మృతి చెందిన మధుసూదన్‌రెడ్డి
కడప: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరు ఎస్‌ఐ పెద్ద ఓబన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన రాజుల మధుసూదన్‌రెడ్డి (28) కడపలోని రైల్వే విద్యుత్ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండే వాడు.
ఆయన విధులు ముగించుకుని సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గంమధ్యలో తోల్లగంగనపల్లె బస్టాపు వద్ద గంగాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్మీనరసింహ, మధు పాఠశాలకు వెళ్లడానికి లిఫ్ట్ అడిగారు. దీంతో వారిని ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఏ ఓబాయపల్లెకు చెందిన నిరంజన్‌రెడ్డి వస్తున్న ద్విచక్ర వాహనం, మధుసూధన్‌రెడ్డి ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. వారి వెనుకే కడప వైపు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను ఢీకొంది.
దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్‌రెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆయనకు ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సి వుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment