న్యూఢిల్లీ/లండన్/ఐక్యరాజ్యసమితి: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్‌లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ‘‘దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కైలాష్ సత్యార్థి చేసిన కృషి ఎనలేనిది. శక్తివంతమైన భారత పౌర సమాజం బాలకార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటానికి దక్కిన గుర్తింపు ఇది’’ అని ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘శ్రమ, భయం అనేది లేకుండా పోరాడిన ఇద్దరు అద్భుతమైన వ్యక్తులకు దక్కిన అరుదైన గౌరవం ఇది.’’ అని అన్సారీ చెప్పారు. ‘‘నోబెల్ శాంతి పురస్కారం సాధించిన కైలాష్ సత్యార్థికి అభినందనలు. ఆయన అందించిన సేవలకు నా సెల్యూట్’’ అని మోదీ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పాక్ బాలిక మలాలా నోబెల్ సాధించినందుకు ఆమెకు నా అభినందనలు’’ అని మోదీ పేర్కొన్నారు.
సత్యార్థి నోబెల్ రావడం దేశానికే గర్వకారణమని, వారు దక్షిణాసియాకే తలమానికమని సోనియాగాంధీ అభివర్ణించారు. బాలల హక్కుల కోసం సత్యార్థి చేసిన పోరాటానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి వరించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్వాగతించింది. సత్యార్థి, మలాలా చిన్నారులకు సంబంధించి గొప్ప చాంపియన్లని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ఓ ప్రకటనలో కొనియాడారు.
నోబెల్ గ్రహీతకు జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: నోబెల్ బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా క్షోభ అనుభవిస్తున్న 80 వేల మంది బాలలకు తోడ్పాటునివ్వడంలో ఆయన సేవలను కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నోబెల్ గ్రహీతలను అభినందించారు.
మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణం: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: మలాలా పాకిస్థాన్‌కు గర్వకారణమని, ఆమె తన దేశ ప్రజలు తల ఎత్తుకునేలా చేసిందని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కొనియాడారు.