ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఒకరిపై ఆధారపడి స్కూల్‌కు వెళ్లే బాలికలు అశక్తులుగా మారుతున్నారని.. దాదాపు 90 శాతం మందిపై ఈ ప్రభావం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై) హరియాణా, బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లే బాలికల ప్రతికూల, అనుకూల అంశాలపై అధ్యయనం నిర్వహించింది. అలాగే ప్రభుత్వాల వివిధ పథకాలు దేశంలో బాలికలను విద్య వైపు ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఎవరో ఒకరిపై ఆధారపడుతూ విద్యాసంస్థలకు వెళ్లడం బాలికలను అశక్తులుగా మారుస్తుందని.. దీని ప్రభావం 90 శాతం మంది బాలికలపై ఉందని అధ్యయనం వివరించింది.
‘తరచుగా స్కూళ్లకు గైర్హాజరయ్యే బాలికలు 29 శాతం ఉంటే, మహిళా టీచర్లు లేక 18 శాతం మంది స్కూళ్లకు హాజరుకావడం లేదు. ఇవి బాలికలను మధ్యలోనే స్కూల్ మానివేసే పరిస్థితికి తీసుకొస్తున్నాయి..’అని నివేదికలో పేర్కొంది. ఇక తరచూ అనారోగ్యం కారణంగా 52 శాతం మంది, ఇంటిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా 46 శాతం మంది విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరువుతున్నారని.. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన బాలికల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిపింది. అలాగే మౌలిక వసతులు, సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేక చాలామంది బాలికలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారంది. 87 శాతం స్కూళ్లు బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల్ని కోరినట్లు సీఆర్‌వై నివేదికలో తెలిపింది. సంబంధిత నాలుగు రాష్ట్రాల్లోని 1,604 ఇళ్లలోని 3 వేలకు పైగా మంది అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు సీఆర్‌వై వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment