గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నవలలో బుచ్చమ్మకి బాల్య వివాహం చేస్తాడు తండ్రి అగ్నిహోత్రావధాని. బాల్యంలోనే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరుతుంది బుచ్చమ్మ. కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం’లో కాళింది నూతిలో దూకి మరణిస్తుంది. ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఆరు పదులు నిండిన వృద్ధులకిచ్చి వివాహం చేయడం అప్పట్లో ఓ దురాచారం. జీవితం అంటే ఏంటో తెలిసే లోపుగానే వారి జీవితం ముగిసిపోయేది. సుమారు యాభై ఏళ్ల క్రితం వరకు కూడా బాల్య వివాహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఎంతోమంది సంస్కర్తలు ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి, రూపుమాపేందుకు కృషి చేశారు. ప్రభుత్వాలు కూడా చట్టాలు తెచ్చాయి. ఫలితంగా బాల్యవివాహాలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత తగ్గిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అక్షరాస్యత, జీవన ప్రమాణాల స్థాయి వంటివి పెరగడం కూడా ఇందుకు కారణం.
బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 15–19 మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లల వివాహాలు 6.4 శాతానికి తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ శాతం మరింత తక్కువగా ఉంది. బాల్యంలోనే వివాహాలు కావడం వల్ల టీనేజ్‌లోకి వచ్చేసరికి గర్భం ధరించి, మాతృత్వం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే తల్లులైపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఉన్నత పదవులు అలంకరించలేకపోతున్నారు. ఆడపిల్లలు ఉన్నతవిద్యలు అభ్యసించాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో అర్థం చేసుకోవాలి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. అవన్నీ జరగాలంటే.. బాల్య వివాహాల నుంచి వారిని కాపాడే చట్టాలు మాత్రమే కాదు, మనుషులూ ఎప్పుడూ నిఘావేసి ఉంచాలి.
– రోహిణి
బాల్యం పెరుగుతోంది
Published Thu, Feb 21 2019 12:03 AM | Last Updated on Thu, Feb 21 2019 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment