అభినందనీయమే కానీ...?
'సొంత బిడ్డలా చూసుకుంటా. ఎంత ఖర్చయినా నీ ఆరోగ్యం బాగయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంటుంది. భవిష్యత్తులో నీ చదువుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. నీకు ఇల్లు కట్టించి ఇస్తా. మంచి అబ్బాయిని చూసి నా సొంత ఖర్చులతో నీ పెళ్లి జరిపిస్తా'... అంటూ ప్రత్యూషకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. కన్నతండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలతో ఆస్పత్రిపాలైన ప్రత్యూషను కేసీఆర్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యూషపై సీఎం చూపిన ఔదార్యం అభినందనీయం. అయితే ముఖ్యమంత్రిగా ప్రత్యూష లాంటి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
బాల్యంలో చిత్రహంసలు పాలవుతున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతోందని సర్కారీ గణంకాలే వెల్లడిస్తున్నాయి. అయినవారితో పాటు అసాంఘిక శక్తుల బారిన పడి ఎంతో మంది అభాగ్య బాలలు చిత్రహింసల పాలవుతున్నారు. ఇలాంటి కేసులో పోలీసులు సీరియస్ గా స్పందించిన దాఖలాలు బహుస్వల్పం. ప్రత్యూషపై అమానుష కాండను మీడియా హైలెట్ చేయడంతో పాటు హైకోర్టు సీరియస్ గా స్పందించడంతో ఆమెకు న్యాయం జరిగింది. వెలుగులోకి రాని దయనీయ బాలల పరిస్థితి ఏంటి?
అదృష్టవశాత్తు నరకకూపం నుంచి బయపడినా అభాగ్యుల సంరక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికే వస్తోంది. పునరావాస కేంద్రాలు జైళ్లను తలపిస్తుడడంతో ఇక్కడ ఉండలేక బాలలు పారిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పునరావాస కేంద్రం నుంచి 13 మంది బాలలు పరాయ్యారు. ప్రత్యూష విషయంలో స్పందించినట్టుగానే అధికార యంత్రాంగం.. అభాగ్యులను ఆదుకునేందుకు తగిన వ్యవస్థ ఉంటే దీనబాలలకు స్వాంతన లభిస్తుంది.
బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు చక్కదిద్దే వ్యవస్థ లేకపోవడం పెద్ద లోటు. బాలలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, వాటిని ఎలా కాపాడాలన్నదానిపై అటు అధికారులకు, ఇటు పాలకులకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. పాఠశాల స్థాయిలోనూ బాలల హక్కుల ఊసే లేదు. బాలల హక్కుల సంఘం ఉన్నా దాని పరిధి పరిమితం. చిన్నారుల సంరక్షణకు సర్కారు ఇకనైనా నడుంబిగించాలి.
ఈ దిశగా చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టాలి. చిన్నారులు రాక్షసుల బారిన పడకుండా కట్టుదిట్టమైన వ్యూహం రూపొందించాలి. రాక్షసుల బారి నుంచి కాపాడిన బాలలను అన్నిరకాలుగా ఆదుకుని వారి భవితకు బంగారు బాటలు పరిచేలా వ్యవస్థ రూపుదాల్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యూష లాంటి వారందరినీ సీఎం వ్యక్తిగతంగా పరామర్శించడం సాధ్యం కాదు కానీ ఆమెలా మరొకరు చిత్రహింసల పాలవకుండా చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంది.