
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కులపై ఆలోచన చేసే వారంతా వాటిని ఆచరణలో పెట్టాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని హాకా భవన్‌లో కొనసాగుతున్న భరోసా కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు(బాల్యమిత్ర కోర్టు)ను ఆయన శనివారం ప్రారం భించారు.
ఈ సందర్భంగా జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతపై నగరవాసులకు నమ్మకం కలిగిస్తోందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు నాల్గోదని, అయితే ప్రధాన న్యాయస్థానాలకు దూరంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు దేశంలో ఇదే మొదటిదని చెప్పారు.
క్షేత్రస్థాయికి వెళితేనే పరిష్కారం..
‘సమాజంలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నప్పుడే వాటి పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. న్యాయస్థానాల్లోనూ కాలానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు లోక్‌అదాలత్‌లు లేవు. ఇప్పుడు వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. సమాజశ్రేయస్సు కోసం సంస్కరణల్లో భాగంగా మార్పులు వస్తాయి’ అని జస్టిస్ లోకూర్ చెప్పారు.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ.. దేశంలో నాలుగో బాల్యమిత్ర కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటైందన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మరొకటి ఏర్పాటు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా బాల్యమిత్ర కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
బాలలు, మహిళలకు అండగా..
‘ఆపదలో ఉన్న బాలలు, మహిళల కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పోలీసుల నేతృత్వంలో ఏర్పాటైన భరోసా కేం ద్రం ఇది. రెండేళ్లలో భరోసా కేంద్రానికి 4 వేల ఫిర్యాదులు వచ్చాయి. న్యాయమూ ర్తుల సూచనలు, సహకారంతో బాల్య మిత్రకోర్టు ఏర్పాటు చేశాం’అని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు.
మహిళా, శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాల్లో చైల్డ్ భవన్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత, భరోసా, శాంతిభద్రతల ఇన్‌చార్జీ స్వాతిలక్రా మాట్లాడుతూ బాల్యమిత్ర న్యాయస్థానం ఏర్పాటులో హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయమూర్తుల ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment