Malala Yousafzay
-
'ఐపాడ్లు కాదు పుస్తకం అడుగుతున్నారు'
న్యూఢిల్లీ: పిల్లలు ఐపాడ్లు కోరుకోవడం లేదని, పుస్తకం అడుగుతున్నారని పాకిస్థాన్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్‌జాయ్ మలాలా అన్నారు. కైలాష్ సత్యార్థి, మాలాలా నార్వేలోని ఓస్లోలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలసి మాలాలా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సంగతి తెలిసిందే. తాము పెన్ను, పుస్తకం అడుగుతున్నామని మలాలా అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నాని చెప్పారు. కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ.. మలాలా పోరాట స్ఫూర్థి అందరికీ గర్వకారణమని ప్రశంసించారు. బాలల హక్కుల కోసం పోరాటంలో యువతను చైతన్య పరచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ బుధవారం నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. -
మన సత్యార్థికి శాంతి నోబెల్
పాక్ బాలిక మలాలాతో కలిపి ఉమ్మడిగా శాంతి పురస్కారం ఓస్లో: ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఈసారి భారత్, పాకిస్థాన్ పౌరులను సంయుక్తంగా వరించింది. భారత ఉపఖండంలోని భారత్, పాకిస్థాన్ దేశాల్లో బాలల హక్కులు, బాలికల విద్య కోసం అలుపెరుగని ఉద్యమం సాగిస్తున్న సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి (60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లను నోబెల్ కమిటీ ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ‘‘బాలల అణచివేతకు వ్యతిరేకంగా, బాలలందరి విద్యా హక్కు కోసం పోరాడుతున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లకు 2014 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది’’ అని జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. నార్వేకు చెందిన నోబెల్ కమిటీ 11 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా అందించే ఈ అవార్డును డిసెంబర్లో ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. బాలల హక్కుల కోసం 3 దశాబ్దాలుగా పోరాటం భారత్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించటం ఇది రెండోసారి. మానవ సేవయే మాధవ సేవ అంటూ అభాగ్యులు, అన్నార్తుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మథర్ థెరిస్సా 1979లో భారత్ తరఫున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే.. ఆమె తన జీవితాన్ని భారత్‌లోనే గడిపినా జన్మించింది మాత్రం ఒకప్పటి యుగోస్లోవియాలో కావడం గమనార్హం. ఆమె భారత్‌కు వచ్చి స్థిరపడి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ పౌరసత్వం పొందారు. అయితే.. జన్మతః భారతీయుడైన వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాష్ సత్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మూడు దశాబ్దాల కిందట ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. బలవంతపు చాకిరి, అక్రమ రవాణా నుంచి బాలలను రక్షించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 80,000 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. బాలల హక్కుల కోసం కైలాష్ సత్యార్థి ఎంతగానో కృషి చేశారని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారని నోబెల్ కమిటీ కొనియాడింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతియుత ఆందోళనలకు నేతృత్వం వహించారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి లభించటంపై సత్యార్థి స్పందిస్తూ.. ఈ అవార్డు తనలో నూతనోత్తేజాన్ని నింపుతోందని, భారత్‌లో బాలల బానిసత్వాన్ని నిర్మూలించేందుకు మరింతగా కృషి చేస్తానని సత్యార్థి పేర్కొన్నారు. తనతో సంయుక్తంగా అవార్డుకు ఎంపికైన పాక్ బాలిక మలాలాకు ఆయన అభినందనలు తెలిపారు. తాము మరింత ముందుకెళ్లి భారత్ - పాక్‌ల మధ్య శాంతి కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. బాలికల విద్యా హక్కుల ప్రతినిధిగా మలాలా రెండేళ్ల కిందట తాలిబాన్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి.. మరణాన్ని జయించి ఉద్యమ బాటలో కొనసాగుతున్న పాక్ బాలిక మలాలా.. నోబెల్ బహుమతికి ఎంపికైన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. పాక్‌లో తాలిబాన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలల హక్కుల కోసం, బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. గత ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును నామినేట్ చేశారు. ‘‘మలాలా పిన్నవయస్కురాలే అయినప్పటికీ.. బాలికల విద్యా హక్కు కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. బాలలు, చిన్నారులు కూడా స్వీయ పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఉద్యమించగలరని ఆమె నిరూపించింది. అదికూడా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె చేసి చూపింది. ఆమె వీరోచిత పోరాటం ద్వారా బాలికల విద్యా హక్కుల కోసం గళమెత్తే ప్రధాన ప్రతినిధిగా నిలిచారు’’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతలిద్దరికీ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఉద్రిక్తతలను చల్లార్చాలి భారత్ - పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ, అంతర్జాతీయ సరిహుద్దు వెంట భారీగా కాల్పులు, మోర్టారు షెల్లింగ్‌లు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రెండు దేశాల పౌరులకూ సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించటం.. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన ఆవశ్యకతను బలంగా చెప్పినట్లయిందని పరిశీల కులు అభివర్ణిస్తున్నారు. ‘‘బాలల హక్కుల కోసం, బాలల విద్య కోసం, అతివాదానికి వ్యతిరేకంగా పోరాడటమనే ఉమ్మడి లక్ష్యం కోసం ఒక హిందువు, ఒక ముస్లిం - ఒక భారతపౌరుడు, ఒక పాకిస్థాన్ పౌరురాలు పనిచేయటం ముఖ్యమైన అంశంగా మేం పరిగణిస్తున్నాం’’ అని నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనలో పేర్కొంది. నోబెల్ కమిటీ గతంలో కూడా.. ప్రపంచంలో ఏవైనా రెండు దేశాలు లేదా వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడం కోసం కృషి చేసిన రెండు వైపుల వారికీ సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రకటించింది. 1993: దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పాలనకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి గాను.. నాటి వివక్షాపూరిత ప్రభుత్వానికి చివరి అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యు. డిక్లెర్క్, నల్ల సూరీడు నెల్సన్ మండేలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 1994: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గాను.. ఇజ్రాయెల్ నాయకులు షిమన్ పెరెస్, యిత్జాక్ రాబిన్లకు, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్‌కు సంయుక్తంగా శాంతి బహుమతి ఇచ్చారు. 1997: నార్తర్న్ ఐర్లాండ్‌లో సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు చేసిన కృషికి గాను.. నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జాన్హ్యూమ్, బ్రిటన్‌కు చెందిన డేవిడ్ ట్రింబుల్లకు సంయుక్తంగా శాంతి బహుమతిని ప్రదానం చేశారు. -
భారత్‌లోనే అత్యధికంగా బాల కార్మికులు
న్యూఢిల్లీ: బాలల హక్కుల ఉద్యమ కారుడు కైలాశ్ సత్యార్థికి నోబెల్ పురస్కారం లభించడంతో భారత్‌లోని బాల కార్మిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రపంచం దృష్టి పడింది. పిల్లలను పనిలో పెట్టుకోవడంపై నిషేధం ఉన్నప్పటికీ.. లక్షలాదిగా పేద పిల్లలు భారత్‌లో బాల కార్మికులుగా జీవితం వెల్లదీస్తున్నారు. కార్ఖానాల్లో, వస్త్ర పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, షాపుల్లో, హోటళ్లలో, రోడ్డు పక్క తినుబండారాల బండ్ల వద్ద.. ప్రమాదకర పరిస్థితుల్లో నిరుపేద పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల కార్మికులున్న దేశం భారతే కావడం అత్యంత దురదృష్టకర విషయం. కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశలో 50 లక్షల మంది బాల కార్మికులున్నారు. వాస్తవానికి ఆ సంఖ్య 5 కోట్ల కన్నా ఎక్కువని బచ్పన్ బచావో ఆందోళన్ సహా పలు ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నాయి. -
నోబెల్ విజేతలకు సెల్యూట్..
న్యూఢిల్లీ/లండన్/ఐక్యరాజ్యసమితి: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్‌లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ‘‘దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కైలాష్ సత్యార్థి చేసిన కృషి ఎనలేనిది. శక్తివంతమైన భారత పౌర సమాజం బాలకార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది’’ అని ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘శ్రమ, భయం అనేది లేకుండా పోరాడిన ఇద్దరు అద్భుతమైన వ్యక్తులకు దక్కిన అరుదైన గౌరవం ఇది.’’ అని అన్సారీ చెప్పారు. ‘‘నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థికి అభినందనలు. ఆయన అందించిన సేవలకు నా సెల్యూట్’’ అని మోదీ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పాక్ బాలిక మలాలా నోబెల్ సాధించినందుకు ఆమెకు నా అభినందనలు’’ అని మోదీ పేర్కొన్నారు. సత్యార్థి నోబెల్ రావడం దేశానికే గర్వకారణమని, వారు దక్షిణాసియాకే తలమానికమని సోనియాగాంధీ అభివర్ణించారు. బాలల హక్కుల కోసం సత్యార్థి చేసిన పోరాటానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి వరించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వాగతించింది. సత్యార్థి, మలాలా చిన్నారులకు సంబంధించి గొప్ప చాంపియన్లని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ఓ ప్రకటనలో కొనియాడారు. నోబెల్ గ్రహీతకు జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: నోబెల్ బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా క్షోభ అనుభవిస్తున్న 80 వేల మంది బాలలకు తోడ్పాటునివ్వడంలో ఆయన సేవలను కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నోబెల్ గ్రహీతలను అభినందించారు. మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణం: నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణమని, ఆమె తన దేశ ప్రజలు తల ఎత్తుకునేలా చేసిందని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొనియాడారు. -
నెటిజన్ల జపం..!
న్యూఢిల్లీ/విదిశ: నోబెల్ పురస్కారం ప్రకటించడానికి ముందు కైలాష్ సత్యార్థికి ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్లు 200 మంది కన్నా తక్కువే. కానీ ప్రకటన వెలువడ్డ గంటన్నరలోనే ఆ సంఖ్య 4,500, శుక్రవారం సాయంత్రానికి 6,820కి చేరింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన వెబ్సైట్ www.kailashsatyarthi.net సందర్శకుల డిమాండ్‌ను తట్టుకోలేక స్పందించడమే మానేసింది. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ)’ సంస్థ వెబ్సైట్ కూడా క్రాష్ అయింది. కాగా, కైలాష్ సత్యార్థికి నోబెల్ పురస్కారం వార్త తెలియగానే ఆయన సొంత పట్టణం విదిశలో సంబరాలు ప్రారంభమయ్యాయి. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ ప్రజలు పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా సత్యార్థి నివాసం ‘చోటీ హవేలీ’లో ఉత్సవ వాతావరణం నెలకొంది. సత్యార్థి కుటుంబసభ్యులంతా విదిశలోనే నివసిస్తున్నారు. -
‘బాల్య’ మిత్రుడు..!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని విదిశలో 1954 జనవరి 11న కైలాష్ సత్యార్థి జన్మించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను వదిలి.. 26 ఏళ్ల వయసులోనే బాలల హక్కుల ఉద్యమ బాట పట్టారు. ‘బచ్పన్ బచావో ఆందోళన్(బాలల హక్కుల రక్షణ ఉద్యమం)’ను ప్రారంభించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థల్లో ఇదే ప్రముఖమైనది. సత్యార్థి ప్రారంభించిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం చాలా దేశాల్లో క్రియాశీలంగా ఉంది. కైలాష్ సత్యార్థిగతంలోనూ పలుమార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 1994లో బాల కార్మికులు లేని సంస్థలు తయారు చేస్తున్న రగ్గులు, కార్పెట్ల కోసం ‘రగ్‌మార్క్’ అనే ముద్రను సృష్టించారు. ఈ రగ్గులు, కార్పెట్లు విదేశాల్లో చాలా ఫేమస్. ప్రస్తుతం ఈ రగ్మార్క్ను ‘గుడ్వేవ్స్’గా మార్చారు. భారత్‌లో 50లక్షల బాల కార్మికులున్నారన్నది అంచనా. కానీ సత్యార్థి,ఇతర ఎన్జీవోల లెక్కల ప్రకారం అది 5 కోట్లు. బాల కార్మిక వ్యవస్థ వల్ల పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, జనాభా పెరుగుదల లాంటి సమస్యలు ఉత్పన్నవవుతాయని సత్యార్థి వివరిస్తారు. బాలలపై పాల్పడే నేరాలకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని, బాలలకు సంబంధించి సమగ్ర చట్టాలను రూపొందించాల్సి ఉందని ఆయన వాదిస్తారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ చైల్డ్ లేబర్ అండ్ ఎడ్యుకేషన్’, ‘ద గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నారు. సత్యార్థి అందుకున్న అంతర్జాతీయ అవార్డులు డిఫెండర్స్ ఆఫ్ డెమొక్రసీ అవార్డ్ ( 2009- అమెరికా) మెడల్ ఆఫ్ ఇటాలియన్ సెనేట్ ( 2007 - ఇటలీ) రాబర్ట్ ఎఫ్ కెనెడీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ( అమెరికా) ఫ్రెడెరిక్ ఎబర్ట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (జర్మనీ) అల్ఫాన్సో కొమిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ (2008 - స్పెయిన్) సత్యార్థి చేసిన ప్రముఖ వ్యాఖ్యలు ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?, నువ్వు కాకపోతే మరెవ్వరు? ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే.. బానిసత్వాన్ని సంపూర్ణంగా నిర్మూలించగలం’ ‘ఇదొక పరీక్ష అని నేననుకుంటున్నా. ఈ నైతిక పరీక్షను అంతా కచ్చితంగా పాస్ కావాలి(బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటంపై)’ ‘బాలలను బానిసలు గా చేయ డం నేరం. మానవత్వమే ఇక్కడ పణంగా ఉంది. ఇం కా చేయాల్సిన పని చాలా ఉంది. అయితే, నేను చనిపోయేలోపు బాలకార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను’ -
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!
లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. మతోన్మాదుల పాలనలో అక్షరాలకు దూరమైన బాలికల వెతలను ఆవేదనతో ఆర్తిగా ప్రపంచం కళ్లకు కట్టింది. ఆ అకుంఠిత పోరాటంలో శత్రువు తూటాల దాడికి గురై మృత్యువుకు చేరువదాకా వెళ్లింది. తర్వాత కూడా ఆమె వీరోచిత పోరాటం ఆగలేదు. తమ దేశంలోనే కాకుండా అణగారిన దేశాలన్నింటిలోని బాలికల హక్కుల రక్షణకు నడుం బిగించింది. ఈ కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ఆమె ఒడిలో వచ్చి వాలింది. ప్రపంచంలో అందరికీ తెలిసిన టీనేజర్‌గా గుర్తింపు పొందిన మలాలా యూసఫ్ జాయ్ 1997 జూలై 12నలో పాకిస్థాన్‌లోని ఖైబర్-పక్తూన్క్వా రాష్ట్రం స్వాత్‌లోయలోని మింగోరా పట్టణంలో సున్నీ ముస్లింల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జియావుద్దీన్ స్కూలు యజమాని. విద్యాహక్కు కార్యకర్త. మలాలా ఆయన స్కూల్లోనే చదువుకుంది. 2007 నుంచి 2012 వరకు స్వాత్ లోయలోని పలు ప్రాంతాల్లో తాలిబన్ల నిరంకుశ పాలన సాగింది. ఉగ్రవాదులు టీవీలు, సినిమాలు, పుస్తకాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకోకూడదంటూ వారి పాఠశాలలను పేల్చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మలాలా గొంతువిప్పింది. 2008లో పెషావర్ సభలో ‘విద్య నా ప్రాథమిక హక్కు. దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?’ అని మండిపడింది. 2009లో 12 ఏళ్ల వయసులో బీబీసీ బ్లాగులో గుల్ మకాల్ అనే పేరుతో స్వాత్ బాలికల దయనీయ స్థితిని వివరించింది. మీడియాఇంటర్వ్యూల్లో తాలిబన్లపై నిప్పులు చెరిగింది. తలలోకూ తూటా.. :మలాలా పోరాటాన్ని తాలిబన్లు సహించలేకపోయారు. 2012 అక్టోబర్ 9న స్కూలుకు వెళ్తుండగా ఓ మిలిటెంట్ ఆమెపై మూడు తూటాలు పేల్చాడు. ఒకటి ఆమె తలలోకి దూసుకెళ్లి భుజం దాకా వెళ్లింది. ఆ ప్రాణాంతక గాయానికి మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. చికిత్సతో కోలుకున్న మలాలా ప్రస్తుతం బర్మింగ్‌హామ్ స్కూల్లో చదువుకుంటోంది. పాక్‌కు వస్తే చంపుతామని తాలిబన్లు బెదిరించడంలో మలాలా కుటుంబం బ్రిటన్‌లోనే ఉంటోంది. ఐక్యరాజ్య సమితితో కలిసి విద్యా హక్కుకోసం పోరాడుతోంది. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు, పాకిస్థాన్ యువ శాంతి పురుస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకుంది. ‘ఐయామ్ మలాలా’ పేరుతో గత ఏడాది ఆత్మకథను వెలువరించింది. ‘‘ఉగ్రవాదులు నేను మారతాననుకున్నారు. వారి దాడితో నాలో బలహీనత, భయం పోవడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను తాలిబ్(తాలిబన్ మిలిటెంట్)ను ద్వేషించడం లేదు. అతడు ఎదురుగా నిలబడితే నా చేతిలో తుపాకీ ఉన్నా కాల్చను’’ అని ఐరాసలో గత ఏడాది ఉద్వేగంగా చెప్పిన మలాలా నిజంగా శాంతదూతే. -
భారత్-పాక్ శాంతి కోసం కృషి చేస్తాం
మలాలా, సత్యార్థి వెల్లడి లండన్: నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు తమ దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామని చెప్పారు. ‘మేం కలిసి పనిచేస్తాం. భారత్, పాక్ మధ్య బలమైన సంబంధాల నిర్మాణానికి కృషి చేస్తాం. నేను శాంతిని విశ్వసిస్తున్నాను’ అని మలాలా విలేకర్లతో చెప్పింది. ఘర్షణకంటే అభివృద్ధి ముఖ్యమని పేర్కొంటూ, శాంతి నెలకొనేలా చూడాలని భారత్, పాక్‌ల ప్రధానులు మోదీ, షరీఫ్‌లకు విజ్ఞప్తి చేసింది. డిసెంబర్లో ఓస్లోలో జరిగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రావాలని వారిని తాను, సత్యార్థి కోరతామంది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన తొలి పాకిస్థానీని తానేనని, ఈ అవార్డును తమ గొంతును బలంగా వినిపించలేని బాలలకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. కాగా, తనకు మలాలా వ్యక్తిగతంగా తెలుసని, అవార్డుకు ఎంపికైనందుకు ఆమెకు ఫోన్‌చేసి అభినందిస్తానని సత్యార్థి చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు భారత ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు కలిసి పనిచేద్దామని ఆమెను కోరతానన్నారు. శాంతియుతంగా జీవించడం భారత్, పాక్ బాలల హక్కు అని పేర్కొన్నారు. -
గాంధీజీకి వస్తే బావుండేది!
నోబెల్ పురస్కారంపై సత్యార్థి స్పందన న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై కైలాశ్ సత్యార్థి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకో గొప్ప గౌరవమని, అయితే, తనకన్నాముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినన్నారు. సత్యార్థి స్పందన ఆయన మాటల్లోనే.. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ భారతీయులకే అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను. ప్రస్తుత ఆధునిక సమాజంలోని లక్షలాది చిన్నారుల దుస్థితిని గుర్తించిన నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఈ పురస్కారంతో చిన్నారుల సమస్యలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. ఈ సమస్య కేవలం పేదరికానికో, బాలల హక్కులకో సంబంధించినది కాదు. అంతకన్నా లోతైనది. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. బానిసత్వంలో మగ్గుతున్న, హక్కులకు దూరంగా ఉన్న ప్రతీ బాలుడికీ స్వేచ్ఛ లభించేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. అప్పటివరకు నాకు విశ్రాంతి లేదు’ అన్నారు. బాలల హక్కు లు బాల్యం నుంచి తనకు ఇష్టమైన అంశమని సత్యార్థి తెలిపారు. ‘సహజమైన హక్కులకు దూరమైన పిల్లల కోసం ఏదైనా చేయాలని నాకప్పటినుంచే అనిపించేది’ అన్నారు. బచ్పన్ బచావో ఆందోళన్! ‘బచ్పన్ బచావో ఆందోళన్’ను సత్యార్థి 1980లో ప్రారంభించారు. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా బాల కార్మికులకు.. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించింది. ముఖ్యంగా ఢిల్లీలో బాల కార్మికులను రక్షించేందుకు దాడులు నిర్వహిస్తున్న అధికారులకు అన్నివిధాలుగా సహకరించింది. బాలల హక్కుల కోసం ఈ సంస్థ శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లలో ఈ సంస్థ చాలా క్రియాశీలంగా ఉంది. ఈ సంస్థకు 70 వేలమంది వ్యక్తిగతంగా సహకరిస్తుంటారు. 750 పౌరసంస్థలు దీని కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రజాఉద్యమంలాంటి ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలను ముఖ్యంగా.. ‘ది అసోసియేషన్ ఆఫ్వాలంటరీ యాక్షన్’, ‘ద బాల్ ఆశ్రమ్ ట్రస్ట్’, ‘సేవ్ ది చైల్డ్‌హుడ్ ఫౌండేషన్’ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు నిర్వర్తిస్తుంటాయి. మోదీజీ.. మీదే బాధ్యత! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్రమోదీ గురించి సత్యార్థి ట్విటర్లో ఇలా స్పందించారు. ‘టీ అమ్మే ఒక బాలుడు ప్రతికూలతలను జయించి భారత ప్రధాని అవుతున్నారు. ఇక ఏ చిన్నారీ బాల కార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే’ అని ట్వీట్ చేశారు. -
'గాంధీజీకి వచ్చి ఉంటే సంతోషించేవాడిని'
న్యూఢిల్లీ: తనకన్నా ముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ముందుగా గాంధీజీకి వచ్చే ఉంటే మరింత సంతోషించేవాడినని అన్నారు. ‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ దేశానికి అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను'అని తెలిపారు. -
పోరాటానికి లభించిన గుర్తింపు: కైలాశ్ సత్యార్ధి
న్యూఢిల్లీ: బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి లభించిన గుర్తింపు అని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతికి లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నార్వేయిన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించిన నోబెల్ పురస్కారాన్ని మలాలా యూసఫ్ జాయ్ తో కలిసి కైలాశ్ సత్యార్ధి అందుకున్న సంగతి తెలిసిందే. 1990 నుంచి బాల కార్మికుల నిర్మూలన కోసం పాటు పడుతున్నారు. ఇప్పటి వరకు 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి విద్య, పునరావాసాన్ని కల్పించారు.