తండ్రి గంగయ్యతో కూతురు శ్వేతరాణి, కుమారుడు అనిరుధ్ (ఫైల్)
సాక్షి,బజార్‌హత్నూర్(అదిలాబాద్): ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. ఏడాది క్రితం తల్లి క్యాన్సర్ మృతిచెందగా, నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గంగాపూర్‌కు చెందిన రామగిరి గంగయ్య, భారతి దంపతులు. వీరికి అనిరుధ్, శ్వేతరాణి సంతానం. తల్లిదండ్రుల మృతితో వీరు దిక్కులేని వారయ్యారు. ఉండడానికి సొంత ఇల్లు లేదు.
బజార్‌హత్నూర్ జెడ్పీ సెకండరీ పాఠశాలలో అనిరుధ్ 9వ తరగతి చదువుతున్నాడు. శ్వేతరాణి ఇచ్చోడ కేజీబీవీలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సంవత్సరం క్రితం భారతి క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆ విషాదం నుంచి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో ఈనెల 6న రాత్రి గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బలన్‌పూర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామగిరి గంగయ్య(35) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
తల్లి మృతి తర్వాత
భారతి క్యాన్సర్‌తో మృతి చెందిన తర్వాత గంగయ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని బజార్‌హత్నూర్‌లోని బంధువుల ఇంటి వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మార్బుల్ మేస్త్రీగా పనిచేసే గంగయ్య రోజు ఇచ్చోడకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేవాడు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగా 6న బుధవారం రాత్రి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఆటో రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. సాయంత్రం వరకు వచ్చే తండ్రి రాకపోయేసరికి కొడుకు ఫోన్ చేయగా అరగంటలో చేరుకుంటానని చెప్పాడు. మార్గమధ్యలోనే బలన్‌పూర్ బ్రిడ్జి సమీపంలో సొనాలలో వారసంత ముగించుకుని వస్తున్న కూరగాయాల ఆటో గంగయ్య బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో గంగయ్యతోపాటు ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. గంగయ్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొదుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కుమారుడు అనిరుధ్ గాంధీ ఆసుపత్రిలో తండ్రి శవం పోస్టుమార్టం కోసం శుక్రవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. తండ్రి శవం రాక కోసం కూతురు ఇంటి వద్ద ఎదురు చూస్తూ కన్నీరుమున్నీరవుతోంది. చిన్నారి బాధను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment