సాక్షి, హైదరాబాద్: బాలల హక్కుల ప్రచారానికి భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, పరుగుల రాణి పి.టి.ఉష నడుంకట్టారు. అమూల్యమైన బాల్యానికి ఉండాల్సిన హక్కుల కోసం తమ మద్దతు ప్రకటించారు. ‘చైల్డ్ రైట్స్ అండ్ యూ’ (సీఆర్‌వై) కార్యక్రమంలో వీరిద్దరూ భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్క బాలబాలిక ఎదిగేందుకు అవసరమైన అవకాశాల గురించి సీఆర్‌వై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. దీనికి చేతులు కలిపిన గోపీచంద్ మాట్లాడుతూ... ‘విజయవంతమైన క్రీడాకారుడిగా బాల్యం విలువేంటో నాకు బాగా తెలుసు. బాల్య దశతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుంది. నా వరకు నేను అదృష్టవంతుణ్ని. నా చిన్నతనం ఆనందంగా గడిచింది. బంగారు భవిష్యత్తునిచ్చింది. నాలాగే చిన్నారులందరిలోనూ సంతోషం నిండాలని ఆకాంక్షిస్తున్నా.
చదువు సంధ్యలతో పాటు ఆటలు, సంరక్షణ, ఎదిగేందుకు అవసరమైన హక్కులన్నీ ఉంటాయి’ అని అన్నాడు. ఉష మాట్లాడుతూ... ‘బాలలకు, వారి భవిష్యత్తుకు బాటలు వేసే ఈ ప్రచార కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. దేశంలోని ప్రతి చిన్నారి జీవితం బంగారుమయం కావాలంటే ఈ హక్కులు సంక్రమించేలా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. అపుడే రాష్ట్రం, దేశం సమున్నతంగా ఎదుగుతుంది’ అని అన్నారు. వీళ్లే కాదు మీరూ బాలల హక్కుల కోసం పాటు పడాలనుకుంటే తమ మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొనొచ్చు. దీనికోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్‌వై.ఓఆర్‌జీ/ఓట్‌ఫర్‌చైల్డ్‌రైట్స్‌కు లాగిన్ అయి ఓటు వేయాలి అంతే!
బాల్యం అమూల్యం: గోపీచంద్
Published Sat, Jan 11 2014 12:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement