childline
-
తెలిసీ తెలియక.. ఇంటిని విడిచివెళుతున్నారు!
మెంటాడ మండలానికి చెందిన పదేళ్ల బాలిక విజయనగరం చూద్దామని బస్సుఎక్కి సోమవారం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ సిబ్బంది వెంటనే బాలికను కార్యాలయానికి తీసుకొచ్చారు. వివరాలు సేకరించి రక్షణ కల్పించారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తల్లికి అప్పగించారు. విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు మందలించారని ఈనెల 10వ తేదీన బస్సులో విజయనగరం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు బాలికను సంరక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మక్కువకు చెందిన చెందిన 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల కిందట రైలులో ముంబయి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులు బాలుడిని విచారించి మక్కువ ప్రాంతంగా గుర్తించారు. విజయనగరం పోలీసులకు సమాచారం అందించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. విజయనగరం ఫోర్ట్: తెలిసీతెలియని వయసులో పిల్లలు క్షణికావేశానికి లోనవుతున్నారు. కొందరు ఇంటిని విడిచిపెడుతున్నారు. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, పట్టణాలు చూసొద్దామని, స్నేహితులపై మోజుతో.. ఇలా వేర్వేరు కారణాలతో చిన్నవయసులో ఇంటి నుంచి పారిపోతున్నారు. రైలు, బస్సు ల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో అనాథులుగా తిరుగుతున్నారు. ఆ సమయంలో పోలీసులకు, చైల్డ్‌లైన్ సభ్యులకు తారసపడిన వారు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. పొరపాటున అగంతుకులకు చిక్కితే అంతే సంగతి. మూడేళ్లలో జిల్లాకు చెందిన 229 మంది చిన్నారులు ఇళ్ల నుంచి పారిపోయి పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది సహకారంతో తిరిగి ఇంటికి చేరినట్టు రికార్డులు చెబుతున్నాయి. పిల్లల పెంపకంపై శ్రద్ధ అవసరం చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాఇష్టాలను తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై పిల్లల ప్రవర్తనను గమనించడంలేదు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలు చిన్న పొరపాటు చేసినా, చదువులో వెనుకబడినా కోపం ప్రదర్శిస్తున్నారు. గట్టిగా మందలిస్తుండడంతో పిల్లలు బెదిరిపోయి ఇంటిని విడిచిపెడుతున్నట్టు పోలీస్ అధికారులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి పిల్లల ప్రవర్తను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి ఆసక్తులను తెలుసుకోవాలి. కోపపడడం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడులు గురించి పెద్దలు చెప్పేవారు. ఓదార్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్ ఆదర్శంగా జీవించాలి.. తల్లిదండ్రులు ఆదర్శంగా జీవిస్తే పిల్లల్లో మంచి నడవడిక అలవడుతుంది. అలాకాకుండా చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవకు దిగుతున్నారు. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రేరేపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – జి.హైమావతి, చైల్డ్‌లైన్ ప్రతినిధి -
గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. ఆదరించిన చైల్డ్ లైన్
సాక్షి, అమరావతి: ఆమె పేరు బండారు దుర్గ. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. కట్టుకున్న భర్త కాదని వదిలి వెళ్లిపోయాడు. పేదరికంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల కడుపు నింపాల్సిన పరిస్థితి. ఇక కొడుకులను చదివించడం తలకు మించిన భారమే అయ్యింది.. ఆపై కరోనా దెబ్బకు పరిస్థితి మరింత దిగజారింది. పూట గడవక ఐదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అజయ్‌ని చదువు మాన్పించి గొర్రెల కాపరిగా పెట్టింది. ఏడాదికి రూ.30 వేలు తీసుకునే ఒప్పందంతో గొర్రెల యజమానికి అప్పగించింది. తల్లి కష్టాలను చూడలేక.. తల్లి కష్టాలను చూడలేని ఆ చిన్నారి పన్నెండేళ్ల వయసులో అయిష్టంగానే గొర్రెల కాపలాకు వెళ్లాడు. ఒప్పందం ప్రకారం రాత్రి వేళ కంటిమీద కునుకులేకుండా వాటికి కాపలాగా ఉండేవాడు. ఎప్పుడైనా కునుకు తీస్తే యజమాని కర్రలతో కొట్టే దెబ్బలను భరిస్తూ వచ్చాడు. ఊహ తెలియని వయసులో పాములు, పుట్టల మధ్య పగలూ, రాత్రి భయం భయంగా గడిపేవాడు. చదువుకు దూరమైపోతున్నానని తనలో తానే బాధపడేవాడు. చదువు కోవాలనే ఆరాటం.. చిన్నప్పట్నుంచి చదువు కోసం తపించే అజయ్.. తన తల్లి కోసం అన్నిటినీ భరించాడు. కానీ ఆ కష్టాలను, యజమాని కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇటీవల అక్కడ నుంచి రహస్యంగా పారి పోయి వచ్చేశాడు. మంగళగిరి రోడ్డెక్కి ఆటోలో విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆదరించిన చైల్డ్ లైన్.. ఆకలితో అలమటిస్తున్న అజయ్‌ని చూసి రైల్వేస్టేషన్‌లోని చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు చేరదీశారు. అజయ్ పూర్వాపరాలు ఆరా తీశారు. అప్పట్నుంచి తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. ఏదైనా మంచి స్కూలులో చేర్పించి అజయ్ విద్యా బోధన కొనసాగించే ప్రయత్నాల్లో వీరు ఉన్నారు. దేశ సేవ చేస్తా.. చదుకోవడమంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయిష్టంగానే అమ్మ చెప్పినట్టు గొర్రెల కాపరిగా వెళ్లా. అక్కడ భయం భయంగా గడిపాను. కాపరిగా ఉంటే ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్నాను. ఎలాగైనా అక్కడ నుంచి బయట పడి చదువుకోవాలన్న ఆశతో అమ్మకు కూడా చెప్పకుండా పారిపోయి విజయవాడ వచ్చేశా. ఇంటికి వెళ్తే మళ్లీ గొర్రెల యజమానికి అప్పగిస్తారని, ఇక చదువుకోలేనని భయంగా ఉంది. ఇక్కడ చైల్డ్‌లైన్‌లో బాగా చూసుకుంటున్నారు. బడిలో చేర్పించి చదివిస్తామంటున్నారు. నాక్కావల్సింది అదే. బాగా చదువుకుని ఆర్మీలో చేరతా. దేశ సేవ చేస్తా. – బండారు అజయ్ అజయ్‌ను బడికి పంపుతాం.. అజయ్ తల్లిని పిలిపించాం. ఆమె బిడ్డ తమ సంరక్షణలో ఉన్నాడని చెప్పాం. వీలైనప్పుడల్లా కొడుకును చూసి వెళ్తోంది. అజయ్ చదువుకోవడానికే తప్ప తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అజయ్ కోరిక మేరకు చదువు కొనసాగిస్తాం. భవానీపురంలో ఉన్న ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్ నడుపుతున్న స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. నిబంధనల ప్రకారం అజయ్ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాం. – అరవ రమేష్, జిల్లా కోఆర్డినేటర్, చైల్డ్‌లైన్, విజయవాడ -
లాక్డౌన్: 4.6 లక్షల ఫోన్‌కాల్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చిన్నపిల్లలకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ‘చైల్డ్ లైన్ 1098’కి 21 రోజుల లాక్డౌన్ కాలంలో 4.6 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయని చైల్డ్‌లైన్ ప్రకటించింది. ఇందులో అత్యధిక భాగం లాక్డౌన్ అమలులో ఉన్న మార్చి 20– ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చినట్లు తెలిపింది. వీటిలో ఉత్తరాది నుంచి 30 శాతం, పశ్చిమ భారతం నుంచి 29 శాతం, దక్షిణాది నుంచి 21 శాతం, తూర్పు భారతం నుంచి 20 శాతం కాల్స్ వచ్చాయని వెల్లడించింది. ఈ కాలంలో చైల్డ్ లైన్ 1098 వలంటీర్లు క్షేత్ర స్థాయిలో మొత్తం 9385 కేసులను పరిష్కారించారు. వచ్చిన మొత్తం కేసుల్లో 30 శాతం ఈ మహమ్మారిపై వివరణ కోరాయి. కరోనా వైరస్‌కి సంబంధించిన వాటిల్లో 91 శాతం మంది ఆహారం కావాలనీ, 6 శాతం మంది వైద్యసహాయం కావాలనీ, మిగిలిన వారు రవాణా సౌకర్యం కల్పించాలనీ కోరారని హెల్ప్‌లైన్ చెప్పింది. చాలా మంది పిల్లలకు మొబైల్ ఫోన్ సౌకర్యం లేని కారణంగా ఇటువంటి కాల్స్ చేసే అవకాశం వారికి రాలేదని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 అభిప్రాయపడింది. చదవండి: లాక్డౌన్ సడలిస్తే కష్టమే..! -
అయ్యయ్యో...!
అప్పుడే తెల్లారుతోంది.. తుప్పల్లోంచి పిల్లాడి ఏడుపు అటువైపుగా వెళ్లిన మహిళల చెవిన పడింది. కంగారుగా వెళ్లి చూశారు. తుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డను చూసి కలవరపడ్డారు. అయ్యయ్యో.. అంటూనే చేతుల్లోకి తీసుకుని రక్తపుచారలు తుడిచారు. సపర్యలు చేశారు. ఏ తల్లి కన్న బిడ్డో అంటూ నిట్టూర్చారు. చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించి శిశువును అప్పగించారు. శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు విశాఖ–అరకు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గౌరీపురం మహిళలు జామి గణేశమ్మ, మంగాయమ్మ, ఆడారి హారిక, మంగమ్మలు వేకువజామున 5 గంటల సమయంలో రోడ్డువైపుగా వెళ్లారు. సమీపంలోని తుప్పల్లోంచి పిల్లాడికి సపర్యలు చేస్తున్న గౌరీపురం మహిళలు పిల్లాడి ఏడుపును గమనించారు. వెంటనే వెళ్లి చూసేసరికి రక్తపు చారలతో కొద్ది గంటలకు ముందు జన్మించిన మగపిల్లాడిని గుర్తించి అక్కున చేర్చుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి బొడ్డు కోసి..స్నానాదులు చేయిం చారు. బట్టలు వేసి, బొట్టు పెట్టి.. పాలుపెట్టి సపర్యలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ బిడ్డను చూసేందుకు తరలివచ్చారు. ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త కాండ్రేగుల చంద్రకళ, ఇన్చార్జి ఏఎస్ఓ కె.వెంకటరాములు అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలక్ష్మి, సీడీపీఓ శాంతకుమారికి ఫోన్లో తెలియజేశారు. అనంతరం పీడీ రాబర్ట్స్ ఆదేశాల మేరకు 1098కు సమాచారం చేరవేశారు. దీంతో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కోన బంగారుబాబు, సభ్యులు వి.మధుసూదనరావు, సీహెచ్ చంద్రశేఖర్, జీవీఎల్ లక్ష్మిలు గౌరీపురం చేరుకున్నారు. పిల్లాడు దొరికిన తీరును తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం శిశువును విజయనగరం ఘోషాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం బిడ్డను జిల్లాలోని శుశుగృహకు అప్పగిస్తామని చైల్‌లైన్ కో ఆర్డినేటర్ తెలిపారు. శిశువు ఆరోగ్యంపై ఆరా శిశువు ఆరోగ్యంపై బీజేపీ జిల్లా నేత ఐ.రఘురాజు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఐ.రామరాజు (బుల్లిబాబు), కిల్తంపాలెం మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు తదితరులు చైల్డ్‌లైన్ సభ్యులతో మాట్లాడారు. అయితే, తుప్పల్లో దొరికిన మగ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలు వురు పిల్లలు లేని దంపతులు ముందుకు వచ్చినా చట్టప్రకారం అప్పగిస్తామని చైల్డ్‌లైన్ సభ్యులు స్పష్టం చేశారు. ఏ తల్లికన్న బిడ్డో ఇలా తుప్పలపాలయ్యాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఎవరీ బాలుడు
కర్నూలు: 13 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు ఇంటి నుంచి తప్పిపోయి బుధవారం రాత్రి గార్గేయపురం గ్రామంలో తాలూకా పోలీసులకు కనిపించాడు. బాలుడి సమాచారాన్ని పోలీసులు చైల్డ్ లైన్ సభ్యుడు కిరణ్‌కుమార్‌కు తెలియజేయగా వెంటనే బాలుడిని చైల్డ్‌లైన్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి సంరక్షణలో ఉన్నాడు. వివరాలు కోరగా బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనందున తల్లిదండ్రుల పేరు, చిరునామా చెప్పలేకపోతున్నాడు. బాలుడిని గుర్తించిన కుటుంబ సభ్యులెవరైనా తగిన ఆధారాలతో చైల్డ్ లైన్ 1098ను సంప్రదించాలని కిరణ్ కుమార్ కోరారు. బాలుడిని గుర్తించినవారు 80999 04487 లేదా 99517 94490కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కిరణ్‌కుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పరిగి ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్ పరిగి : బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత..హక్కులపై అవగాహన అవసరం..బాలలకు హక్కులున్నాయని గుర్తిస్తే తప్ప వాటిని పరిరక్షించటం సాధ్యం కాదని ఎంపీడీఓ విజయప్ప, చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేష్, ఎంఈఓ అంజిలయ్య, ఎస్ఐ నగేష్ , బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకుడు యాటగర్ల కృష్ణ అన్నారు. శనివారం పరిగిలోని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బాలలపై, ప్రధానంగా బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులకు సమాజం అండగా ఉండాలన్నారు. చైల్డ్‌లైన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఒంటరిగా తప్పిపోయిన బాలలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నావారు కనిపించినా చైల్డ్‌లైన్‌కు 1098 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయాలన్నారు. చైల్డ్‌లైన్ యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఇదే క్రమంలో బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ చెన్నకేశవరెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు విద్యార్థులు పాల్గొన్నారు. -
చైల్డ్‌లైన్ చెంతకు చేరిన ఐదేళ్ల బాలిక
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని దేవుడు చెరువులో శుక్రవారం ఒంటరిగా తిరుగుతున్న ఐదేళ్ళ బాలిక లక్ష్మి చైల్డ్‌లైన్ చెంతకు చేరింది. దేవుడు చెరువులో ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తున్న లక్ష్మిని స్థానికులు గమనించి ఆ పాప తల్లి, దండ్రులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. ఎంతకీ చెప్పలేక పోవటంతో స్థానికులు ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వన్‌టౌన్ పోలీసులు చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సాగర్ పాప వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే తనపేరు లక్ష్మి అని, తండ్రి బ్రహ్యయ్య, తల్లి మల్లేశ్వరి అని మాత్రమే చెబుతోంది. అంతకు మించిన వివరాలు ఏమీ చెప్పలేక పోతోందని బివి.సాగర్ వివరించారు. వెంటనే పాపను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఒంగోలులోని శిశుగృహలో చేర్పించారు. అప్పటి నుంచి పాప రోధిస్తూనే ఉంది. పాప ఆచూకి తెలిసిన వారు వెంటనే చైల్డ్‌లైన్-1098 నంబరుకు ఫోన్ చేసి వివరాలు అందించాలని పేర్కొన్నారు. -
మహిళను బంధించి బలవంతంగా వ్యభిచారం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఓ మహిళను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వ్యభిచారం చేసేందుకు ఎదురు తిరిగిన మహిళపై నిర్వాహకులు దాడి చేశారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి బంధించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో బాధిత మహిళకు విముక్తి లభించింది. మరోవైపు ఆ ఇంట్లో నుంచి భారీగా మద్యం, డ్రగ్స్, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు.