బాలల హక్కుల పరిరక్షణ
-
హక్కుల పరిరక్షణ కమిషన్ పిలుపు
సాక్షి, విశాఖపట్నం
బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యమివ్వాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రూపాకపూర్ ఆదేశించారు. ఆందోళన కలిగించేలా పెరుగుతున్న బాల కార్మికులు ఎక్కడా లేకుండా చేయాలన్నారు. గురువారం మహిళా శిశు సంక్షేమాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్, పోలీస్, విద్యా, వైద్యం, కార్మిక, ఆర్పీఎఫ్, జీవీఎంసీ యూసీడీ అధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్ల లోపు బాలబాలికల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం ఎన్‌సీపీసీఆర్–2007 చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ బాలికల అభ్యున్నతికి బేటీ బచావో–బేటీ పడావో నినాదాన్ని తీసుకొచ్చారన్నారు. సంచార జాతులకు చెందిన బాలలు దయనీయ స్థితిలో జీవిస్తున్నారని, వీరికి తగిన చేయూతనివ్వాలన్నారు. ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు పంపి విద్యనభ్యసించే విధంగా ప్రోత్సహించాలన్నారు. బాలలకు తగిన పౌష్టికాహారాన్ని అందించి, వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలన్నారు. బాలల హక్కులను రక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీలు, అనుబంధ శాఖలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంచార జాతులకు విద్యనందించేందుకు తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు మంచి నడవడిక నేర్పించడం, సర్వశిక్షాభియాన్ ద్వారా పథకాలను వర్తింపచేయడం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, బడిబయట పిల్లల్ని పాఠశాల్లలో చేర్పించడం, వారికి ఉచితంగా పుస్తకాలను, యూనిఫాంలు అందించడం చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.