడా ఇదే ఘనతను సాధించిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెల 10 నాటికి జన్‌ధన్ యోజన కింద 7.24 కోట్ల ఖాతాలను ప్రజలు తెరిచారు.