బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పరిగి ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్
పరిగి : బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత..హక్కులపై అవగాహన అవసరం..బాలలకు హక్కులున్నాయని గుర్తిస్తే తప్ప వాటిని పరిరక్షించటం సాధ్యం కాదని ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్, ఎంఈఓ అంజిలయ్య, ఎస్‌ఐ నగేష్ , బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకుడు యాటగర్ల కృష్ణ అన్నారు. శనివారం పరిగిలోని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బాలలపై, ప్రధానంగా బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులకు సమాజం అండగా ఉండాలన్నారు. చైల్డ్‌లైన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఒంటరిగా తప్పిపోయిన బాలలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నావారు కనిపించినా చైల్డ్‌లైన్‌కు 1098 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయాలన్నారు. చైల్డ్‌లైన్ యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఇదే క్రమంలో బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ చెన్నకేశవరెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు విద్యార్థులు పాల్గొన్నారు.