న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి.
మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’
హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే.
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
Published Tue, Dec 31 2024 5:23 AM | Last Updated on Tue, Dec 31 2024 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment