మన సత్యార్థికి శాంతి నోబెల్ | Satyarthi's Nobel Prize leaves rescued children delighted | Sakshi
Sakshi News home page

మన సత్యార్థికి శాంతి నోబెల్

Published Sat, Oct 11 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

మన సత్యార్థికి శాంతి నోబెల్

మన సత్యార్థికి శాంతి నోబెల్

పాక్ బాలిక మలాలాతో కలిపి ఉమ్మడిగా శాంతి పురస్కారం
 
 ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈసారి భారత్, పాకిస్థాన్ పౌరులను సంయుక్తంగా వరించింది. భారత ఉపఖండంలోని భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్  సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లను నోబెల్ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ‘‘బాలల అణచివేతకు వ్యతిరేకంగా, బాలలందరి విద్యా హక్కు కోసం పోరాడుతున్న కైలాష్  సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లకు 2014 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది’’ అని జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించే ఈ అవార్డును డిసెంబర్‌లో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
 
 బాలల హక్కుల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మానవ  సేవయే మాధవ సేవ అంటూ అభాగ్యులు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మథర్ థెరిస్సా 1979లో భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో కావడం గమనార్హం. ఆమె భారత్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ పౌరసత్వం పొందారు. అయితే.. జన్మతః భారతీయుడైన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బలవంతపు చాకిరి, అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 80,000 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. బాలల హక్కుల కోసం కైలాష్  సత్యార్థి ఎంతగానో కృషి చేశారని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారని నోబెల్ కమిటీ కొనియాడింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతియుత ఆందోళనలకు నేతృత్వం వహించారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి లభించటంపై సత్యార్థి స్పందిస్తూ.. ఈ అవార్డు తనలో నూతనోత్తేజాన్ని నింపుతోందని, భారత్‌లో బాలల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు మరింతగా కృషి చేస్తానని సత్యార్థి పేర్కొన్నారు. తనతో సంయుక్తంగా అవార్డుకు ఎంపికైన పాక్ బాలిక మలాలాకు ఆయన అభినందనలు తెలిపారు. తాము మరింత ముందుకెళ్లి భారత్ - పాక్‌ల మధ్య శాంతి కోసం కృషి చేయాల్సి ఉందన్నారు.
 
 బాలికల విద్యా హక్కుల ప్రతినిధిగా మలాలా
 
 రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి ఉద్యమ బాటలో కొనసాగుతున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. పాక్‌లో తాలిబాన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలల హక్కుల కోసం, బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. గత ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును నామినేట్ చేశారు. ‘‘మలాలా పిన్నవయస్కురాలే అయినప్పటికీ.. బాలికల విద్యా హక్కు కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. బాలలు, చిన్నారులు కూడా స్వీయ పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఉద్యమించగలరని ఆమె నిరూపించింది. అదికూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె చేసి చూపింది. ఆమె వీరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కుల కోసం గళమెత్తే ప్రధాన ప్రతినిధిగా నిలిచారు’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతలిద్దరికీ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.
 
 ఉద్రిక్తతలను చల్లార్చాలి
 
 భారత్ - పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ, అంతర్జాతీయ సరిహుద్దు వెంట భారీగా కాల్పులు, మోర్టారు షెల్లింగ్‌లు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రెండు దేశాల పౌరులకూ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించటం.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్పినట్లయిందని పరిశీల కులు అభివర్ణిస్తున్నారు. ‘‘బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాడటమనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒక హిందువు, ఒక ముస్లిం - ఒక భారతపౌరుడు, ఒక పాకిస్థాన్ పౌరురాలు పనిచేయటం ముఖ్యమైన అంశంగా మేం పరిగణిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనలో పేర్కొంది. నోబెల్ కమిటీ గతంలో కూడా.. ప్రపంచంలో ఏవైనా రెండు దేశాలు లేదా వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం కోసం కృషి చేసిన రెండు వైపుల వారికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించింది.
 
 1993: దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలనకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి గాను.. నాటి వివక్షాపూరిత ప్రభుత్వానికి చివరి అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యు. డిక్లెర్క్, నల్ల సూరీడు నెల్సన్ మండేలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.
 
 1994: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గాను.. ఇజ్రాయెల్ నాయకులు షిమన్ పెరెస్, యిత్జాక్ రాబిన్‌లకు, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌కు సంయుక్తంగా శాంతి బహుమతి ఇచ్చారు.
 1997: నార్తర్న్ ఐర్లాండ్‌లో సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు చేసిన కృషికి గాను.. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జాన్‌హ్యూమ్, బ్రిటన్‌కు చెందిన డేవిడ్ ట్రింబుల్‌లకు సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రదానం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement