అక్షరాస్యతలో వెనుక.. అత్యాచారాల్లో ముందు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో మహిళా అభ్యున్నతి ప్రకటనలకే పరిమితమవుతోంది. అక్షరాస్యత విషయంలో వెనుక వరసలో కూర్చొగా.. వేధింపుల బాధితులుగా మాత్రం బాగా ముందున్నారు. ఓట్ల కోసం ఇచ్చే హామీలు.. అమల్లోకి వచ్చేసరికి బుట్టదాఖలవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు సైతం మహిళలను అక్షరాస్యులను చేయలేకపోతున్నాయి. అదేవిధంగా అత్యాచార బాధితుల సంఖ్యను చూస్తే జిల్లా తలదించుకోవాల్సిన పరిస్థితి.
నిర్భయ చట్టాలు కూడా మహిళలను కాపాడలేకపోతున్నాయి. జిల్లాలో పురుషుల్లో 75.74 శాతం మంది అక్షరాస్యులుండగా, స్త్రీలు 61.99 శాతం మాత్రమే ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13 శాతానికిపైగా అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారు. గ్రామీణ మహిళల కోసం ప్రవేశపెట్టిన వయోజన విద్య కనిపించడం లేదు. మాతాశిశు సంరక్షణపై అవగాహన కల్పించటంతో పాటు మహిళలకు అక్షరాలను నేర్పాలనిదే అంగన్‌వాడీ విధుల్లో ఒకటి. అయితే ఆ కేంద్రాలే తీవ్ర దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
మహిళలకు రక్షణ కరువు
జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. గతేడాదిలో అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, వరకట్న హత్యలు, వేధింపులకు గురైన మహిళలు మొత్తం 968మంది ఉన్నారు. 67మంది అత్యాచారానికి గురయ్యారు. 29మంది హత్యకు గురయ్యారు. 32మంది మహిళలు వివిధరకాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వరకట్నం కోసం ఇద్దరు మహిళలను హత్యచేయగా, 143మంది మహిళలను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. 64 మంది మహిళలను కిడ్నాప్ చేయగా... 264మంది మహిళలు వివిధ రకాలగా వేధింపులకు గురవుతున్నట్లు కేసులు ఉన్నాయి. బహుభార్యత్వం కేసులు 24 నమోదయ్యాయి. ఇదిలా ఉంటే భ్రూణహత్యలు లెక్కలేనన్ని చోటుచేసుకుంటున్నాయి.
చట్టసభల్లో భర్త చాటు భార్యలే: మహిళలను చట్టసభలకు ఎంపిక చేస్తున్నప్పటికీ అనేకమంది ఇంకా భర్తచాటు భార్యలుగానే ఉండిపోతున్నారు. జిల్లాలో 569 సర్పంచ్‌లు, 362 ఎంపీటీసీ సభ్యులు, 32మంది ఎంపీపీలు, 24 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఎంపికయ్యారు. అదేవిధంగా మరో ఐదుగురు మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. ఇకపోతే ప్రభుత్వ అధికారుల విషయానికి వస్తే ఐదుగురు జిల్లా ఉన్నతాధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 36 మంది తహశీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు 9వేలమందికిపైనే ఉన్నారు. వీరిలో అనేకమంది మహిళా ప్రజాప్రతినిధులను వంటింటికే పరిమితం చేసి భర్తలు పెత్తనం చెలాయిస్తుండటం గమనార్హం.