న్యూఢిల్లీ/విదిశ: నోబెల్ పురస్కారం ప్రకటించడానికి ముందు కైలాష్ సత్యార్థికి ట్విట్టర్‌లో ఉన్న ఫాలోవర్లు 200 మంది కన్నా తక్కువే. కానీ ప్రకటన వెలువడ్డ గంటన్నరలోనే ఆ సంఖ్య 4,500, శుక్రవారం సాయంత్రానికి 6,820కి చేరింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన వెబ్‌సైట్ www.kailashsatyarthi.net సందర్శకుల డిమాండ్‌ను తట్టుకోలేక స్పందించడమే మానేసింది. ‘బచ్‌పన్ బచావో ఆందోళన్(బీబీఏ)’ సంస్థ వెబ్‌సైట్ కూడా క్రాష్ అయింది. కాగా, కైలాష్ సత్యార్థికి నోబెల్ పురస్కారం వార్త తెలియగానే ఆయన సొంత పట్టణం విదిశలో సంబరాలు ప్రారంభమయ్యాయి. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ ప్రజలు పండుగ చేసుకున్నారు.
ముఖ్యంగా సత్యార్థి నివాసం ‘చోటీ హవేలీ’లో ఉత్సవ వాతావరణం నెలకొంది. సత్యార్థి కుటుంబసభ్యులంతా విదిశలోనే నివసిస్తున్నారు.