బాలల హక్కులు, వారి రక్షణ గురించి పోలీసు అధికారులు అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కరరావు సూచించారు.
గుంటూరు క్రైం : బాలల హక్కులు, వారి రక్షణ గురించి పోలీసు అధికారులు అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ జె.భాస్కరరావు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం హెల్త్ స్వచ్ఛంద సంస్థ, సీఐడీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో బాలల న్యాయ, రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఐ, ఎస్‌ఐలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ భాస్కరరావు మాట్లాడుతూ బాలల పట్ల లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు జరుగకుండా ఉండేలా పిల్లల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా నష్టం జరిగిన సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించిన వెంటనే వెంటనే స్పందించి బాలలను పరిరక్షించాలని చెప్పారు. రూరల్ జిల్లా అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, అసమానతల కారణంగా కొందరు యువతులను అక్రమ రవాణాదారులు పసిగట్టి వారిని వ్యభిచార కూపంలోకి దింపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మానవ అక్రమ రవాణాదారులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ రోషన్‌కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లందరినీ బాలలుగానే పరిగణించాలని, వారి అన్నిరకాల హక్కులు పొందడంతో పాటు, వారు అక్రమ రవాణాదారుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు, పోలీసులపై ఉంటుందని చెప్పారు. సమావేశంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, ట్రైనర్ కిస్మత్‌కుమార్, డీఎస్పీలు బి.ప్రసాద్, జి.లక్ష్మయ్య, చైల్డ్‌లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.