బాలల చట్టాలపై సరైన ప్రచారం లేదు
స్పీకర్ మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ కారణాల వల్ల 18 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనా చారి ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల చట్టాలపై సరైన ప్రచారం కూడా ఉండడం లేదన్నారు. యూనిసెఫ్ సహకారంతో కర్ణాటక లెజిస్లేటర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ బాలల హక్కులు, వాటి అమలు అంశంపై కర్ణాటక విధాన సభ బెంగళూరులో గురువారం ఒక రోజు లెజిస్లేటర్స్ ప్రాంతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కర్ణాటక రాష్ట్రంతో పాటు 8 దక్షిణాది రాష్ట్రాల్లోని 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ.. బాలల హక్కుల చట్టాల పట్ల సమాజానికి ఏరకమైన అవగాహన కల్పించామనే అంశాన్ని ప్రజా ప్రతినిధులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల విషయంలో తీసుకుంటున్న అంశాలను ఆయన వివరించారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడూతూ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బాలల హక్కులు, అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ నుంచి మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, వివేకానందా, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, భాను ప్రసాద్, గంగాధర్ గౌడ్, భూపతిరెడ్డి, ఆకుల లలిత, అసెంబ్లీ సహాయ కార్యదర్శి కరుణాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారని స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.