పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది.
నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు.
ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు.
నైజీరియా కోర్టు సంచలన తీర్పు
21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment