ఆటపాటలకు ఓటేద్దాం..! | Hear the children heart throat On the occasion of Childrens Day | Sakshi
Sakshi News home page

ఆటపాటలకు ఓటేద్దాం..! చిన్ని పాపలకు ఎన్నికలలు!

Published Wed, Nov 14 2018 1:24 AM | Last Updated on Wed, Nov 14 2018 1:24 AM

Hear the children heart throat On the occasion of Childrens Day - Sakshi

ఆట – పాట, తుళ్లింత – కేరింత, ఉత్సాహం – సంతోషం, ఆశలు – ఆకాంక్షలు, నవ్వులు – పువ్వులు.. మెరుపు మెరిస్తే.. హరివిల్లు విరిస్తే.. అది తమ కోసమేనని మురిసిపోయే బాల్యం అమూల్యం. పిల్లల ఆనందం ఆకాశమంత! ఇదంతా నాణేనికి ఒకవైపు. ఉత్తుంగ తరంగాలై ఉప్పొంగే ఆ చిన్నారి లోకానికీ ఎన్నో కలలుంటాయి. మనసు విప్పి చెప్పుకోలేని మాటలుంటాయి. వారి గుండె లోతు అగాథమంత. మన పార్టీలు, వాటి మేనిఫెస్టోలు ఆ లోతును కొలుస్తున్నాయా? అటువైపు చూస్తున్నాయా? ఎన్నికల వేళ చిన్నారుల కలలను పండించే.. పండుగ చేసే అంశాలను చర్చిద్దాం. నేడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల గుండె గొంతుకను విందాం.

రేపటి తరానికి ప్రతినిధులుగా, భావి భారత నిర్మాతలుగా ఎదగాల్సిన బాలలపై నిర్లక్ష్యపు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోషకాహారలేమి, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పేదరికం కారణంగా చదువుకోలేని దుస్థితి పిల్లలను వెంటాడుతోంది. ఇంట్లో, బడిలో, తల్లిదండ్రులు, గురువుల సంరక్షణలో ఎదగాల్సిన పిల్లలు వీధుల పాలవుతున్నారు. బాల్యవివాహాల కారణంగా మాతాశిశు మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక రకాల హామీలతో మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. కానీ వీటిలో పిల్లల హక్కులు, భద్రత ఊసే ఉండదు. చిన్నారుల ఆకాంక్షలు ప్రతిబింబించవు. బహుశా వారు ఓటర్లు కాదనేది పార్టీల అభిప్రాయం కావచ్చు. ఈ కారణంగానే ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో చిన్నారులకు సంబంధించిన హక్కులు, రక్షణ తదితర అంశాలపై ప్రస్తావనే ఉండటం లేదు.

ఎడారిలో ఒయాసిస్సు...
ఒక అంచనా మేరకు తెలంగాణలో సుమారు 62 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 34 లక్షల మందికి పైగా కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుకుంటుండగా, మరో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో చదువుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ లోపం, బోధన సరిగా ఉండకపోవడం వంటి కారణాల వల్ల పిల్లలు నాణ్యమైన చదువులకు నోచుకోవడం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎండమావిగానే మారింది. పోషకాహారలేమి, పటిష్టమైన బోధన లేమి, పేదరికం కారణంగా చాలామంది పిల్లలు పదో తరగతితోనే ఆపేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ లేక ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఇక్కడ ర్యాంకుల వెంట పరుగెత్తించే పరికరాలుగా పిల్లల్ని మార్చేస్తున్నారు. 

ఆందోళన కలిగిస్తున్న బాల్య వివాహాలు
‘‘వేసవి.. పిల్లలకు ఆటవిడుపు కాలం. కానీ, ఆ సంతోషం లేకుండానే తల్లిదండ్రుల బలవంతపు పెళ్లిళ్లకు పిల్లలు తలవంచుతున్నారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల అమ్మాయిలు బాల్య వివాహాలకు సమిధలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణాలు, నగరాల్లోనూ ఈ దారుణం కొనసాగుతోంది’’ అని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అంటున్నారు. ప్రభుత్వం రికార్డుల ప్రకారం 2016లో 416 మందికి, 2017లో 360 మందికి బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 150కి పైగా గుర్తించారు. లెక్కలోనికి రానివి వేలల్లో ఉన్నట్లు అంచనా. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు కావడం వల్ల, పోషకాహారలేమి, రక్తహీనతతో ప్రసూతి మరణాల బారిన పడుతున్నారు. ఇలాంటి తల్లులకు పుట్టే పిల్లల్లో సరైన ఎదుగుదల లేకప్రతి ఐదుగురిలో ఒక్కరు పురిట్లోనే కన్నుమూస్తున్నారు.

అక్కరకు రాని ‘పోక్సో’
లైంగిక అత్యాచారాలు, వేధింపులు చిన్నారులపై నిత్యకృత్యంగా మారాయి. ఇల్లు, వీధి, బడి, రోడ్డు అనే తేడా లేకుండా పిల్లలు ఈ దారుణహింసకు గురవుతున్నారు. అసహజ లైంగిక చర్యలకు బలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇలాంటివి 1,064 కేసులు నమోదైనట్లు అంచనా. కానీ ఠాణా మెట్లెక్కనివి అంతకు రెట్టింపే. అత్యాచార బాధిత చిన్నారుల కోసం పోక్సో వంటి పటిష్టమైన చట్టాలున్నా.. అమలు అంతంతే. ఈ చట్టం ప్రకారం పోలీసులే  బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. సత్వరమే వైద్యసహాయం అందజేయాలి. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిం చాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు బాధిత చిన్నారులకు రూ.లక్ష  పరిహారంగా అందజేయాలి. కానీ ఒక్క కేసులోనూ పరిహారం అందింది లేదు. 

ఊగని ’ఊయల’
వివిధ కారణాలతో శిశువులు చెత్తకుండీల పాలుకావద్దనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ’ఊయల’ పథకానికి శ్రీకారం చుట్టారు. అంగన్‌వాడీ, ఎమ్మార్వో ఆఫీస్, ప్రసూతి ఆసుపత్రుల వద్ద  స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఊయలలను ఏర్పాటు చేయాలి. పిల్లలను భారంగా భావించే వాళ్లు వీటిలో వేసి వెళ్లవచ్చు. ఈ పిల్లల పోషణ, చదువు, భవిష్యత్తు ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ ఈ పథకం సరిగా అమలు కావట్లేదు. ఈ ఏడాది ఇప్పటికి 93 మంది పిల్లలు చెత్త కుప్పల్లో, పేవ్‌మెంట్లపై లభించినట్లు అంచనా. మరోవైపు ఆదరణ లేక 10 వేల మంది చిన్నారులు అనాథాశ్రమాలలో మగ్గిపోతున్నారు. 

‘పిల్లలకు హక్కులుంటాయని పార్టీలు గుర్తించవు.. ఎందుకంటే పిల్లలకు ఓటు హక్కు లేదు!’
– రెనెటా వింటర్, చైర్‌పర్సన్, సీఆర్‌సీ (బాలల హక్కుల కమిటీ)

ఏ దేశంలోనైనా ఎన్నికలంటే పెద్దవాళ్లకు పరిమితమైన కోలాహలంగానే పరిగణిస్తారు. వివిధ వర్గాలు, జాతులు, మతాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల్లో పార్టీలు పలు హామీలు గుప్పిస్తుంటాయి. కానీ అన్ని మతాల్లో, జాతుల్లో, వర్గాల్లో ఉమ్మడిగా కనిపించే పిల్లల కోసం ఆలోచించే పార్టీలు, ప్రభుత్వాలు తక్కువే. మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. చిన్న పిల్లలకు, వారి హక్కులకు అభివృద్ది చెందిన దేశాలు ప్రాధాన్యమిస్తాయి. మన దగ్గర పార్టీలు తన మేనిఫెస్టోల్లో మొక్కుబడిగా స్త్రీ, శిశుసంక్షేమం గురించి లోతైన పదాలతో తోచింది రాసి వదిలేస్తాయి. 

పిల్లల హక్కులు మూడు
ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ప్రకారం పిల్లలకు 3 రకాల హక్కులుంటాయి.
జీవించే హక్కు: పోషణ, ఆవాసం, వైద్యం పొందే హక్కు, సరైన జీవన ప్రమాణాలను కోరుకునే హక్కు
అభివృద్ది హక్కు: సరైన విద్య, క్రీడలు, విశ్రాంతి, సాంస్కృతిక కార్యక్రమాలను అందుకునే హక్కు. ఆలోచనల్లో స్వేచ్ఛ, మత స్వేచ్ఛ లభించే హక్కు
రక్షణ హక్కు: న్యాయపరమైన కఠిన శిక్షల నుంచి రక్షణ, బాలకార్మికతను తిరస్కరించే హక్కు. అన్ని రకాల వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు. 

మన దేశంలో.. 
- మొత్తం జనాభాలో 36 శాతం మంది చిన్న పిల్లలే.
కోటిమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు.
మూడింట ఒక వంతు పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు.
1.5 కోట్లకు పైగా బాల కార్మికులున్నారు.

గతంలో ఏం చెప్పాయి?
ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోల్లో పిల్లల సంరక్షణకు పెద్దపీట వేశాయి. సర్వశిక్షా అభియాన్‌ను సమర్థవంతంగా తీర్చిదిద్దటం, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతం చేయడం, విద్యా విధానం డిజిటలైజేషన్, జాతీయ విద్యా కమిషన్‌ ఏర్పాటు, పాఠశాలల్లో పరిశుభ్రత కల్పించడం, పుస్తకాల భారం లేకుండా సాంకేతికత వినియోగం, బాలికా విద్యకు ప్రోత్సాహం, విద్యా హక్కు, ఆహార భద్రతా చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం, బాల కార్మిక చట్టం బలోపేతం.. వీటిలో పూర్తిగా అమలైన హామీలు వేళ్లపై లెక్కించేవే. పిల్లల  కోసం ప్రభుత్వాలు, పార్టీలు పెద్దగా స్పందించకున్నా, పలు ఎన్‌జీఓలు, ఇతర సంస్థలు పలు కార్యక్రమాలు రూపొందించి, పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నాయి. ఈసారి ఎన్నికల సందర్భంగా పలు సంస్థలు బాలల డిమాండ్లను పార్టీలకు అందిస్తున్నాయి.

రేపటి పౌరుల కోసం..
తమకేం కావాలో పిల్లలే పార్టీలకు తెలియజేసే సంఘటన రాజస్తాన్‌లో జరిగింది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్ర వాతావరణం తదితర అంశాలపై తమ డిమాండ్లను పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాలని స్కూలు పిల్లలు కోరారు.
బ్రిటన్‌లో లేబర్, కన్జర్వేటివ్‌ పార్టీలు పిల్లల విద్యపై ప్రత్యేకంగా తమ మేనిఫెస్టోల్లో పేర్కొంటాయి. ఏటా ఎన్ని కొత్త స్కూళ్లు నిర్మిస్తామో చెబుతాయి.
విద్యార్థుల స్కూల్‌బ్యాగ్‌ బరువు వారి బరువులో 10 శాతానికి మించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రాబల్యం దృష్ట్యా.. అక్కడి పిల్లల చేతుల్లో గన్నుల బదులు పెన్నులు ఉంచుతామని పార్టీలు హామీలిచ్చాయి. 
నార్వేలో ఎన్నికలకు ముందు అక్కడి ఎనిమిది ప్రధాన పార్టీలు ప్రత్యేక వీడియోల ద్వారా చిన్నారుల కోసం ఏం చేస్తాయో వివరిస్తాయి. ప్రతి పాఠశాలలో ఎన్నికల టాక్‌షోలు నిర్వహిస్తారు. పిల్లలపై పార్టీల వైఖరి ఆధారంగా అక్కడి ఓటర్లు ప్రభావితమవుతుంటారు. 
నమీబియాలో వీధి బాలల వివరాల్ని కంప్యూటరైజ్‌ చేస్తామని అక్కడి ప్రధాన పార్టీ డీటీఏ మేనిఫెస్టోలో హామీనిచ్చింది. 
..::పగిడిపాల ఆంజనేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement