child rights
-
బాల్యానికి పెళ్లి బంధనం
నిమిషానికి ముగ్గురు బాలికలు బలవంతంగా పెళ్లి బంధంలో చిక్కుకుంటున్నారు. బాల్య వివాహాలను 1929లోనే నిషేధించింది ప్రభుత్వం. మరింత కట్టుదిట్టం చేస్తూ కఠినమైన శిక్షలతో ప్రోహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ – 2006’ను తెచ్చింది. అయినప్పటికీ ఏడాదికి 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అంచనా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన సర్వే చెబుతున్నదిదీ. తాజా అధ్యయనాలు చెబుతున్న మరో వాస్తవం ఏమిటంటే... 20– 24 ఏళ్ల వివాహిత మహిళలను పెళ్లి నాటికి వాళ్ల వయసు ఎంతని అడిగితే వారిలో 23.3 శాతం మంది పద్దెనిమిదేళ్లలోపే పెళ్లయినట్లుచెప్పారు.⇒కోవిడ్‌కు ముందు 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు కోవిడ్ సమయంలో 33 శాతానికి పెరిగాయి. ఇది దేశ సరాసరి లెక్క. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు.⇒ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా మార్చిన కలెక్టర్లకు అవార్డులు ప్రకటించారు. అప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ జిల్లాలో బాల్యవివాహం జరగకుండా నివారించి అవార్డు అందుకున్నారు. ⇒ఒకప్పుడు తమిళనాడులో బాల్యవివాహాలు ఎక్కువగా ఉండేవి. జయలలిత ముఖ్యమంత్రిగా బాల్యవివాహాలను నివారణ కోసం ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం దేశ సరాసరి కంటే చాలా మెరుగ్గా ఉంది.⇒కర్నాటక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేస్తూ ప్రచారం నిర్వహించి సమాజంలో మార్పు తెచ్చుకుంది.⇒అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు పదేళ్లలోపే పెళ్లి చేసే ఆచారం ఉండేది. అస్సాం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా వేగంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.⇒బాల్య వివాహాలను అరికట్టాలంటే... ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ... ఈ ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధితొలి లెక్క పాఠశాల నుంచే!కోవిడ్ సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కి 5,500 కాల్స్ వచ్చాయి. బాల్యవివాహం బారిన పడుతున్న అమ్మాయిలు, వారి స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అవి. ఫోన్ కాల్స్ కూడా రాకుండా జరిగి΄ోయిన పెళ్లిళ్లు ఎన్నో. కోవిడ్ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నప్పుడు తిరిగి స్కూల్‌కి వచ్చిన అమ్మాయిల లెక్క ఏ శాఖ దగ్గరా లేదు. పంచాయితీ సెక్రటరీ గ్రామస్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ ఆఫీసర్. ΄ాఠశాల రిజిస్టర్ నుంచి మొదలు పెడితే కచ్చితమైన లెక్కలు రాబట్టవచ్చు.ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కి కొనసాగే వాళ్లు 63 శాతం మాత్రమే. టెన్త్ పాసయిన అమ్మాయిల్లో కాలేజ్కెళ్లేవాళ్లు పాతిక శాతం మాత్రమే. మండలాల్లో కూడా కాలేజ్‌లు పెడితే ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతారు. చదువుకుంటే బాల్య వివాహాలు వాటంతట అవే ఆగిపోతాయి. సామాజిక కార్యకర్తగా ఇరవై వేల బాల్య వివాహాలను ఆపగలిగాను. కొందరు మాత్రం మేము రాత్రంతా కాపు కాసి తెల్లవారు జామున అలా పక్కకు వెళ్లగానే తాళి కట్టించేసే వాళ్లు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నేను స్వయంగా 78 కేసులు వేశాను. ఒక్క కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్ సంచలన ఆరోపణలు
బాలల హక్కుల సంఘం చీఫ్ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్ కమిషన్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్ మీడియా వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ కమీషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డబ్ల్యూసీపీసీఆర్) చీఫ్ సుదేష్నా రాయ్ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్సీపీసీఆర్ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు. (చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం) -
పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్! అని పిలవకూడదు!
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్, మేడమ్ వంటి పదాలతో సంభోదించకూడదట. కేవలం "టీచర్" అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో "టీచర్" అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంత చేయాలని కోరుతూ..ఒక వ్యక్తి దాఖలు చేసిని పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి) -
భారతావనికి బాలలే భారమా?
పీడిత సమాజంలో పీడనకు ఒక వర్గం బాలలు బలవుతున్నారు. అందుకే బాలలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో భారత సమాజం ఉందంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మూడు వంతులుగా ఉన్న బాలల స్థితిగతులను పరిశీలించాల్సిందే. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బాలల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాలు రూపొం దాయి. ప్రత్యేక హక్కులు బాలలకు దఖలు పడ్డాయి. ఇవి భారతదేశంలో 1992 నుండి అమలులోనికి వచ్చాయి. వివక్ష లేకుండా అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, జీవించే హక్కును కలిగి ఉండటం బాలల హక్కుల మూల సూత్రాలు. పేదరికం కారణంగా చదువుకి దూరమై కష్టతరమైన పనులు చేస్తూ గడపాల్సిన దుఃస్థితిలో బాలలు ఇప్పటికీ ఉన్నారు. కనీసం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకునే చదువు వరకు కూడా వెళ్లలేకపోతున్నారు. 5 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలలో ప్రతి 8 మందిలో ఒకరు తమ కోసమో, తమ కుటుంబం కోసమో పాలబుగ్గల ప్రాయంలోనే పనివారుగా మారుతున్నారు. 29 శాతం ప్రాథమిక విద్యకు ముందే బడి మానేస్తున్నారు. వీరిలో అట్టడుగు వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వల్ల 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే బాలలు డ్రాపవుట్లుగా మారే ప్రమాదముంది. జాతీయ నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమలైతే బాలలు యాచకులుగా, బాల కార్మికులుగా, వలస బాధితులుగా, నేరగాళ్లుగా తయారయ్యే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోనికి రాగానే బాలకార్మికుల పనికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఏ దేశంలో కూడా ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. బాలలే ఈ సమాజానికి పెట్టుబడి అని ఒకవైపు అంటూనే ఇటువంటి చట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇందువల్ల పిల్లలు కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)... భారత్‌లో ప్రతి 100 మందికి 79 మంది బాలలు రక్త హీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. శారీరక ఎదుగుదల లేని బాలలు 64 శాతం మందీ, తగినంత బరువులేని బాలలు 43 శాతం మందీ ఉన్నారనీ, ప్రతి ఏటా అంధత్వంతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారనీ డబ్ల్యూహెచ్ఓ తేటతెల్లం చేసింది. శిశు సంరక్షణకూ, బాలల ఆరో గ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక పోవడం కార ణంగా మన దేశంలో బాలల పరిస్థితి ఇంతగా దిగజారింది. మనసుంటే ప్రస్తుతం ఉన్న వనరులూ, చట్టాల తోనే బాలల స్థితిగతులను మెరుగుపరచవచ్చని కేరళ రాష్ట్రం నిరూపించింది. బాలలకు పౌష్టికాహారం అందించడంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. విద్యా రంగంలో మోడల్‌గా ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఐఎఫ్ఆర్ లీడ్లు సంయుక్తంగా 24 సూచికలతో చేసిన సర్వేలో కేరళ చిన్నారుల సంక్షేమంలో టాప్‌లో ఉందని వెల్లడైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్ ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఈపీ అమలైతే రేపటి పౌరుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. బాలల్లో అన్నార్తులు, అనాథలు, యాచకులు, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు ఉండకూడదంటే వినాశకర సంస్కరణలు ఆపాలి, ఆగాలి. బాలలకు రాజ్యాంగం ఇచ్చే హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి శిశువుకు మంచి భవితను కోరుకునే హక్కు ఉంది. ఆ హక్కుల రక్షణకు పోరాడే వేదికలకు మద్దతునివ్వాలి. కె.విజయ గౌరి, వ్యాసకర్త యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొబైల్: 89853 83255 -
చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా ముట్టుకుంటే చెప్పేయ్
International Day of the Girl Child 2021: చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు.. ఈ వార్తలు విన్నప్పుడల్లా రగిలిపోతుంటాం. ‘అయ్యో చిట్టితల్లి’ అని కొందరు బాధపడిపోతుంటే.. ‘ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాల’ని డిమాండ్లు చేస్తుంటారు మరికొందరు. ఇంకొందరి వల్ల రకరకాల వాదనలు-చర్చలు తెర మీదకూ వస్తుంటాయి కూడా. సైదాబాద్ ఘటన అయితేనేం, లవ్‌స్టోరి సినిమాలో చూపించినట్లు అయితేనేం.. రియల్ నుంచి రీల్ లైఫ్ దాకా అంతటా ఈ ఇష్యూ తీవ్రతను తెలియజేశాయి. బయటికి వచ్చేవి కొన్నే. అసలేం జరుగుతుందో అర్థంకాక, ఎవరికి ఎలా చెప్పాలో తెలియక పిల్లలు కుంగిపోతున్నారు. ఈ తరుణంలో ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. ► అక్టోబర్ 11.. అంటే ఇవాళ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’.. అమ్మాయిల హక్కులు, భద్రత, విద్యావకాశాలు.. పై దృష్టిసారించాలని చాటిచెప్పే రోజు . ► వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ వుమెన్.. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’ నిర్వహణకు నాంది వేసింది. బీజింగ్ కాన్ఫరెన్స్-1995లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ► 2012 అక్టోబర్ 11 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ► లింగ వివక్షను దూరం చేస్తూ.. అమ్మాయిలకు భవిష్యత్ అవకాశాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి? పోటీ ప్రపంచంలో ఎలా రాటుదేలాలో అవగాహన కల్పించాలని చెబుతుంది ఈ రోజు. శారీరక కోరికలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు.. ఇతరుల శరీరాన్ని ముట్టుకోవడం ద్వారా వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారు కొందరు. పిల్లలను చెడు ఆలోచనలతో తాకడం కూడా ఈ కోవకే చెందింది. చూసేవాళ్లకు ఇది మాములుగానే అనిపించొచ్చు. కాస్త ఎదిగిన పిల్లలకు తాకే వ్యక్తుల మనస్తతత్వం తేలికగానే అర్థమైపోతుంది. కానీ, చిన్న వయసులో అది అర్థం కాకపోవచ్చు. ఇంట్లో వాళ్ల లాగే ప్రేమతో వాళ్లు ముట్టుకుంటున్నారనుకుంటారు. అందుకే అనురాగంతో తాకటం, కోరికలతో తాకటం మధ్య తేడాల్ని పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖచ్ఛితంగా తెలుసుకోవాలి ‘తన తండ్రి భుజాల మీద చేయి వేసినప్పుడు కలిగే స్పర్శ తన రక్షణ కోరుతుంది. కానీ, ఎవరైనా దురుద్దేశంతో తాకినప్పుడు ఆ స్పర్శ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఒక్కోసారి సొంతవాళ్ల నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావొచ్చు!. బెదిరించో, భయపెట్టో పదేపదే అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. అందుకే గుడ్‌టచ్, బ్యాడ్టచ్ల మధ్య తేడాల్ని పిల్లలకు చెప్పాలి. తమను తాము రక్షించుకోవడానికి పిల్లలకూ అవకాశం కల్పించాలి. అదే టైంలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ.. వాళ్లకు అలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురవుతున్నాయా? అని తెలుసుకోవడంతో పాటు వాళ్లలో ధైర్యమూ నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ► పిల్లలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌ల మధ్య తేడాను తెలియజేయాలి ► అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి ► మొహమాటం అనిపిస్తే తల్లిదండ్రులూ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ► తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే.. చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది ► టీచర్లు సైతం పిల్లల మానసిక పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలి.. అవసరమైతే ఇందుకోసం శిక్షణ తీసుకోవాలి International Girl Child Day.. ఈ ఇయర్ థీమ్ ‘డిజిటల్ జనరేషన్.. అవర్ జనరేషన్’. ♦ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది.. అదీ 25 ఏళ్లలోపు ఇంటర్నెట్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు. వీళ్లలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉంది. జెండర్-డిజిటల్ డివైడ్‌ను సూచించేదిగా ఉన్నాయి ఈ గణాంకాలు. అందుకే సాంకేతికంగా అమ్మాయిలు రాణించాలని, అందుకు అవసరమైన తోడ్పాడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చాటి చెప్పడం ఈ ఏడాది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ థీమ్. పేరెంట్స్ బ్రెయిన్‌వాష్ లైంగిక వేధింపులకు గురయ్యే బాలికను త్వరగా గుర్తించొచ్చు. మానసికంగా వాళ్లలో మార్పులొస్తాయి. ఇంట్లోవాళ్లతోనే కాదు.. సొసైటీతోనూ డిటాచ్మెంట్ కోసం ప్రయత్నిస్తారు. నిద్రలో కలవరపాటుకు గురవుతుంటారు. సరిగా తినకపోవడం, భయాందోళనలు పెరిగిపోవడం గమనించొచ్చు. అందుకే పిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోనూ తమ శరీర భాగాల్ని ఎవరైనా తాకడం చేస్తే.. వారు భయాందోళనకు గురికాకుండా గట్టిగా తిరస్కరించాలి. తమకు నమ్మకస్తులైన పెద్దవారెవరైనా దగ్గరలో ఉంటే విషయాన్ని వివరించాలి. లేదా తల్లిదండ్రులకైనా ఆ విషయం చెప్పాలి. అలాగనుక జరిగితే నేరస్తుడు తప్పించుకోలేడు. మరిన్ని అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి ఇదంతా పిల్లలకు చెప్పాల్సింది ఎవరు? ఇంకెవరు తల్లిదండ్రులు, ఇంట్లోవాళ్లు, టీచర్లే. వేధింపులకు గురైన పిల్లలకు మానసిక వైద్యుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాలి. గతాన్ని మరచిపోయి వారి జీవితంలో చీకట్లను పారదోలాలి. ఈరోజుల్లో పిల్లలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి రాగానే.. ‘న్యాయం’ పేరిట బాధితురాలి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేస్తున్నారు కొందరు. అయితే పోక్సో చట్టం ప్రకారం.. పేర్లతో సహా వాళ్ల ఐడెంటిటీకి సంబంధించి ఎలాంటి వివరాల్ని ప్రదర్శించినా అది నేరమే అవుతుంది! దేశంలో ఫస్ట్ టైం.. స్కూల్ దశలోనే పిల్లలకు ‘గుడ్ టచ్- బ్యాడ్ టచ్’ పేరిట అవగాహన కల్పించేందుకు (బొమ్మల పాఠాల రూపంలో) గుజరాత్‌లోని వడోదర పోలీసులు నడుం బిగించారు. మూడేళ్ల క్రితం అప్పటి సిటీ డీసీపీ సరోజ్‌కుమారి, డిపార్ట్మెంట్లో పని చేసే 12 మంది మహిళా పోలీసులతో ‘సమాజ్ స్పర్శ్ కీ’ (ఎస్ఎస్కే)అనే గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి దేశంలో ఈ తరహా పాఠాలు పిల్లలకు చెప్పే కార్యక్రమం ఇదే మొదటిది! అలా మూడేళ్లుగా వీళ్ల కృషి కొనసాగుతోంది. - సాక్షి, వెబ్ స్పెషల్ -
కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పీ అచ్యుతరావు కరోనా బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద ఆసుపత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. అచ్యుత రావు అకాలమరణంపై పలువురు ప్రజా సంఘ నేతలు, ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు. బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన అచ్యుతరావు బాలలు, శిశు హక్కుల సంరక్షణ నిమిత్తం అనేక పోరాటాలు నిర్వహించిన సంగతి విదితమే. భార్య అనూరాధతో బాలల హక్కుల సంఘాన్ని స్థాపించిన అచ్యుత రావు గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్సీపీసీఆర్) సభ్యుడుగా పనిచేశారు. చదవండి: అనాథల పట్ల ముందు జాగ్రత్త అవసరం -
బాలికా విద్యకు అదే విఘాతం..!
సాక్షి, హైదరాబాద్: ఒకరిపై ఆధారపడి స్కూల్‌కు వెళ్లే బాలికలు అశక్తులుగా మారుతున్నారని.. దాదాపు 90 శాతం మందిపై ఈ ప్రభావం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై) హరియాణా, బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లే బాలికల ప్రతికూల, అనుకూల అంశాలపై అధ్యయనం నిర్వహించింది. అలాగే ప్రభుత్వాల వివిధ పథకాలు దేశంలో బాలికలను విద్య వైపు ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఎవరో ఒకరిపై ఆధారపడుతూ విద్యాసంస్థలకు వెళ్లడం బాలికలను అశక్తులుగా మారుస్తుందని.. దీని ప్రభావం 90 శాతం మంది బాలికలపై ఉందని అధ్యయనం వివరించింది. ‘తరచుగా స్కూళ్లకు గైర్హాజరయ్యే బాలికలు 29 శాతం ఉంటే, మహిళా టీచర్లు లేక 18 శాతం మంది స్కూళ్లకు హాజరుకావడం లేదు. ఇవి బాలికలను మధ్యలోనే స్కూల్ మానివేసే పరిస్థితికి తీసుకొస్తున్నాయి..’అని నివేదికలో పేర్కొంది. ఇక తరచూ అనారోగ్యం కారణంగా 52 శాతం మంది, ఇంటిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 46 శాతం మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరువుతున్నారని.. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన బాలికల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిపింది. అలాగే మౌలిక వసతులు, సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేక చాలామంది బాలికలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారంది. 87 శాతం స్కూళ్లు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల్ని కోరినట్లు సీఆర్‌వై నివేదికలో తెలిపింది. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లోని 1,604 ఇళ్లలోని 3 వేలకు పైగా మంది అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు సీఆర్‌వై వెల్లడించింది. -
ఆటపాటలకు ఓటేద్దాం..!
ఆట – పాట, తుళ్లింత – కేరింత, ఉత్సాహం – సంతోషం, ఆశలు – ఆకాంక్షలు, నవ్వులు – పువ్వులు.. మెరుపు మెరిస్తే.. హరివిల్లు విరిస్తే.. అది తమ కోసమేనని మురిసిపోయే బాల్యం అమూల్యం. పిల్లల ఆనందం ఆకాశమంత! ఇదంతా నాణేనికి ఒకవైపు. ఉత్తుంగ తరంగాలై ఉప్పొంగే ఆ చిన్నారి లోకానికీ ఎన్నో కలలుంటాయి. మనసు విప్పి చెప్పుకోలేని మాటలుంటాయి. వారి గుండె లోతు అగాథమంత. మన పార్టీలు, వాటి మేనిఫెస్టోలు ఆ లోతును కొలుస్తున్నాయా? అటువైపు చూస్తున్నాయా? ఎన్నికల వేళ చిన్నారుల కలలను పండించే.. పండుగ చేసే అంశాలను చర్చిద్దాం. నేడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల గుండె గొంతుకను విందాం. రేపటి తరానికి ప్రతినిధులుగా, భావి భారత నిర్మాతలుగా ఎదగాల్సిన బాలలపై నిర్లక్ష్యపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోషకాహారలేమి, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పేదరికం కారణంగా చదువుకోలేని దుస్థితి పిల్లలను వెంటాడుతోంది. ఇంట్లో, బడిలో, తల్లిదండ్రులు, గురువుల సంరక్షణలో ఎదగాల్సిన పిల్లలు వీధుల పాలవుతున్నారు. బాల్యవివాహాల కారణంగా మాతాశిశు మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక రకాల హామీలతో మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. కానీ వీటిలో పిల్లల హక్కులు, భద్రత ఊసే ఉండదు. చిన్నారుల ఆకాంక్షలు ప్రతిబింబించవు. బహుశా వారు ఓటర్లు కాదనేది పార్టీల అభిప్రాయం కావచ్చు. ఈ కారణంగానే ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో చిన్నారులకు సంబంధించిన హక్కులు, రక్షణ తదితర అంశాలపై ప్రస్తావనే ఉండటం లేదు. ఎడారిలో ఒయాసిస్సు... ఒక అంచనా మేరకు తెలంగాణలో సుమారు 62 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 34 లక్షల మందికి పైగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటుండగా, మరో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో చదువుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ లోపం, బోధన సరిగా ఉండకపోవడం వంటి కారణాల వల్ల పిల్లలు నాణ్యమైన చదువులకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎండమావిగానే మారింది. పోషకాహారలేమి, పటిష్టమైన బోధన లేమి, పేదరికం కారణంగా చాలామంది పిల్లలు పదో తరగతితోనే ఆపేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ లేక ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఇక్కడ ర్యాంకుల వెంట పరుగెత్తించే పరికరాలుగా పిల్లల్ని మార్చేస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న బాల్య వివాహాలు ‘‘వేసవి.. పిల్లలకు ఆటవిడుపు కాలం. కానీ, ఆ సంతోషం లేకుండానే తల్లిదండ్రుల బలవంతపు పెళ్లిళ్లకు పిల్లలు తలవంచుతున్నారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల అమ్మాయిలు బాల్య వివాహాలకు సమిధలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణాలు, నగరాల్లోనూ ఈ దారుణం కొనసాగుతోంది’’ అని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అంటున్నారు. ప్రభుత్వం రికార్డుల ప్రకారం 2016లో 416 మందికి, 2017లో 360 మందికి బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 150కి పైగా గుర్తించారు. లెక్కలోనికి రానివి వేలల్లో ఉన్నట్లు అంచనా. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు కావడం వల్ల, పోషకాహారలేమి, రక్తహీనతతో ప్రసూతి మరణాల బారిన పడుతున్నారు. ఇలాంటి తల్లులకు పుట్టే పిల్లల్లో సరైన ఎదుగుదల లేకప్రతి ఐదుగురిలో ఒక్కరు పురిట్లోనే కన్నుమూస్తున్నారు. అక్కరకు రాని ‘పోక్సో’ లైంగిక అత్యాచారాలు, వేధింపులు చిన్నారులపై నిత్యకృత్యంగా మారాయి. ఇల్లు, వీధి, బడి, రోడ్డు అనే తేడా లేకుండా పిల్లలు ఈ దారుణహింసకు గురవుతున్నారు. అసహజ లైంగిక చర్యలకు బలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇలాంటివి 1,064 కేసులు నమోదైనట్లు అంచనా. కానీ ఠాణా మెట్లెక్కనివి అంతకు రెట్టింపే. అత్యాచార బాధిత చిన్నారుల కోసం పోక్సో వంటి పటిష్టమైన చట్టాలున్నా.. అమలు అంతంతే. ఈ చట్టం ప్రకారం పోలీసులే బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సత్వరమే వైద్యసహాయం అందజేయాలి. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిం చాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు బాధిత చిన్నారులకు రూ.లక్ష పరిహారంగా అందజేయాలి. కానీ ఒక్క కేసులోనూ పరిహారం అందింది లేదు. ఊగని ’ఊయల’ వివిధ కారణాలతో శిశువులు చెత్తకుండీల పాలుకావద్దనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ’ఊయల’ పథకానికి శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ, ఎమ్మార్వో ఆఫీస్, ప్రసూతి ఆసుపత్రుల వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఊయలలను ఏర్పాటు చేయాలి. పిల్లలను భారంగా భావించే వాళ్లు వీటిలో వేసి వెళ్లవచ్చు. ఈ పిల్లల పోషణ, చదువు, భవిష్యత్తు ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ ఈ పథకం సరిగా అమలు కావట్లేదు. ఈ ఏడాది ఇప్పటికి 93 మంది పిల్లలు చెత్త కుప్పల్లో, పేవ్మెంట్లపై లభించినట్లు అంచనా. మరోవైపు ఆదరణ లేక 10 వేల మంది చిన్నారులు అనాథాశ్రమాలలో మగ్గిపోతున్నారు. ‘పిల్లలకు హక్కులుంటాయని పార్టీలు గుర్తించవు.. ఎందుకంటే పిల్లలకు ఓటు హక్కు లేదు!’ – రెనెటా వింటర్, చైర్పర్సన్, సీఆర్సీ (బాలల హక్కుల కమిటీ) ఏ దేశంలోనైనా ఎన్నికలంటే పెద్దవాళ్లకు పరిమితమైన కోలాహలంగానే పరిగణిస్తారు. వివిధ వర్గాలు, జాతులు, మతాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో పార్టీలు పలు హామీలు గుప్పిస్తుంటాయి. కానీ అన్ని మతాల్లో, జాతుల్లో, వర్గాల్లో ఉమ్మడిగా కనిపించే పిల్లల కోసం ఆలోచించే పార్టీలు, ప్రభుత్వాలు తక్కువే. మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. చిన్న పిల్లలకు, వారి హక్కులకు అభివృద్ది చెందిన దేశాలు ప్రాధాన్యమిస్తాయి. మన దగ్గర పార్టీలు తన మేనిఫెస్టోల్లో మొక్కుబడిగా స్త్రీ, శిశుసంక్షేమం గురించి లోతైన పదాలతో తోచింది రాసి వదిలేస్తాయి. పిల్లల హక్కులు మూడు ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ప్రకారం పిల్లలకు 3 రకాల హక్కులుంటాయి. జీవించే హక్కు: పోషణ, ఆవాసం, వైద్యం పొందే హక్కు, సరైన జీవన ప్రమాణాలను కోరుకునే హక్కు అభివృద్ది హక్కు: సరైన విద్య, క్రీడలు, విశ్రాంతి, సాంస్కృతిక కార్యక్రమాలను అందుకునే హక్కు. ఆలోచనల్లో స్వేచ్ఛ, మత స్వేచ్ఛ లభించే హక్కు రక్షణ హక్కు: న్యాయపరమైన కఠిన శిక్షల నుంచి రక్షణ, బాలకార్మికతను తిరస్కరించే హక్కు. అన్ని రకాల వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు. మన దేశంలో.. - మొత్తం జనాభాలో 36 శాతం మంది చిన్న పిల్లలే. - కోటిమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. - మూడింట ఒక వంతు పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. - 1.5 కోట్లకు పైగా బాల కార్మికులున్నారు. గతంలో ఏం చెప్పాయి? ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోల్లో పిల్లల సంరక్షణకు పెద్దపీట వేశాయి. సర్వశిక్షా అభియాన్‌ను సమర్థవంతంగా తీర్చిదిద్దటం, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతం చేయడం, విద్యా విధానం డిజిటలైజేషన్, జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు, పాఠశాలల్లో పరిశుభ్రత కల్పించడం, పుస్తకాల భారం లేకుండా సాంకేతికత వినియోగం, బాలికా విద్యకు ప్రోత్సాహం, విద్యా హక్కు, ఆహార భద్రతా చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం, బాల కార్మిక చట్టం బలోపేతం.. వీటిలో పూర్తిగా అమలైన హామీలు వేళ్లపై లెక్కించేవే. పిల్లల కోసం ప్రభుత్వాలు, పార్టీలు పెద్దగా స్పందించకున్నా, పలు ఎన్జీఓలు, ఇతర సంస్థలు పలు కార్యక్రమాలు రూపొందించి, పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నాయి. ఈసారి ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు బాలల డిమాండ్లను పార్టీలకు అందిస్తున్నాయి. రేపటి పౌరుల కోసం.. - తమకేం కావాలో పిల్లలే పార్టీలకు తెలియజేసే సంఘటన రాజస్తాన్‌లో జరిగింది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్ర వాతావరణం తదితర అంశాలపై తమ డిమాండ్లను పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాలని స్కూలు పిల్లలు కోరారు. - బ్రిటన్‌లో లేబర్, కన్జర్వేటివ్ పార్టీలు పిల్లల విద్యపై ప్రత్యేకంగా తమ మేనిఫెస్టోల్లో పేర్కొంటాయి. ఏటా ఎన్ని కొత్త స్కూళ్లు నిర్మిస్తామో చెబుతాయి. - విద్యార్థుల స్కూల్‌బ్యాగ్ బరువు వారి బరువులో 10 శాతానికి మించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. - ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రాబల్యం దృష్ట్యా.. అక్కడి పిల్లల చేతుల్లో గన్నుల బదులు పెన్నులు ఉంచుతామని పార్టీలు హామీలిచ్చాయి. - నార్వేలో ఎన్నికలకు ముందు అక్కడి ఎనిమిది ప్రధాన పార్టీలు ప్రత్యేక వీడియోల ద్వారా చిన్నారుల కోసం ఏం చేస్తాయో వివరిస్తాయి. ప్రతి పాఠశాలలో ఎన్నికల టాక్‌షోలు నిర్వహిస్తారు. పిల్లలపై పార్టీల వైఖరి ఆధారంగా అక్కడి ఓటర్లు ప్రభావితమవుతుంటారు. - నమీబియాలో వీధి బాలల వివరాల్ని కంప్యూటరైజ్ చేస్తామని అక్కడి ప్రధాన పార్టీ డీటీఏ మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ..::పగిడిపాల ఆంజనేయులు -
అవర్ ఆనర్
న్యాయదేవాలయంలో జడ్జిగారిని యువరానర్ అని సంబోధిస్తారు.ఆ దేవాలయంలోనే సమాజానికి న్యాయం దొరుకుతుందన్న నమ్మకం మనందరిదీ!!ఆ దేవాలయంలోనే మన గౌరవంకాపాడుతారన్నది కూడా మన నమ్మకం!!మన గౌరవం (ఆనర్) కోసం పోరాడటంమన బాధ్యత అయితే ఇతరుల గౌరవాన్ని తన గౌరవంగా పోరాడ్డం ఒక ప్రార్థనలాంటిది!!అసీఫా ఆత్మగౌరవాన్ని అవర్ ఆనర్‌గా... భావించారు లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారి అసీఫాను చంపేశారు. ఇప్పుడు ఆమె కేసును వాదిస్తున్న న్యాయవాది దీపికాసింగ్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీపికకు అష్టమి అనే ఐదేళ్ల కూతురు ఉంది. ‘‘అసీఫా కూడా అష్టమి లాంటిదే. అందుకే ఈ కేసును టేకప్ చేశాను’’ అంటున్నారు లాయర్ దీపిక. జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల అసీఫా అనే చిన్నారిని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపివేస్తోంది. ఈ దారుణం మీద మొట్ట మొదట రిట్ పిటీషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. లాయరే కాక ‘వాయిస్ ఫర్ రైట్స్’ అనే సంçస్థను ఆమె నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల హక్కుల కోసం పనిచేసే ‘చైల్డ్ రైట్స్ అండ్ యూ’ (క్రై)కి కూడా సేవలందిస్తారు రజావత్. చిన్నారి అసీఫా పై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలసి దీపిక కేస్ ఫైల్ చేశారు. అసీఫా వాళ్లది నిరుపేద కుటుంబం. వాళ్లకు న్యాయం దక్కలేదు. లంచం తీసుకున్న పోలీసులు సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. ఆ కుటుంబాన్ని భయపెట్టారు. నోరుమూయించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుసుకున్న దీపికా ఆ చిన్నారి తరపు వాళ్లకు న్యాయం అందించాలనుకుంది. అందుకు ఆమెకు ఎదురైందేంటో తెలుసా? ఈ కేస్ తీసుకున్న వెంటనే ఆమె బార్ మెంబర్షిప్ రద్దయింది! ఎక్కడెక్కడినుంచో, ఎవరెవరి దగ్గర్నుంచో బెదిరింపులు వచ్చాయి. అయినా భయపడలేదు ఆమె. హంతకులకు శిక్ష పడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేదిలేదని పోరాడుతోంది. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్ ‘‘హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్‌గా నాకీ ధమ్కీలు (బెదిరింపులు), బ్లాక్‌మెయిల్స్ కొత్తేం కాదు. ఎనిమిదేళ్ల బాలిక కనిపించడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు స్థానిక పోలీసులు. ఈ కేస్ తీసుకోవడానికి నాకు ఇంతకన్నా ఇంకో కారణం అవసరం లేదనిపించింది. ఈ కేసు పనిలో భాగంగా నేను జమ్మూకశ్మీర్ కోర్టుకు వెళితే ‘నువ్వు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు’ అంటూ జమ్మూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీఎస్ సలాథియా బెదిరించారు. ‘మీరు నన్ను శాసించడానికి నేను ఇక్కడి బార్ అసోసియేషన్ మెంబర్‌ను కాను’ అని చెప్పాను. ‘నిన్నెలా ఆపాలో మాకు తెలుసు’ అన్నాడు. నేను వెంటనే జమ్మూకశ్మీర్ హైకోర్ట్ చీఫ్ జస్టి్టస్కు ఓ కంప్లయింట్ ఇచ్చాను.. నాకు ఇక్కడ భద్రత లేదు రక్షణ కల్పించమని. అంతేకాదు నేను కోర్టుకు హాజరైనప్పుడల్లా నాకు రక్షణ ఏర్పాట్లు కల్పించమనీ కోరాను’’ అని చెప్పారు దీపిక ఈ పోరాటం గురించి మాట్లాడుతూ. అయితే అసీఫా కేసుతో ఆమె ఆగిపోవాలని అనుకోవడం లేదు. నిర్భయ చట్టాన్ని మించిన మరో అత్యాచార నిరోధక చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బాల ఖైదీల కోసమూ పనిచేస్తు న్నారు. దీపిక ఉద్యమిస్తోన్న మరో తాజా సమస్య ఫ్రూట్ మాఫియా. కృత్రిమ రసాయనాలతో పళ్లను పక్వానికి తెస్తున్న వ్యాపారుల మీద కేసులతో దండెత్తుతున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు. అంతులేని న్యాయ పోరాటం కొన్నేళ్ల కిందట పన్నెండేళ్ల ఓ అమ్మాయి ఒక లాయర్ ఇంట్లో అనుమానాస్పద పరిసితుల్లో మరణించింది. ఆ లాయర్ ఆ అమ్మాయిది ఆత్మహత్య అని చెప్పాడు. కాని ఆ పిల్ల తల్లిదండ్రులు అది హత్యని, తమ తరపున వాదించమనీ దీపికను కోరారు. ఆ కేసు తీసుకున్నప్పుడు కూడా లాయర్లందరూ దీపికను బెదిరించారు. బార్ సభ్యత్వం రద్దు చేసే దాకా వెళ్లారు. సాధారణంగా దీపిక ‘చైల్డ్ అండ్ విమెన్ ట్రాఫికింగ్’కు సంబంధించిన కేసులను తీసుకుంటుంటారు. నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలలో ఉంటున్న పిల్లలంతా గనుల్లో పనులకు వెళ్తారు. దాంతో అక్కడ ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారుతున్నారు. దీన్ని అరికట్టడానికి, వాళ్ల తరపున న్యాయం కోసం దీపికా సింగ్ రజావత్ పోరాడుతున్నారు. 2012లో ఓ పిల్ కూడా దాఖలు చేశారు. దాంతో గనిలో ప్రమాదాలకు గురైన వాళ్ల మీద కోర్టు ఓ సర్వే జరిపించి మనిషికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించింది. ఇది దీపిక సాధించిన మరో విజయం. ఎవరీ దీపికా సింగ్? దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్‌లోని కరిహామా. కాని 1986లో వాళ్ల కుటుంబం జమ్మూలో స్థిరపడింది. ఆమె భర్త ఆర్మీ చీఫ్‌గా రిటైరై ప్రస్తుతం బహెరెన్లో ఉంటున్నాడు. ‘‘ఎన్ని అడ్డంకులెదురైనా న్యాయాన్ని సాధించే వరకు వెనక్కి తిరిగేదే లేదు’’ అని స్పష్టం చేస్తోంది దీపికా సింగ్ రజావత్.ఈ యేడాది మొదట్లో కూడా ఒక జడ్జికి సంబంధించిన కేసులో దీపిక ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొన్నారు. ఆ జడ్జి తనింట్లో పనిచేసే అమ్మాయిని రేప్ చేశాడు. ఆ పనమ్మాయి తరపున కేస్ వాదించింది దీపిక. ఇప్పుడా జడ్జి జైల్లో ఉన్నాడు. – శరాది -
ఆలోచనల్ని ఆచరణలో పెట్టండి
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కులపై ఆలోచన చేసే వారంతా వాటిని ఆచరణలో పెట్టాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని హాకా భవన్లో కొనసాగుతున్న భరోసా కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు(బాల్యమిత్ర కోర్టు)ను ఆయన శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతపై నగరవాసులకు నమ్మకం కలిగిస్తోందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు నాల్గోదని, అయితే ప్రధాన న్యాయస్థానాలకు దూరంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు దేశంలో ఇదే మొదటిదని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళితేనే పరిష్కారం.. ‘సమాజంలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నప్పుడే వాటి పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. న్యాయస్థానాల్లోనూ కాలానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు లోక్‌అదాలత్‌లు లేవు. ఇప్పుడు వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. సమాజశ్రేయస్సు కోసం సంస్కరణల్లో భాగంగా మార్పులు వస్తాయి’ అని జస్టిస్ లోకూర్ చెప్పారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ.. దేశంలో నాలుగో బాల్యమిత్ర కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటైందన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మరొకటి ఏర్పాటు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా బాల్యమిత్ర కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. బాలలు, మహిళలకు అండగా.. ‘ఆపదలో ఉన్న బాలలు, మహిళల కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పోలీసుల నేతృత్వంలో ఏర్పాటైన భరోసా కేం ద్రం ఇది. రెండేళ్లలో భరోసా కేంద్రానికి 4 వేల ఫిర్యాదులు వచ్చాయి. న్యాయమూ ర్తుల సూచనలు, సహకారంతో బాల్య మిత్రకోర్టు ఏర్పాటు చేశాం’అని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాల్లో చైల్డ్ భవన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత, భరోసా, శాంతిభద్రతల ఇన్చార్జీ స్వాతిలక్రా మాట్లాడుతూ బాల్యమిత్ర న్యాయస్థానం ఏర్పాటులో హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయమూర్తుల ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని చెప్పారు. -
బాలికల హక్కులు సామాజిక బాధ్యతగా గుర్తించాలి
ఒంగోలు టౌన్: రాజ్యాంగపరంగా బాలికలకు కల్పించిన హక్కులు, సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బాలికా సంరక్షణతో పాటు సాధికారత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజని మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడటంతో పాటు బాలిక విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. బాలికలు బాల్యం నుంచే పలు ఆంక్షలకు గురవుతున్నారన్నారు. నేటి సమాజంలో బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, అత్యాచారాలు వంటివి అక్కడకక్కడా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సతీసహగమనం, కన్యా శుల్కం వంటి దురాచారాలను రూపుమాపినా ప్రస్తుతం బాలికలు ఎదుర్కొంటున్న ఇతర దురాచారాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. బాలికల చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీడీ జి. విశాలాక్షి, ఆంధ్రప్రదేశ్ ప్రొచైల్డ్ గ్రూపు ప్రతినిధి బీవీ సాగర్, చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. గంటకుపైగా నిలువు కాళ్లపై నిరీక్షణ జాతీయ బాలికా దినోత్సవం రోజు బాలికలు గంటకుపైగా నిలువు కాళ్లపై నిలబడాల్సి వచ్చింది. బాలికా దినోత్సవ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ప్రకటించడంతో అంతకంటే ముందుగానే పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలతో పాటు బాలురను కూడా కలెక్టరేట్‌కు తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు ర్యాలీ ప్రారంభిస్తారని మహిళా శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో పాటు బాల బాలికలు ఎదురు చూశారు. నిమిషాలు, గంటలు అవుతున్నా ఉన్నతాధికారుల జాడ మాత్రం కనిపించలేదు. 11.15 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు హడావుడిగా వచ్చి ర్యాలీకి సంబంధించిన జెండా ఊపి వెళ్లారు. అప్పటివరకు నిలువు కాళ్లపై నిరీక్షించిన బాల బాలికలు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్థానిక రామనగర్‌లోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ర్యాలీలు జరిగే ప్రతిసారీ బాల బాలికలకు పరీక్ష పెట్టడం జిల్లా యంత్రాంగానికి పరిపాటైంది. -
బాలల చట్టాలపై సరైన ప్రచారం లేదు
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ కారణాల వల్ల 18 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనా చారి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల చట్టాలపై సరైన ప్రచారం కూడా ఉండడం లేదన్నారు. యూనిసెఫ్ సహకారంతో కర్ణాటక లెజిస్లేటర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ బాలల హక్కులు, వాటి అమలు అంశంపై కర్ణాటక విధాన సభ బెంగళూరులో గురువారం ఒక రోజు లెజిస్లేటర్స్ ప్రాంతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కర్ణాటక రాష్ట్రంతో పాటు 8 దక్షిణాది రాష్ట్రాల్లోని 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ.. బాలల హక్కుల చట్టాల పట్ల సమాజానికి ఏరకమైన అవగాహన కల్పించామనే అంశాన్ని ప్రజా ప్రతినిధులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల విషయంలో తీసుకుంటున్న అంశాలను ఆయన వివరించారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడూతూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బాలల హక్కులు, అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ నుంచి మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, వివేకానందా, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, భాను ప్రసాద్, గంగాధర్ గౌడ్, భూపతిరెడ్డి, ఆకుల లలిత, అసెంబ్లీ సహాయ కార్యదర్శి కరుణాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారని స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. -
ఫోక్సో ఇ–బాక్స్‌తో లైంగిక వేధింపులకు చెక్
– కరపత్రం విడుదల చేసిన డీఐజీ రమణకుమార్ కర్నూలు: బాలలపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఫోక్సో ఇ–బాక్స్ ఏర్పాటయ్యిందని డీఐజీ రమణకుమార్ తెలిపారు. చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రొ చైల్డ్ గ్రూప్(విజయవాడ) సంయుక్తంగా రూపొందించిన ఫోక్సో ఇ–బాక్స్ కరపత్రాలను శనివారం డీఐజీ రమణకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఆదోని, కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల సమన్వయ కర్తలు వెంకటరమణయ్య, ఈగల శ్రీనివాసులు, డి.వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు, ఉపాధ్యాయులకు ఫోక్సో ఇ–బాక్స్‌పై అవగాహన కల్పిస్తామని సమన్వయకర్తలు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి చేసిన సర్వేప్రకారం 18 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలు 53 శాతం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఇళ్లలో, బడులలో ఎదుర్కొంటున్నారని వారు వెల్లడించారు. బాధితులు, వారి తల్లిదండ్రులు వివిధ కారణాలతో పోలీస్స్టేషన్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారని వివరించారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (ఫోక్సో–2012 చట్టం) పరిధిలోకి వచ్చిందని, నేర స్వభావాన్ని బట్టి నిందితులకు శిక్షలు పడే అవకాశముందని పేర్కొన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రూపొందించిన వెబ్సైట్లో జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయడం ద్వారా సత్వర న్యాయం బాధితులకు జరుగుతుందని డీఐజీ రమణకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బాలల హక్కులు, వారికున్న చట్టాలపై (జువైనల్) పోలీసులు, న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, బాలల సంరక్ష అధికారులు, జువైనల్ యూనిట్ల అధికారులకు జువైనల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎంఏ సోమశేఖర్, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ, జేసీ–2 రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పెను మార్పులతో బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బాలలను చిన్నతనంలోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి రఘురామ్, ఆరో అదనపు జిల్లా జడ్జి వీ.శేషుబాబు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, ప్రభుత్వ న్యాయవాదులు, జైలు అధికారులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల సంరక్షణకు కృషి
జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ నెల్లూరు (దర్గామిట్ట) : బాలల హక్కుల సంరక్షణకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్–2 రాజ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జెడ్పీ కార్యాలయంలో జిల్లాలోని సేవా సంస్థలు, బాలసదన్లు హాస్టళ్లు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. జేసీ-2 మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలు చదువు పట్ల శ్రద్ధవహిస్తూ క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు ఎక్కడడైనా ఇబ్బందులకు గురైతే వెంటనే 1098, 100 నంబర్లకు కాల్ చేయాలన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యావతి మాట్లాడుతూ బాలల సంరక్షణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, బాలలకు సముచితమైన న్యాయం, న్యాయబద్ధమైన సేవలు అందిస్తామన్నారు.బాల నేరస్తులను చేరదీయడం, అనాథ బాలలకు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం విధి వంచనకు గురైన స్త్రీలకు రక్షణ కల్పించి వృత్తిలో నైపుణ్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో బాల సంరక్షణా కేంద్రాలు కోట,గూడూరు,వెంకటగిరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక నరసారెడ్డి, సెట్నల్ పీఓ సుబ్రహ్మణ్యం, సీడబ్ల్యూసీ చైర్మన్ రమేశ్‌బాబు జిల్లా బాల సంరక్షణా అ«ర్గనైజర్ బి.సురేష్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పరిగి ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్ పరిగి : బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత..హక్కులపై అవగాహన అవసరం..బాలలకు హక్కులున్నాయని గుర్తిస్తే తప్ప వాటిని పరిరక్షించటం సాధ్యం కాదని ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్, ఎంఈఓ అంజిలయ్య, ఎస్ఐ నగేష్ , బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకుడు యాటగర్ల కృష్ణ అన్నారు. శనివారం పరిగిలోని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బాలలపై, ప్రధానంగా బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులకు సమాజం అండగా ఉండాలన్నారు. చైల్డ్‌లైన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఒంటరిగా తప్పిపోయిన బాలలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నావారు కనిపించినా చైల్డ్‌లైన్‌కు 1098 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయాలన్నారు. చైల్డ్‌లైన్ యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఇదే క్రమంలో బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ చెన్నకేశవరెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు విద్యార్థులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
కమాన్‌చౌరస్తా :బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భవానీచంద్ర తెలిపారు. మంకమ్మతోట ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘బాలల హక్కులు, బాధ్యతలు’ అనే అంశంపై న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి భవానీచంద్ర మాట్లాడుతూ బాలల అభ్యున్నతికి ప్రభుత్వం నిర్బంధవిద్యను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బాలలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుపై దృష్టి పెట్టాలని, తప్పుడు మార్గాలకు ఆకర్షించొద్దని సూచించారు. డీపీవో లక్ష్మీరాజం, పాఠశాల హెడ్మాస్టర్ సంపత్‌రావు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఉప్పుల మధు, మెంబర్లు కత్తిరాజుగౌడ్, కిరణ్‌కుమార్, అధ్యాపకులు లక్ష్మణ్‌రావు, న్యాయవాది గౌరు రాజిరెడ్డి పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణ
హక్కుల పరిరక్షణ కమిషన్ పిలుపు సాక్షి, విశాఖపట్నం బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యమివ్వాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రూపాకపూర్ ఆదేశించారు. ఆందోళన కలిగించేలా పెరుగుతున్న బాల కార్మికులు ఎక్కడా లేకుండా చేయాలన్నారు. గురువారం మహిళా శిశు సంక్షేమాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్, పోలీస్, విద్యా, వైద్యం, కార్మిక, ఆర్పీఎఫ్, జీవీఎంసీ యూసీడీ అధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్ల లోపు బాలబాలికల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం ఎన్సీపీసీఆర్–2007 చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బాలికల అభ్యున్నతికి బేటీ బచావో–బేటీ పడావో నినాదాన్ని తీసుకొచ్చారన్నారు. సంచార జాతులకు చెందిన బాలలు దయనీయ స్థితిలో జీవిస్తున్నారని, వీరికి తగిన చేయూతనివ్వాలన్నారు. ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు పంపి విద్యనభ్యసించే విధంగా ప్రోత్సహించాలన్నారు. బాలలకు తగిన పౌష్టికాహారాన్ని అందించి, వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలన్నారు. బాలల హక్కులను రక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీలు, అనుబంధ శాఖలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంచార జాతులకు విద్యనందించేందుకు తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు మంచి నడవడిక నేర్పించడం, సర్వశిక్షాభియాన్ ద్వారా పథకాలను వర్తింపచేయడం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, బడిబయట పిల్లల్ని పాఠశాల్లలో చేర్పించడం, వారికి ఉచితంగా పుస్తకాలను, యూనిఫాంలు అందించడం చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
కూతురు పుట్టిందనే కోపంతో...
హిమాయత్‌నగర్(హైదరాబాద్): కూతురు పుట్టిందనే కోపం భార్యాబిడ్డలను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడో ఎన్ఆర్ఐ. నాలుగేళ్లుగా అతను వారి ముఖం చూడలేదు... అత్తింట్లోనే ఉంటున్న తల్లితో పాటు చిన్నారిని వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీంతో బాధితురాలు తన కూతురికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయిచింది. బుధవారం నారాయణగూడలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కానాపూర్ సమీపంలోని తలకొండపల్లికి చెందిన జగత్‌రెడ్డి, పుష్పలత కొడుకు వెంకటపద్మ నారాయణరెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన భగవంత్‌రెడ్డి కుమార్తె అర్చనను అతడికి ఇచ్చి 2011లో పెళ్లి జరిపించారు. 2012 ఆగస్టులో కూతురు జన్మించింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో దుర్భాషలాడుతూ భర్త వెంకట నారాయణరెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నేటి వరకు తిరిగి ఇండియాకు రాలేదన్నారు. భార్య అర్చన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించడం లేదు. దీంతో పాటు అత్తామామలు జగత్‌రెడ్డి, పుష్పలతలు ‘నా కొడుక్కి మీరు అక్కర్లేదు’ అని ఇంటినుంచి గెంటేశారు. ఇదే సమయంలో అర్చన మరిది ఎం.రాఘవేందర్‌రెడ్డి చిన్నారిని బెల్టుతో కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. దీంతో వేదనకు గురైన అర్చన తన కుమార్తెకు రక్షణ కల్పించి, న్యాయం చేయమని కోరుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీసీపీలకు నోటీసులు అర్చన ఫిర్యాదు మేరకు జూన్ 16వ తేదీ లోపు విచారణ జరిపి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎల్బీనగర్ డీసీపీలకు నోటీసులను జారీ చేశామని అచ్యుతరావు తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. అర్చనకు, ఆమె బిడ్డకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న అర్చన భర్త వెంకట నారాయణరెడ్డిని నగరానికి రప్పించి చర్యలు తీసుకోవాలన్నారు. -
దుఃఖ సముద్ర సందిగ్ధతలో న్యాయం
అభిప్రాయం దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్‌లు కొలువై ఉన్న సమావేశంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి కంట కన్నీరొలకటం - న్యాయం కోసం ఈ దేశం ఎంతటి సంది గ్ధతలో, దుఃఖ సముద్రంలో విలవిల్లాడుతోం దనడానికి నిదర్శనం. ఆయన కన్నీళ్ళలో కోట్లాదిమంది న్యాయం అందని వాళ్ళ కన్నీళ్ళు దాగున్నాయి. చట్టంలో అన్నీ ఉన్నా న్యాయం అందించడంలో ఉన్నవన్నీ అడ్డంకులే అని అర్థం చేయిస్తు న్నాయి. మాల్యాలకు, మనీ ల్యాండరర్స్కు, మల్టీ నేషనల్ కంపెనీలకు, మైనింగ్ మాఫియాలకు అందుతున్న న్యాయం పేదవారికి, బాధిత స్త్రీలకి, పిల్లలకి, బలహీనులకి అందకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఈ అన్నింటి వెనక సమర్థవంతంగా నడిచే స్వార్థ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ నిర్భీతితో చేస్తున్న నీతి బాహ్యమైన పనులు న్యాయ వ్యవస్థని ఎంతగా నిర్వీర్యం చేస్తున్నాయనే నగ్నసత్యాన్ని మాటల్లో చెప్పలేని దుర్భర పరిస్థితికి కూడా ఈ కన్నీళ్ళు అద్దంపడుతున్నాయి. న్యాయవ్యవస్థ సమస్యలపై రూపొందిన అన్ని రిపోర్ట్లు చూసి, చర్చల మీద చర్చలు చేసి మళ్ళీ కొత్తగా ఈ సమస్యని అర్థం చేసుకుం టున్నట్లు నటిస్తున్న ఏలినవారి పోకడలకి దుఖం పొంగిపొర్లక ఎట్లా తడారిపోతుంది? పాలనా వ్యవస్థలో ఎన్నికైన రాజకీయ నాయకుడు/ నాయకురాలు మరణిస్తే ఏర్పడే ఖాళీ సీటును భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద రూల్స్ వర్తింప చేసి మళ్ళీ కొత్త మెంబర్‌తో నింపుతారు సీటుని. మరి కోర్టుల్లో ఇన్ని వందల సంఖ్యలో జడ్జీల సీట్లు ఖాళీగా పడి ఉంటే వాటిని నింపటానికి ఇన్నేళ్ల కాలం ఎందుకు పడుతోంది? న్యాయ వ్యవస్థని అత్యంత ఉన్నతంగా, స్వతంత్రంగా ఉంచితే కదా ఈ దేశంలో న్యాయం నాలుగు పాదాల నడిచేది! దానికి ఒక్కొక్క వేలుకి వేలు, కాలుకి కాలు విరగొట్టి పెడుతుంటే కేసులు కోట్లల్లో పెండింగులు కాక మరేం అవుతాయి? కనిపించని అసలు శత్రువు స్వార్ధ రాజకీయ వ్యవస్థ. నేర చరిత్ర గల తమ తమ రాజకీయ నాయకులని న్యాయపరమైన చిక్కుల నుండి తేలిగ్గా బయటికి తెచ్చుకోడానికి కొత్త ప్రభుత్వాలు రాగానే మార్పులు చేర్పులు చేస్తూ వారికి అనుకూలమైన వారిని న్యాయ వ్యవస్థలో చొప్పించి, ప్రయోజనం పొందుతున్నాయి. పైగా అనేక విషయాల్లో పాలనా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ.. న్యాయ వ్యవస్థని ఎప్పుడూ ఒక ‘ప్రతిపక్షంగానే చూస్తున్నాయి.పైగా కోర్టులో బార్ అసోసియేషన్ల దగ్గర నుంచి, న్యాయవాదుల వరకు నిబంధ నలు తోసిపుచ్చి అవినీతికి దాసోహం అవటం న్యాయవ్యవస్థకి మరో పెద్ద సవాలుగా పరిణమించింది. న్యాయం పక్షాన నిలవాలంటే కన్నీరు ఉబికి వస్తుంది. ఇంతటి దుఃఖం అత్యున్నత న్యాయాధిపతి కంట కన్నీ రొలికించినది అనటంలో అతిశయోక్తి లేదు కానీ... స్త్రీలు, పిల్లలకి సంబంధించిన కేసులు, హత్యలు, అత్యాచారాల కేసులు, స్త్రీల ఆస్తి హక్కు, పిల్లల కస్టడీ మొదలైన సత్వరం పరిష్క రించాల్సిన కేసులు కూడా కొన్నేళ్లపాటు మగ్గుతున్నాయంటే కారణం ఎవ్వరని ప్రశ్నించాలి? ‘జడ్జిమెంట్ ఇంకా రాలేదని’ చెప్పులరిగేలా కోర్టుల చుట్టూ తిరిగే పేదలకి, మహిళలకి మొదటిగా కోపం వచ్చేది జడ్జి మీదనేగా. ఈ మధ్యలో మోసం చేస్తున్న రాజకీయ పరిస్థితుల మీద ధ్యాస మళ్ళదు.రోజు రోజుకి నేరాలు పెరుగుతుండగా ప్రపంచంలోనే 2వ అతి పెద్ద జనాభాగల మన దేశంలో 50 వేల మంది జడ్జీలు అవసరం ఉండగా, 18,000 మంది జడ్జీలతో మమ అనిపిస్తున్నారు. కోర్టులో 3 కోట్ల కేసులు పెండింగులు ఉండక, మరి మూడు కేసులు మాత్రమే పెండింగులో వుంటాయా? చట్టాలు సవరించడం కొత్తవి రూపకల్పన చేయడం మినహా ప్రభుత్వాలు ఉన్న చట్టాలని పకడ్బం దీగా పని చేయించలేకపోవడాన్ని ప్రశ్నించే ప్రజా చైతన్యం, సంఘటి తంగా గొంతెత్తడం కూడా కరువయింది. ఏపీఎస్సీపీసీఆర్ అనే పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థను సీపీసీ ఆర్ అనే చట్ట పరిధిలో ఏర్పాటు చేసి, దానికి అతీగతీ రాకుండా చేసిన పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పోకడలను దగ్గరగా చూసిన సభ్యురాలిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గారి కంట వొలికిన కన్నీళ్ళతో నా కన్నీళ్ళు కలుపుతున్నా. - ఎం. సుమిత్ర వ్యాసకర్త పిల్లల హక్కుల పరిరక్షణ కార్యకర్త 9396883703 -
అభినందనీయమే కానీ...?
'సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా'... అంటూ ప్రత్యూషకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. కన్నతండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో ఆస్పత్రిపాలైన ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యూషపై సీఎం చూపిన ఔదార్యం అభినందనీయం. అయితే ముఖ్యమంత్రిగా ప్రత్యూష లాంటి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బాల్యంలో చిత్రహంసలు పాలవుతున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతోందని సర్కారీ గణంకాలే వెల్లడిస్తున్నాయి. అయినవారితో పాటు అసాంఘిక శక్తుల బారిన పడి ఎంతో మంది అభాగ్య బాలలు చిత్రహింసల పాలవుతున్నారు. ఇలాంటి కేసులో పోలీసులు సీరియస్ గా స్పందించిన దాఖలాలు బహుస్వల్పం. ప్రత్యూషపై అమానుష కాండను మీడియా హైలెట్ చేయడంతో పాటు హైకోర్టు సీరియస్ గా స్పందించడంతో ఆమెకు న్యాయం జరిగింది. వెలుగులోకి రాని దయనీయ బాలల పరిస్థితి ఏంటి? అదృష్టవశాత్తు నరకకూపం నుంచి బయపడినా అభాగ్యుల సంరక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వస్తోంది. పునరావాస కేంద్రాలు జైళ్లను తలపిస్తుడడంతో ఇక్కడ ఉండలేక బాలలు పారిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పునరావాస కేంద్రం నుంచి 13 మంది బాలలు పరాయ్యారు. ప్రత్యూష విషయంలో స్పందించినట్టుగానే అధికార యంత్రాంగం.. అభాగ్యులను ఆదుకునేందుకు తగిన వ్యవస్థ ఉంటే దీనబాలలకు స్వాంతన లభిస్తుంది. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు చక్కదిద్దే వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటు. బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, వాటిని ఎలా కాపాడాలన్నదానిపై అటు అధికారులకు, ఇటు పాలకులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. పాఠశాల స్థాయిలోనూ బాలల హక్కుల ఊసే లేదు. బాలల హక్కుల సంఘం ఉన్నా దాని పరిధి పరిమితం. చిన్నారుల సంరక్షణకు సర్కారు ఇకనైనా నడుంబిగించాలి. ఈ దిశగా చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టాలి. చిన్నారులు రాక్షసుల బారిన పడకుండా కట్టుదిట్టమైన వ్యూహం రూపొందించాలి. రాక్షసుల బారి నుంచి కాపాడిన బాలలను అన్నిరకాలుగా ఆదుకుని వారి భవితకు బంగారు బాటలు పరిచేలా వ్యవస్థ రూపుదాల్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యూష లాంటి వారందరినీ సీఎం వ్యక్తిగతంగా పరామర్శించడం సాధ్యం కాదు కానీ ఆమెలా మరొకరు చిత్రహింసల పాలవకుండా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. -
బాలల హక్కులపై అవగాహన అవసరం
గుంటూరు క్రైం : బాలల హక్కులు, వారి రక్షణ గురించి పోలీసు అధికారులు అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కరరావు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం హెల్త్ స్వచ్ఛంద సంస్థ, సీఐడీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బాలల న్యాయ, రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐ, ఎస్ఐలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ భాస్కరరావు మాట్లాడుతూ బాలల పట్ల లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు జరుగకుండా ఉండేలా పిల్లల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా నష్టం జరిగిన సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించిన వెంటనే వెంటనే స్పందించి బాలలను పరిరక్షించాలని చెప్పారు. రూరల్ జిల్లా అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, అసమానతల కారణంగా కొందరు యువతులను అక్రమ రవాణాదారులు పసిగట్టి వారిని వ్యభిచార కూపంలోకి దింపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మానవ అక్రమ రవాణాదారులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లందరినీ బాలలుగానే పరిగణించాలని, వారి అన్నిరకాల హక్కులు పొందడంతో పాటు, వారు అక్రమ రవాణాదారుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు, పోలీసులపై ఉంటుందని చెప్పారు. సమావేశంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, ట్రైనర్ కిస్మత్కుమార్, డీఎస్పీలు బి.ప్రసాద్, జి.లక్ష్మయ్య, చైల్డ్‌లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మన సత్యార్థికి శాంతి నోబెల్
పాక్ బాలిక మలాలాతో కలిపి ఉమ్మడిగా శాంతి పురస్కారం ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈసారి భారత్, పాకిస్థాన్ పౌరులను సంయుక్తంగా వరించింది. భారత ఉపఖండంలోని భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లను నోబెల్ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ‘‘బాలల అణచివేతకు వ్యతిరేకంగా, బాలలందరి విద్యా హక్కు కోసం పోరాడుతున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లకు 2014 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది’’ అని జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించే ఈ అవార్డును డిసెంబర్లో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. బాలల హక్కుల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మానవ సేవయే మాధవ సేవ అంటూ అభాగ్యులు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మథర్ థెరిస్సా 1979లో భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో కావడం గమనార్హం. ఆమె భారత్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ పౌరసత్వం పొందారు. అయితే.. జన్మతః భారతీయుడైన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బలవంతపు చాకిరి, అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 80,000 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. బాలల హక్కుల కోసం కైలాష్ సత్యార్థి ఎంతగానో కృషి చేశారని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారని నోబెల్ కమిటీ కొనియాడింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతియుత ఆందోళనలకు నేతృత్వం వహించారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి లభించటంపై సత్యార్థి స్పందిస్తూ.. ఈ అవార్డు తనలో నూతనోత్తేజాన్ని నింపుతోందని, భారత్‌లో బాలల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు మరింతగా కృషి చేస్తానని సత్యార్థి పేర్కొన్నారు. తనతో సంయుక్తంగా అవార్డుకు ఎంపికైన పాక్ బాలిక మలాలాకు ఆయన అభినందనలు తెలిపారు. తాము మరింత ముందుకెళ్లి భారత్ - పాక్‌ల మధ్య శాంతి కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. బాలికల విద్యా హక్కుల ప్రతినిధిగా మలాలా రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి ఉద్యమ బాటలో కొనసాగుతున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. పాక్‌లో తాలిబాన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలల హక్కుల కోసం, బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. గత ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును నామినేట్ చేశారు. ‘‘మలాలా పిన్నవయస్కురాలే అయినప్పటికీ.. బాలికల విద్యా హక్కు కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. బాలలు, చిన్నారులు కూడా స్వీయ పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఉద్యమించగలరని ఆమె నిరూపించింది. అదికూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె చేసి చూపింది. ఆమె వీరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కుల కోసం గళమెత్తే ప్రధాన ప్రతినిధిగా నిలిచారు’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతలిద్దరికీ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఉద్రిక్తతలను చల్లార్చాలి భారత్ - పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ, అంతర్జాతీయ సరిహుద్దు వెంట భారీగా కాల్పులు, మోర్టారు షెల్లింగ్‌లు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రెండు దేశాల పౌరులకూ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించటం.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్పినట్లయిందని పరిశీల కులు అభివర్ణిస్తున్నారు. ‘‘బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాడటమనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒక హిందువు, ఒక ముస్లిం - ఒక భారతపౌరుడు, ఒక పాకిస్థాన్ పౌరురాలు పనిచేయటం ముఖ్యమైన అంశంగా మేం పరిగణిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనలో పేర్కొంది. నోబెల్ కమిటీ గతంలో కూడా.. ప్రపంచంలో ఏవైనా రెండు దేశాలు లేదా వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం కోసం కృషి చేసిన రెండు వైపుల వారికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించింది. 1993: దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలనకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి గాను.. నాటి వివక్షాపూరిత ప్రభుత్వానికి చివరి అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యు. డిక్లెర్క్, నల్ల సూరీడు నెల్సన్ మండేలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 1994: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గాను.. ఇజ్రాయెల్ నాయకులు షిమన్ పెరెస్, యిత్జాక్ రాబిన్లకు, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌కు సంయుక్తంగా శాంతి బహుమతి ఇచ్చారు. 1997: నార్తర్న్ ఐర్లాండ్‌లో సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు చేసిన కృషికి గాను.. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జాన్హ్యూమ్, బ్రిటన్‌కు చెందిన డేవిడ్ ట్రింబుల్లకు సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రదానం చేశారు. -
భారత్‌లోనే అత్యధికంగా బాల కార్మికులు
న్యూఢిల్లీ: బాలల హక్కుల ఉద్యమ కారుడు కైలాశ్ సత్యార్థికి నోబెల్ పురస్కారం లభించడంతో భారత్‌లోని బాల కార్మిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రపంచం దృష్టి పడింది. పిల్లలను పనిలో పెట్టుకోవడంపై నిషేధం ఉన్నప్పటికీ.. లక్షలాదిగా పేద పిల్లలు భారత్‌లో బాల కార్మికులుగా జీవితం వెల్లదీస్తున్నారు. కార్ఖానాల్లో, వస్త్ర పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, షాపుల్లో, హోటళ్లలో, రోడ్డు పక్క తినుబండారాల బండ్ల వద్ద.. ప్రమాదకర పరిస్థితుల్లో నిరుపేద పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల కార్మికులున్న దేశం భారతే కావడం అత్యంత దురదృష్టకర విషయం. కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశలో 50 లక్షల మంది బాల కార్మికులున్నారు. వాస్తవానికి ఆ సంఖ్య 5 కోట్ల కన్నా ఎక్కువని బచ్పన్ బచావో ఆందోళన్ సహా పలు ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నాయి.