‘బాల్య’ మిత్రుడు..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని విదిశలో 1954 జనవరి 11న కైలాష్ సత్యార్థి జన్మించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను వదిలి.. 26 ఏళ్ల వయసులోనే బాలల హక్కుల ఉద్యమ బాట పట్టారు. ‘బచ్‌పన్ బచావో ఆందోళన్(బాలల హక్కుల రక్షణ ఉద్యమం)’ను ప్రారంభించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థల్లో ఇదే ప్రముఖమైనది.
సత్యార్థి ప్రారంభించిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం చాలా దేశాల్లో క్రియాశీలంగా ఉంది.
కైలాష్ సత్యార్థిగతంలోనూ పలుమార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
1994లో బాల కార్మికులు లేని సంస్థలు తయారు చేస్తున్న రగ్గులు, కార్పెట్ల కోసం ‘రగ్‌మార్క్’ అనే ముద్రను సృష్టించారు. ఈ రగ్గులు, కార్పెట్లు విదేశాల్లో చాలా ఫేమస్. ప్రస్తుతం ఈ రగ్‌మార్క్‌ను ‘గుడ్‌వేవ్స్’గా మార్చారు.
భారత్‌లో 50లక్షల బాల కార్మికులున్నారన్నది అంచనా. కానీ సత్యార్థి,ఇతర ఎన్జీవోల లెక్కల ప్రకారం అది 5 కోట్లు.
బాల కార్మిక వ్యవస్థ వల్ల పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, జనాభా పెరుగుదల లాంటి సమస్యలు ఉత్పన్నవవుతాయని సత్యార్థి వివరిస్తారు.
బాలలపై పాల్పడే నేరాలకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని, బాలలకు సంబంధించి సమగ్ర చట్టాలను రూపొందించాల్సి ఉందని ఆయన వాదిస్తారు.
బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ చైల్డ్ లేబర్ అండ్ ఎడ్యుకేషన్’, ‘ద గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నారు.
సత్యార్థి అందుకున్న అంతర్జాతీయ అవార్డులు
డిఫెండర్స్ ఆఫ్ డెమొక్రసీ అవార్డ్ ( 2009- అమెరికా)
మెడల్ ఆఫ్ ఇటాలియన్ సెనేట్ ( 2007 - ఇటలీ)
రాబర్ట్ ఎఫ్ కెనెడీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ( అమెరికా)
ఫ్రెడెరిక్ ఎబర్ట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (జర్మనీ)
అల్ఫాన్సో కొమిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ (2008 - స్పెయిన్)
సత్యార్థి చేసిన ప్రముఖ వ్యాఖ్యలు
‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?, నువ్వు కాకపోతే మరెవ్వరు? ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే.. బానిసత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలించగలం’
‘ఇదొక పరీక్ష అని నేననుకుంటున్నా. ఈ నైతిక పరీక్షను అంతా కచ్చితంగా పాస్ కావాలి(బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంపై)’
‘బాలలను బానిసలు గా చేయ డం నేరం. మానవత్వమే ఇక్కడ పణంగా ఉంది. ఇం కా చేయాల్సిన పని చాలా ఉంది. అయితే, నేను చనిపోయేలోపు బాలకార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను’