గాంధీజీకి వస్తే బావుండేది!
నోబెల్ పురస్కారంపై సత్యార్థి స్పందన
న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయడంపై కైలాశ్ సత్యార్థి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకో గొప్ప గౌరవమని, అయితే, తనకన్నాముందు గాంధీజీకి ఈ అవార్డ్ వచ్చి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడినన్నారు. సత్యార్థి స్పందన ఆయన మాటల్లోనే..
‘నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం నాకు. అయితే, ఈ అవార్డ్ జాతిపిత మహాత్మాగాంధీకి వచ్చి ఉంటే నేను మరింత సంతోషించేవాడిని. గాంధీజీ తరువాత నాకు లభించి ఉంటే మరింత గౌరవంగా భావించేవాడిని. ఈ అవార్డ్ భారతీయులకే అంకితం. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. బాలల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఇకపై రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తాను. ప్రస్తుత ఆధునిక సమాజంలోని లక్షలాది చిన్నారుల దుస్థితిని గుర్తించిన నోబెల్ కమిటీకి కృతజ్ఞతలు. ఈ పురస్కారంతో చిన్నారుల సమస్యలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. ఈ సమస్య కేవలం పేదరికానికో, బాలల హక్కులకో సంబంధించినది కాదు. అంతకన్నా లోతైనది. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. బానిసత్వంలో మగ్గుతున్న, హక్కులకు దూరంగా ఉన్న ప్రతీ బాలుడికీ స్వేచ్ఛ లభించేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. అప్పటివరకు నాకు విశ్రాంతి లేదు’ అన్నారు. బాలల హక్కు లు బాల్యం నుంచి తనకు ఇష్టమైన అంశమని సత్యార్థి తెలిపారు. ‘సహజమైన హక్కులకు దూరమైన పిల్లల కోసం ఏదైనా చేయాలని నాకప్పటినుంచే అనిపించేది’ అన్నారు.
బచ్‌పన్ బచావో ఆందోళన్!
‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ను సత్యార్థి 1980లో ప్రారంభించారు. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా బాల కార్మికులకు.. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించింది. ముఖ్యంగా ఢిల్లీలో బాల కార్మికులను రక్షించేందుకు దాడులు నిర్వహిస్తున్న అధికారులకు అన్నివిధాలుగా సహకరించింది. బాలల హక్కుల కోసం ఈ సంస్థ శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లలో ఈ సంస్థ చాలా క్రియాశీలంగా ఉంది. ఈ సంస్థకు 70 వేలమంది వ్యక్తిగతంగా సహకరిస్తుంటారు. 750 పౌరసంస్థలు దీని కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రజాఉద్యమంలాంటి ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలను ముఖ్యంగా.. ‘ది అసోసియేషన్ ఆఫ్‌వాలంటరీ యాక్షన్’, ‘ద బాల్ ఆశ్రమ్ ట్రస్ట్’, ‘సేవ్ ది చైల్డ్‌హుడ్ ఫౌండేషన్’ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు నిర్వర్తిస్తుంటాయి.
మోదీజీ.. మీదే బాధ్యత!
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నరేంద్రమోదీ గురించి సత్యార్థి ట్విటర్‌లో ఇలా స్పందించారు. ‘టీ అమ్మే ఒక బాలుడు ప్రతికూలతలను జయించి భారత ప్రధాని అవుతున్నారు. ఇక ఏ చిన్నారీ బాల కార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే’ అని ట్వీట్ చేశారు.