భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న ఓ కంపెనీ మేనేజర్‌తో సహా ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసినట్టు భువనగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్ర పరిధిలోని ఎస్‌పీఎస్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ(జిప్స్)లో మంగళవారం రాచకొండ ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, ఆపరేషన్ స్మైల్ సంయుక్త ఆధ్వర్యంలో అకస్మిక దాడులు నిర్వహించారని తెలిపారు.
కంపనీలో 18 ఏళ్ల లోపు ఉన్న 11 మంది బీహార్ రాష్ట్రానికి చెందిన బాలలతో పని చేయించుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. అంతేకాక తక్కువ వేతనంతో వారిచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విచారణలో తెలిసిందని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న మేనేజర్ ఉరిమింది వెంకటేశ్వరప్ప, బీహార్‌కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ సంతోష్‌యాదవ్, లేబర్‌ను సరఫరా చేస్తున్న రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన పల్లె బాబురావును బుధవారం అరెస్ట్ చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న ఎస్‌పీఎస్ యార్న్ కంపనీ ఎండీ నరేశ్ తాపర్‌ను త్వరలో అరెస్ట్‌చేస్తామన్నారు.
నిందితులపై బాలకార్మికచట్టం, వెట్టిచాకిరి చట్టం, జెవైనల్ జస్టిస్ చట్టం, ఉమన్ ట్రాక్ రూల్ మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు. అలాగే హోటళ్లు, షాపుల్లో పనిచేస్తున్న భువనగిరిలో ఆరుగురు, చౌటుప్పల్ నలుగురు చొప్పున బాలకార్మికులకు విముక్తి కల్పించామని అన్నారు. మూడు కేసులలో మొత్తం 21 మంది బాలకార్మికులను చైల్ట్ వేల్ఫేర్ కమిటీకి అప్పగించామని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న షాపు యజమానులకు నోటీసులు ఇచ్చామని, విచారణ అనంతరం తగిన జరిమానా విధించనున్నట్లు చెప్పారు. రాచకొండ పోలీసుల తరుపున ఆపరేషన్ స్మైల్ టీమ్‌లు ఇకపై ఇటుక బట్టీలు, ఫౌల్ట్రి, స్పిన్నింగ్ మిల్లు, కెమికల్ కంపనీలు, లాడ్జ్రీలు, షాపులలో తరచు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటులో యాదాద్రి ఫస్ట్
తెలంగాణ రాష్ట్రంలోనే సీసీ కెమెరా ఏర్పాటులో యాదాద్రిభువనగిరి జిల్లా మొదటి స్థానంలో ఉందని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో నేను సైతం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగానే 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగ, ఇప్పటి వరకు 936 ఏర్పా టు చేశామని వివరించారు. ఆలేరు మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామం, షాపు, ఇంటింటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీ సులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, చౌటుప్పల్ ఏసీపీ రమేశ్‌జాదవ్, ఎస్‌ఓటీ ఎస్‌ఐ సురేశ్, ఆపరేషన్ స్మైల్ ఎస్‌ఐ సాయిలు, స్థానిక ఎస్‌ఐలు రాఘవేంద్రగౌడ్, వెంకట య్య, లేబర్ ఆఫీసర్ మహ్మద్ అహ్మ ద్, చైల్డ్‌లైన్ టీమ్ జిల్లా సభ్యుడు యాదయ్య, సిబ్బంది ప్రతాప్, కరుణాకర్, సుధాకర్, శంకర్, జనార్దన్, ధనుంజయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment