బాధితులకు పునరావాసం కల్పించాలి
కలెక్టర్ టీకే శ్రీదేవి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: అత్యాచారాలకు గురైన వారికోసం ప్రత్యేకంగా పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడం, పునరావాస కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కాడ్‌లు అప్రమత్తంగా ఉండి అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అత్యాచార బాధితులకు పునరావాస కార్యక్రమాలతో పాటు ముందుగా వారి కోసం ప్రత్యేక హోంలు, సదనాలను ఏర్పాటు చేయాలన్నారు.
సదనాలలో అత్యాచార బాధితులను, ఇతరులను వేర్వేరుగా ఉంచాలని సూచించారు. అక్రమ రవాణాద్వారా పట్టుబడిన వారికి మానసిక, ఆరోగ్య చికిత్సలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించాలని, వారి పిల్లలకు విద్య, రక్షణ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. పునారావాస కార్యక్రమాల్లో భాగంగా తక్షణ ఆర్థిక సాయం అందజేయడంతో పాటు వివిధ వృత్తులలో శిక్షణ ఇప్పించి, వారు శాశ్వతంగా జీవనోపాధి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వారి వైఖరి అలవాట్లలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని, ఆరోగ్య, న్యాయపరమైన సలహాలు ఇచ్చేందుకు కౌన్సిలర్‌లను హోంలకు పంపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వాధార్ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని అన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ జ్యోత్స్న, డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్‌ల ఈడీలు సర్వయ్య, రాజేందర్, ఐటీడీఏ పీఓ వెంకటయ్య, డీఈఓ విజయలక్ష్మీబాయి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసరావు, స్వాధార్ ఎన్‌జీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.