బాల్యానికి పెళ్లి బంధనం | Child Marriage: A Violation of Child Rights | Sakshi
Sakshi News home page

బాల్యానికి పెళ్లి బంధనం

Published Sat, Jul 27 2024 10:55 AM | Last Updated on Sat, Jul 27 2024 10:55 AM

Child Marriage: A Violation of Child Rights

నిమిషానికి ముగ్గురు బాలికలు బలవంతంగా పెళ్లి బంధంలో చిక్కుకుంటున్నారు. బాల్య వివాహాలను 1929లోనే నిషేధించింది ప్రభుత్వం. మరింత కట్టుదిట్టం చేస్తూ కఠినమైన శిక్షలతో ప్రోహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ – 2006’ను తెచ్చింది. అయినప్పటికీ ఏడాదికి 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అంచనా. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నిర్వహించిన సర్వే చెబుతున్నదిదీ. తాజా అధ్యయనాలు చెబుతున్న మరో వాస్తవం ఏమిటంటే... 20– 24 ఏళ్ల వివాహిత మహిళలను పెళ్లి నాటికి వాళ్ల వయసు ఎంతని అడిగితే వారిలో 23.3 శాతం మంది పద్దెనిమిదేళ్లలోపే పెళ్లయినట్లుచెప్పారు.

కోవిడ్‌కు ముందు 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు కోవిడ్‌ సమయంలో 33 శాతానికి పెరిగాయి. ఇది దేశ సరాసరి లెక్క. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా మార్చిన కలెక్టర్‌లకు అవార్డులు ప్రకటించారు. అప్పుడు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ జిల్లాలో బాల్యవివాహం జరగకుండా నివారించి అవార్డు అందుకున్నారు. 

ఒకప్పుడు తమిళనాడులో బాల్యవివాహాలు ఎక్కువగా ఉండేవి. జయలలిత ముఖ్యమంత్రిగా బాల్యవివాహాలను నివారణ కోసం ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం దేశ సరాసరి కంటే చాలా మెరుగ్గా ఉంది.

కర్నాటక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించి రిటైర్డ్‌ జడ్జ్‌ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేస్తూ ప్రచారం నిర్వహించి సమాజంలో మార్పు తెచ్చుకుంది.

అస్సాం, వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు పదేళ్లలోపే పెళ్లి చేసే ఆచారం ఉండేది. అస్సాం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా వేగంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.

బాల్య వివాహాలను అరికట్టాలంటే... ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ... ఈ ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

తొలి లెక్క పాఠశాల నుంచే!
కోవిడ్‌ సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కి 5,500 కాల్స్‌ వచ్చాయి. బాల్యవివాహం బారిన పడుతున్న అమ్మాయిలు, వారి స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ అవి. ఫోన్‌ కాల్స్‌ కూడా రాకుండా జరిగి΄ోయిన పెళ్లిళ్లు ఎన్నో. కోవిడ్‌ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నప్పుడు తిరిగి స్కూల్‌కి వచ్చిన అమ్మాయిల లెక్క ఏ శాఖ దగ్గరా లేదు. పంచాయితీ సెక్రటరీ గ్రామస్థాయి చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రోహిబిషన్‌ ఆఫీసర్‌. ΄ాఠశాల రిజిస్టర్‌ నుంచి మొదలు పెడితే కచ్చితమైన లెక్కలు రాబట్టవచ్చు.ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కి కొనసాగే వాళ్లు 63 శాతం మాత్రమే. 

టెన్త్‌ పాసయిన అమ్మాయిల్లో కాలేజ్‌కెళ్లేవాళ్లు పాతిక శాతం మాత్రమే. మండలాల్లో కూడా కాలేజ్‌లు పెడితే ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతారు. చదువుకుంటే బాల్య వివాహాలు వాటంతట అవే ఆగిపోతాయి. సామాజిక కార్యకర్తగా ఇరవై వేల బాల్య వివాహాలను ఆపగలిగాను. కొందరు మాత్రం మేము రాత్రంతా కాపు కాసి తెల్లవారు జామున అలా పక్కకు వెళ్లగానే తాళి కట్టించేసే వాళ్లు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నేను స్వయంగా 78 కేసులు వేశాను. ఒక్క కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement