సాక్షి హైదరాబాద్: చిన్నారుల మోములో చిరునవ్వులు వికసించాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. తప్పిపోయి నిరాదరణకు గురై ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల అక్కున చేరుతుండగా, వెట్టిచాకిరీలో మగ్గుతున్న బడీడు బాలకార్మికులు చదువుబాట పడుతున్నారు.
బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ నెల 1 నుంచి 31 వరకు తప్పిపోయిన బాలలను గుర్తించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణతో పాటు భిక్షాటన చేసే చిన్నారులు, వీధిబాలలు, అనాథలు, బడిమానేసిన చిన్నారులు, ఇతరత్రా అంశాల్లో వారిని గుర్తించి విముక్తి కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.
రంగంలోకి బృందాలు
గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ స్మైల్– 8 స్పెషల్ డ్రైవ్ కోసం పోలీసు డిపార్ట్‌మెంట్ , లేబర్ డిపార్ట్‌మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కూడిన సుమారు 24 బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇళ్లు, గాజుల పరిశ్రమలు, భిక్షాటన, దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఈ బృందాలు కృషి చేస్తాయి. పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన అదృశ్యం కేసుల్లోనూ చిన్నారుల వివరాలను సేకరించి.. వాటిని సీసీటీఎన్‌ఎస్‌లోని డాటాబేస్‌తో పోల్చిచూస్తున్నారు.
ఇందుకోసం పోలీసులు దర్పణ్ అనే సరికొత్త టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు. దీనిద్వారా తప్పిపోయిన చిన్నారులు.. వివిధ ప్రభుత్వ హోంలు, అనాథాశ్రమాలు, ఎన్జీఓల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఫొటోలను పోల్చిచూస్తూ వారి వివరాలు కనిపెట్టడంలో సఫలీకృతమవుతున్నారు.
సదుపాయాలు ఏవి?
ఆపరేషన్ స్మైల్‌లో చిన్నారుల గుర్తింపు, కుటుంబాల వద్దకు చేర్చడం, లేదా వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పించడం సమస్యగా తయారైంది. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య తప్పడంలేదు. పతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామన్న మహిళా శిశు సంక్షేమ శాఖ హామీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల బాలల వివరాలు, కనుక్కోవడం క్లిష్టతరంగా మారుతోంది.
ఎనిమిదేళ్లుగా...
వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో ఆపరేషన్ స్మైల్ 2015లోశ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లలో సుమారు 3 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 1600 మందికిపైగా చిన్నారులను తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 14వందల మందిని వివిధ హోమ్స్‌కు తరలించారు.
ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌కు బీజం పడింది. పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆదర్శంగా తీసుకొని కార్యక్రమ రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment