సాక్షి, భువనేశ్వర్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎంతోమంది చిన్నారులకు తమ తల్లిదండ్రులను దూరం చేసింది. కొంతమంది తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా, మరికొందరు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని పోగొట్టుకుని, దిక్కులేని వారుగా మిగిలిపోయారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటువంటి చిన్నారుల బాగోగులను చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) అభ్యర్థన మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణతో నివేదిక దాఖలు చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆగస్టు 13 వరకు ప్రభుత్వాలకు ధర్మాసనం గడువు విధించింది.
రెండో స్థానంలో రాష్ట్రం..
2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూలై 23 మధ్య రాష్ట్రంలో సుమారు 6,562 మంది బాలలు కరోనా కాటుతో తమ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. దీంతో అనాథ బాలల జాబితాలో జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 13,589 మంది అనాథ బాలలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వీరి భవిష్యత్ అంధకారం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు ఆదేశించాలని అభ్యర్థించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చిన్నారుల భవిష్యత్ సంరక్షణ, విద్య తదితర సంక్షేమ కార్యకలాపాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సి ఉంది.
కరోనా తాండవించిన వ్యవధిలో కరోనా లేదా కరోనాయేతర రోగాలతో ఉభయ తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన అనాథ బాలల వివరాలను బాల స్వరాజ్ పోర్టల్‌లో దాఖలు చేయాలని స్పష్టంచేసింది. కరోనా విపత్తుతో గత 2020 ఏప్రిల్ 1 నుంచి ఏడాది జూలై 23 మధ్య 818 మంది చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 5,742 మంది తల్లి లేదా తండ్రిని కోల్పోవడం విచారకరం. గత నెలలో బాలల హక్కుల కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ సంఖ్య 26గా పేర్కొనడం గమనార్హం. అనంతరం73 మంది శిశువులు అనాథలైనట్లు రెండో అఫిడవిట్‌లో పొందుపరిచారు. 6,210 మంది అనాథ శిశువులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా 75,320..
జాతీయ స్థాయిలో కరోనా మహమ్మారి 75,320 మంది చిన్నారులను అనాథలుగా మిగిల్చింది. వీరిలో ఉభయ తల్లిదండ్రుల్ని కోల్పోయిన బాలలు 6,855 మంది. తల్లి లేదా తండ్రి అండ కోల్పోయిన వారు 68,218 మందిగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్‌సీపీసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొన్నారు. వీరితో మరో 247 మంది దిక్కులేని బాలలు మిగిలారని కమిషన్ విశ్లేషించింది. 30 పేజీలతో కమిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిటు దాఖలు చేసింది. ఈ వ్యవధిలో అనాథలుగా మారిన బాలల తల్లిదండ్రులు కరోనా, ఇతరేతర రోగాలతో మరణించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment