మలాలా, సత్యార్థి వెల్లడి
లండన్: నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన కైలాశ్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు తమ దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామని చెప్పారు. ‘మేం కలిసి పనిచేస్తాం. భారత్, పాక్ మధ్య బలమైన సంబంధాల నిర్మాణానికి కృషి చేస్తాం. నేను శాంతిని విశ్వసిస్తున్నాను’ అని మలాలా విలేకర్లతో చెప్పింది. ఘర్షణకంటే అభివృద్ధి ముఖ్యమని పేర్కొంటూ, శాంతి నెలకొనేలా చూడాలని భారత్, పాక్‌ల ప్రధానులు మోదీ, షరీఫ్‌లకు విజ్ఞప్తి చేసింది. డిసెంబర్‌లో ఓస్లోలో జరిగే ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి రావాలని వారిని తాను, సత్యార్థి కోరతామంది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన తొలి పాకిస్థానీని తానేనని, ఈ అవార్డును తమ గొంతును బలంగా వినిపించలేని బాలలకు అంకితం చేస్తున్నానని పేర్కొంది. కాగా, తనకు మలాలా వ్యక్తిగతంగా తెలుసని, అవార్డుకు ఎంపికైనందుకు ఆమెకు ఫోన్‌చేసి అభినందిస్తానని సత్యార్థి చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు భారత ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు కలిసి పనిచేద్దామని ఆమెను కోరతానన్నారు. శాంతియుతంగా జీవించడం భారత్, పాక్ బాలల హక్కు అని పేర్కొన్నారు.