రుచించని మధ్యాహ్న భోజనం | Liking for a lunch | Sakshi
Sakshi News home page

రుచించని మధ్యాహ్న భోజనం

Published Thu, Jul 17 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

Liking for a lunch

  • పథకంపై పర్యవేక్షణ లోపం
  •  చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ
  •  డీఈవోపై విద్యాశాఖ డెరైక్టర్ ఫైర్
  • విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఎక్కువుగా డ్రాప్‌ఔట్స్ ఎందుకు ఉంటున్నారు? మధ్యాహ్న భోజన పథకంపై ఎందుకు పర్యవేక్షణ  చేపట్టడం లేదు? పాఠశాలల తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు? చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఎక్కువుగా ఈ జిల్లా నుంచే ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్, ఎస్‌ఎస్‌ఏ పి.డి.ఉషారాణి విశాఖ డీఈఓ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. మధ్యాహ్నభోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, భోజనంలో నాణ్యత లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆమె డీఈఓను ప్రశ్నించారు.

    విజయనగరం, విశాఖ జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు ఎక్కువగా జరుగుతున్నాయని చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఆయా జిల్లాల విద్యార్థులే ఫిర్యాదులు చేశారని ఆమె తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉత్తరాంధ్ర విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అవకతవకలకు పాల్పడిన మండల విద్యాశాఖాధికారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు త్వరలోనే షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు  ఉషారాణి వెల్లడించారు.

    మధ్యాహ్నభోజన పథకంలో సమస్యలున్న వారు చైల్డ్‌రైట్స్ సెల్ 18004253525 నెంబరుకు సంప్రదించాలన్నారు. విద్యారంగంలో విశాఖ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అన్ని మండలాల ఎంఈఓలకు నెట్ సదుపాయం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతిపాఠశాలలోనూ మరుగుదొడ్లు నిర్వహణ సరిగా జరగడంలేదని మరుగుదొడ్ల నిర్వహణపై  మూడు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలన్నారు.
     
    సమస్యలు ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

    ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు, మౌలిక వసతులు లేకపోవడంపై ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరిగా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం లేదన్నారు.  ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు నియంత్రించాలన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత ప్రసంగిస్తూ మధ్యాహ్న భోజన పథకం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో ఉన్న జెడ్పీ హైస్కూళ్లను మున్సిపల్ పరిధిలోకి తేవాలన్నారు.

    దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా పాఠశాలల్లో మంచినీటి సదుపాయం లేదన్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావిధానాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీతో పాటు మూడు జిల్లాల విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు  పాల్గొన్నారు.
     
    ఏజెన్సీలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

    విశాఖ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా ఉంటున్న బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్లు  ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరి నియామానికి సంబంధించిన నిధులను ఐటీడీఏ పీవోకు ఇచ్చినట్లు తెలిపారు.  
     
    విద్యుత్ శాఖ సీఎండీపై గంటా గరంగరం

    తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శేషగిరిబాబుపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల విద్యాశాఖా అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. పదినిమిషాలు పవర్ రాకపోవడంతో మంత్రి గంటాతో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు కొంత ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి గంటా విద్యుత్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి వేళాపాళా లేకుండా కరెంట్ ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ రోజు జిల్లా పరిషత్‌లో సమీక్షా సమావేశం జరుగుతోందని తెలియదా.. రోజూ పత్రికలు చదవరా ..అంటూ శేషగిరిబాబుపై మండిపడ్డారు.  
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement