
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది.
ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు.

ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.
MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.
వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు.
మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment