తుప్పల్లో దొరికిన శిశువు
అప్పుడే తెల్లారుతోంది.. తుప్పల్లోంచి పిల్లాడి ఏడుపు అటువైపుగా వెళ్లిన మహిళల చెవిన పడింది. కంగారుగా వెళ్లి చూశారు. తుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డను చూసి కలవరపడ్డారు. అయ్యయ్యో.. అంటూనే చేతుల్లోకి తీసుకుని రక్తపుచారలు తుడిచారు. సపర్యలు చేశారు. ఏ తల్లి కన్న బిడ్డో అంటూ నిట్టూర్చారు. చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించి శిశువును అప్పగించారు.
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు విశాఖ–అరకు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గౌరీపురం మహిళలు జామి గణేశమ్మ, మంగాయమ్మ, ఆడారి హారిక, మంగమ్మలు వేకువజామున 5 గంటల సమయంలో రోడ్డువైపుగా వెళ్లారు. సమీపంలోని తుప్పల్లోంచి పిల్లాడికి సపర్యలు చేస్తున్న గౌరీపురం మహిళలు పిల్లాడి ఏడుపును గమనించారు. వెంటనే వెళ్లి చూసేసరికి రక్తపు చారలతో కొద్ది గంటలకు ముందు జన్మించిన మగపిల్లాడిని గుర్తించి అక్కున చేర్చుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి బొడ్డు కోసి..స్నానాదులు చేయిం చారు. బట్టలు వేసి, బొట్టు పెట్టి.. పాలుపెట్టి సపర్యలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ బిడ్డను చూసేందుకు తరలివచ్చారు.
ఈ విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్త కాండ్రేగుల చంద్రకళ, ఇన్‌చార్జి ఏఎస్‌ఓ కె.వెంకటరాములు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీలక్ష్మి, సీడీపీఓ శాంతకుమారికి ఫోన్‌లో తెలియజేశారు. అనంతరం పీడీ రాబర్ట్స్ ఆదేశాల మేరకు 1098కు సమాచారం చేరవేశారు. దీంతో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కోన బంగారుబాబు, సభ్యులు వి.మధుసూదనరావు, సీహెచ్ చంద్రశేఖర్, జీవీఎల్ లక్ష్మిలు గౌరీపురం చేరుకున్నారు. పిల్లాడు దొరికిన తీరును తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం శిశువును విజయనగరం ఘోషాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం బిడ్డను జిల్లాలోని శుశుగృహకు అప్పగిస్తామని చైల్‌లైన్ కో ఆర్డినేటర్ తెలిపారు.
శిశువు ఆరోగ్యంపై ఆరా
శిశువు ఆరోగ్యంపై బీజేపీ జిల్లా నేత ఐ.రఘురాజు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఐ.రామరాజు (బుల్లిబాబు), కిల్తంపాలెం మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు తదితరులు చైల్డ్‌లైన్ సభ్యులతో మాట్లాడారు. అయితే, తుప్పల్లో దొరికిన మగ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలు వురు పిల్లలు లేని దంపతులు ముందుకు వచ్చినా చట్టప్రకారం అప్పగిస్తామని చైల్డ్‌లైన్ సభ్యులు స్పష్టం చేశారు. ఏ తల్లికన్న బిడ్డో ఇలా తుప్పలపాలయ్యాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment