పీడిత సమాజంలో పీడనకు ఒక వర్గం బాలలు బలవుతున్నారు. అందుకే బాలలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో భారత సమాజం ఉందంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మూడు వంతులుగా ఉన్న బాలల స్థితిగతులను పరిశీలించాల్సిందే. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బాలల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాలు రూపొం దాయి. ప్రత్యేక హక్కులు బాలలకు దఖలు పడ్డాయి. ఇవి భారతదేశంలో 1992 నుండి అమలులోనికి వచ్చాయి. వివక్ష లేకుండా అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, జీవించే హక్కును కలిగి ఉండటం బాలల హక్కుల మూల సూత్రాలు.
పేదరికం కారణంగా చదువుకి దూరమై కష్టతరమైన పనులు చేస్తూ గడపాల్సిన దుఃస్థితిలో బాలలు ఇప్పటికీ ఉన్నారు. కనీసం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకునే చదువు వరకు కూడా వెళ్లలేకపోతున్నారు. 5 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలలో ప్రతి 8 మందిలో ఒకరు తమ కోసమో, తమ కుటుంబం కోసమో పాలబుగ్గల ప్రాయంలోనే పనివారుగా మారుతున్నారు. 29 శాతం ప్రాథమిక విద్యకు ముందే బడి మానేస్తున్నారు. వీరిలో అట్టడుగు వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) వల్ల 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే బాలలు డ్రాపవుట్లుగా మారే ప్రమాదముంది. జాతీయ నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమలైతే బాలలు యాచకులుగా, బాల కార్మికులుగా, వలస బాధితులుగా, నేరగాళ్లుగా తయారయ్యే అవకాశం ఉంది.
బీజేపీ అధికారంలోనికి రాగానే బాలకార్మికుల పనికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఏ దేశంలో కూడా ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. బాలలే ఈ సమాజానికి పెట్టుబడి అని ఒకవైపు అంటూనే ఇటువంటి చట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇందువల్ల పిల్లలు కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)... భారత్‌లో ప్రతి 100 మందికి 79 మంది బాలలు రక్త హీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. శారీరక ఎదుగుదల లేని బాలలు 64 శాతం మందీ, తగినంత బరువులేని బాలలు 43 శాతం మందీ ఉన్నారనీ, ప్రతి ఏటా అంధత్వంతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారనీ డబ్ల్యూహెచ్‌ఓ తేటతెల్లం చేసింది. శిశు సంరక్షణకూ, బాలల ఆరో గ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక పోవడం కార ణంగా మన దేశంలో బాలల పరిస్థితి ఇంతగా దిగజారింది.
మనసుంటే ప్రస్తుతం ఉన్న వనరులూ, చట్టాల తోనే బాలల స్థితిగతులను మెరుగుపరచవచ్చని కేరళ రాష్ట్రం నిరూపించింది. బాలలకు పౌష్టికాహారం అందించడంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. విద్యా రంగంలో మోడల్‌గా ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఐఎఫ్‌ఆర్ లీడ్‌లు సంయుక్తంగా 24 సూచికలతో చేసిన సర్వేలో కేరళ చిన్నారుల సంక్షేమంలో టాప్‌లో ఉందని వెల్లడైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్ ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్‌ఈపీ అమలైతే రేపటి పౌరుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
బాలల్లో అన్నార్తులు, అనాథలు, యాచకులు, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు ఉండకూడదంటే వినాశకర సంస్కరణలు ఆపాలి, ఆగాలి. బాలలకు రాజ్యాంగం ఇచ్చే హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి శిశువుకు మంచి భవితను కోరుకునే హక్కు ఉంది. ఆ హక్కుల రక్షణకు పోరాడే వేదికలకు మద్దతునివ్వాలి.
కె.విజయ గౌరి, వ్యాసకర్త యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మొబైల్: 89853 83255
Comments
Please login to add a commentAdd a comment