మూసీ రివర్ ఫ్రంట్ –పునరావాసంపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు.
ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు.
ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి
ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి
ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు.
నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment