Outsourcing employee
-
సచివాలయంలో ‘ఫేషియల్’ హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. సచివాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గురువారం నుంచి తమ అటెండెన్స్‌ను ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. సచివాలయ హాజరు విధానంలో కచ్చిత త్వం, సవర్థత, భద్రతను పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగి్నషన్ అటెండెన్స్ యంత్రాల ముందు కొన్ని క్షణాల పాటు ఉద్యోగులు నిలబడితే, వారి ముఖకవలికలను గుర్తించి హాజరును నమో దు చేస్తాయి. ఉద్యోగులు, అధికారులందరి వివరాలను ఇప్పటికే ఆ యంత్రాల్లో రికార్డు చేశారు. సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అటెండెన్స్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలొచ్చే అవకాశం ఉండడంతో శనివారం వరకు ఫిజికల్ అటెండెన్స్ విధానాన్ని సైతం కొనసాగించాలని సీఎస్ సూచించారు. త్వరలో జిల్లా, మండల కార్యాలయాల్లో సైతం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయా లని, సచివాలయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న కొత్తలో సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో అమల్లోకి తీసుకురాగా, త్వరలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సైతం ఫేషియల్ రికగి్నషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
మద్యం తాగుతూ..విధి నిర్వహణ
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఒకరు మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం మంగళవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా సదరు ఉద్యోగి మద్యం తాగి విధి నిర్వహణకు రావడం పట్ల అప్పటి జిల్లా అధికారి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అదేవిధంగా మళ్లీ ఆ ఉద్యోగి మద్యం తాగి విధుల్లోకి రావడం, తాజాగా కార్యాలయంలోనే మద్యం తాగడంపై జిల్లా ఉన్నతాధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ అధికారుల తీరుమాత్రం మారకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి ఎండీ గౌస్ పాషాను వివరణ కోరగా కార్యాలయంలో మద్యం సేవిస్తూ ఉద్యోగం చేయడం సరికాదన్నారు. విషయం తెలిసిన వెంటనే సదరు ఉద్యోగిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో ఔట్‌సోరి్సంగ్ ఏజెన్సీకి సరెండర్ చేశామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన రాజుల మధుసూదన్‌రెడ్డి (28) కడపలోని రైల్వే విద్యుత్ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండే వాడు. ఆయన విధులు ముగించుకుని సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గంమధ్యలో తోల్లగంగనపల్లె బస్టాపు వద్ద గంగాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్మీనరసింహ, మధు పాఠశాలకు వెళ్లడానికి లిఫ్ట్ అడిగారు. దీంతో వారిని ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఏ ఓబాయపల్లెకు చెందిన నిరంజన్‌రెడ్డి వస్తున్న ద్విచక్ర వాహనం, మధుసూధన్‌రెడ్డి ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. వారి వెనుకే కడప వైపు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్‌రెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆయనకు ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సి వుందని సమాచారం. -
15 నెలలుగా రాని వేతనాలు.. మేమెలా బతకాలి
సాక్షి,ములుగు: నిత్యావసర ధరలు పెరుగుతుండడంతో రోజువారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక నెల వేతనం రాకపోతేనే వేలకు వేలు ప్రభుత్వ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగులు సైతం ఉద్యమాలు చేసి వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వం వారికి తలవంచుతుంది. అలాంటిది అరకొర వేతనాలను అందుకుంటున్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్(పీఎంహెచ్)లో ఔట్ సోర్సింగ్ కాంటిజెంట్ సిబ్బందికి ఏకంగా 15 నెలలుగా వేతనాలు అందటం లేదు. నిరసనలు తెలి పితే ఫీల్ట్ అసిస్టెంట్ల మాదిరిగా ఎక్కడ తమని తొలగిస్తారోఅనే అభద్రతభావంలో ఉండిపోతున్నారు. 15ఏళ్లుగా చేస్తున్న వంట జిల్లాలోని ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలోని పీఎంహెచ్ హాస్టల్స్‌లో 20మంది కాంటిజెంట్ వర్కర్లు 15 సంవత్సరాల నుంచి వంటలు చేస్తున్నారు. ఏనాడు వారికి సక్రమంగా వేతనాలు అందిన పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. 2020వ సంవత్సరంలో మూడు నెలలు, 2021లో 10 నెలలు, 2022లో రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో కాంటిజెంట్ సిబ్బందికి నెలకు రూ. 10వేల వేతనం అందించడానికి ప్రభుత్వం తరఫున అధికారంగా అనుమతులు వచ్చాయి. కాని అవి కాగితాలకే పరిమితం అయ్యాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సిబ్బందికి రూ. 1.50లక్షల వేతనాలు అందాల్సి ఉంది. ఎమ్మెల్యేకు విన్నవించుకునేందుకు.. తమకు రావాల్సిన వేతనాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించుకునేందుకు కాంటిజెంట్ వర్కర్లు సిద్ధం అవుతున్నారు. వీలైతే సీతక్కతో కమిషనర్ కార్యాలయానికి వెళ్లడానికి కార్యచరణ చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్న సిబ్బంది వేతనాల చెల్లింపుల విషయంలో కొన్ని నెలలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని కాంటిజెంట్ సిబ్బంది వాపోతున్నా రు. అడిగిన ప్రతీసారి పైనుంచి నిధులు రాలేదని ఒకరు, వచ్చేంత వరకు వేచి చూడాలని మరొకరు చెబుతున్నారు.. తప్పా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారిని కలవడానికి వెళితే విద్యార్థులకు వంటలు చేయడం మాని వేతనాల కోసం వచ్చారా అని గద్దిరించారని తెలుస్తుంది. అదే అధికారికి 15 నెలల వేతనం రాకపోతే ఇలాగే స్పందిస్తారా అని సీఐటీ యూ, ఇతర సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నెలవారీగా వేతనాలు ఇవ్వాలి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్ వర్కర్లకు నెల వారీగా వేతనాలు అందించాలి. 15 నెలలుగా వేతనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు, కలెక్టర్‌ను కలిసి వినతులు అందించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో అధికారులు తక్షణం స్పందించి వేతనాలు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. – రత్నం రాజేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం పీఎంహెచ్ హాస్టల్స్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్ వర్కర్లకు వేతనాలు రావడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందజేస్తాం. వర్కర్లు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – దేశిరాం, ఐటీడబ్ల్యూఓ -
రెండేళ్ల క్రితం సాదాసీదాగా వచ్చి.. ఇప్పుడు ఆ శాఖలో పెత్తనమంతా అతనిదే..!
ఎవ్రిథింగ్ ఈజ్ పాజిబుల్.. ఏపీ పర్యాటక శాఖ ట్యాగ్‌లైన్. ఇక్కడ జరిగే వింతలు చూస్తే.. నిజంగా ఈ శాఖకు ఈ ట్యాగ్‌లైన్ కరెక్ట్ అనిపిస్తుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సీనియర్ మేనేజర్ హోదాని కట్టబెట్టేశారు. గైడ్‌గా మొదలైన సదరు ఉద్యోగి ప్రస్థానం.. జిల్లా టూరిజం మేనేజర్‌గానూ.. ఇప్పుడు ఐటీడీఏ టూరిజం ఎస్ఎం వరకూ చేరింది. ఆరోపణలు, వివాదాలతో నిత్యం సావాసం చేసే ఉద్యోగికి ఇలా ఏకంగా పెద్ద బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: సుందరి నగరి విశాఖ రాష్ట్రంలో ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా భాసిల్లుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ రూ.కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కీలకమైన జిల్లా పర్యాటక శాఖలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలన్నింటినీ ఓ గైడ్ చేతుల్లోనే కొనసాగుతున్నాయి. పైగా.. సదరు గైడ్ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. టూరిజం డిగ్రీ లేకపోయినా.. కేవలం గైడ్‌గా పనిచేయడం మొదలు పెట్టారు. గైడ్‌కి పోస్ట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నా.. అప్పటి అధికారుల అండదండలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిపోయాడు. ఇటీవలే అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరస్కరించడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. తాజాగా ఐటీడీఏ సీనియర్ మేనేజర్ కమ్ కోఆర్డినేటర్‌గా రెగ్యులర్ అధికారిగా కొనసాగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసేశారు. డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు కూడా వెహికల్ ప్రోవిజన్ లేదు. కానీ.. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మాత్రం వాహన సౌకర్యం కల్పించేశారు. అడ్మిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏపీటీఏ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సీఈవో మాత్రం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించడం విశేషం. దీనికి తోడు మూడు రోజులు జిల్లా టూరిజం కార్యాలయంలోనూ, మూడు రోజులు ఐటీడీఏ సీనియర్ మేనేజర్‌గా వ్యవహరించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా పర్యాటకశాఖ కార్యాలయంలోనూ అన్నీ తానై కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగికి జిల్లా టూరిజం ఆఫీసర్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపైనా పెద్ద వివాదమే చెలరేగింది. ఆది నుంచీ ఆరోపణలే.. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న అతన్ని ఇక్కడి అవసరాల నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఈ గైడ్.. క్రమంగా అసిస్టెంట్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గానూ, తర్వాత టూరిజం మేనేజర్‌గానూ కొనసాగుతున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న అతనిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ రాయలసీమ జోన్‌కు బదిలీ చేశారు. అయితే ఆ బదిలీని సైతం ఆపేసుకొని.. ఇక్కడే కొనసాగుతూ చక్రం తిప్పేశాడు. గతంలో తొట్లకొండ పర్యాటక క్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట ఓ నిర్మాణం చేపట్టాడు. దీనిపై అప్పటి కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదులు రావడంతో వెంటనే జేసీబీతో కూల్చివేయించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఐటీడీఏ సెల్ సీనియర్ మేనేజర్ కమ్ కోర్డినేటర్‌గా బాధ్యతలు కట్టబెట్టడం పర్యాటశాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ బాధ్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు. నిబంధనలను అనుసరించాల్సిన ఉన్నతాధికారులు సదరు గైడ్‌కు ‘దాసో’హం అవడం టూరిజం ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతుండటం కొసమెరుపు. చదవండి: వేల కిలోమిటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
అత్యాధునిక వైద్యం అందిస్తామని డబ్బు వసూళ్లు
కాకినాడ క్రైం: టీడీపీ హయాంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం పొందిన ఓ కార్యకర్త .. వైద్యులు, నర్సుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వైనం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన ఉండవల్లి వీర్రాజు నారా లోకేష్ సిఫారసుతో నక్షత్ర అవుట్సోర్సింగ్ కంపెనీ ద్వారా కాకినాడ జీజీహెచ్‌లో అవుట్సోర్సింగ్ విధానంలో డెస్క్ టాప్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 1వ తేదీన రాయుడు సూర్యకుమారి అనే 58 ఏళ్ల మహిళ కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరగా వారి సహాయకులను తన బుట్టలో వేసుకున్నాడు. వైద్యులు, నర్సులతో చెప్పి అత్యాధునిక వైద్యం అందేలా చేస్తానని చెప్పి.. ఫోన్‌పే ద్వారా బాధితురాలి కుమారుడి నుంచి రూ.75 వేలు వసూలు చేశాడు. ఆరోగ్యం విషమించి సూర్యకుమారి ఈ నెల 8న మృతి చెందింది. దీంతో మృతురాలి కుమారుడు బుధవారం సాయంత్రం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అసిస్టెంట్ కలెక్టరు ఆదేశించారు. కాగా, ఉద్యోగంలో చేరిన నాటినుంచి నారా లోకేష్, చంద్రబాబు, యనమల రామకృష్ణుడు పేర్లు చెప్పి వీర్రాజు దందా చేసేవాడని అక్కడి వారు చెబుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తానని తమ వద్ద కూడా రూ.1.5 లక్షలు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. ఇలా చాలామంది బాధితులున్నట్లు విచారణలో తేలిందని కాకినాడ ఒకటో పట్ణణ సీఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే.. 94407 96539కు ఫోన్ చేయవచ్చునని ఆయన చెప్పారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం భరోసా ఇచ్చారు
-
రూ.లక్ష లంచం తీసుకుంటూ..
లక్ష్మీపురం (గుంటూరు): వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్ బుధవారం గుంటూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్ కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు సిబ్బందితో పట్టుకున్నారు. అదనపు ఎస్పీ సురేష్‌బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్) సరఫరా చేస్తుంటారు. అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరై మూడు నెలలు అవుతున్నా అనేక కొర్రీలు పెడుతూ అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ వేధిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్‌కు కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును బాపట్ల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు అందజేయాలని సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ వచ్చి రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో డాక్టర్ ప్రసన్నకుమార్‌తోపాటు గోపీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అప్పన్న టిక్కెట్ కౌంటర్లోరూ.56వేలు మాయం
సింహాచలం(పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని టిక్కెట్ కౌంటర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. నాలుగు రోజుల కిందట ఆ వ్యక్తి రూ.56వేలు తస్కరించాడు. ఇంత జరిగినా దేవస్థానం అధికారులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే... దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో ఒక ఇంజినీర్కి అసిస్టెంట్‌గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కేంద్రాలు, కార్యాలయంలోని కంప్యూటర్లు ఏమైనా మొరాయిస్తే సరిచేయడం ఆ ఉద్యోగి విధుల్లో భాగం. అలా అతను సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లకు తరచూ వెళ్తుంటాడు. కౌంటర్లలో కూర్చుంటూ టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నాడు. నాలుగు రోజుల కిందట సింహగిరిపై ఆంధ్రాబ్యాంకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది జారీ చేసే 100 రూపాయల టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లో అప్పటి వరకు పనిచేసే ఉద్యోగి ఆలయంలోకి వెళ్లడంతో కొంతసేపు కూర్చుని టిక్కెట్లు జారీ చేశాడు. తొలి షిప్టు అవ్వగానే రెండో షిప్టులో కౌంటర్లో పనిచేయడానికి వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నగదు లెక్క చూసుకోగా సుమారు రూ.56వేలు తేడా వచ్చింది. దీంతో విషయం బయటపడింది. ఈ విషయంపై సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారించగా ఆ తర్వాత రూ.52వేలు తిరిగి కట్టేశాడు. బ్యాంకు అధికారులు, దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లినా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ విషయం బయటపడటంతో తీవ్ర చర్చాంశనీయమైంది. ఆంధ్రాబ్యాంకు కౌంటర్లో జరిగిన సంఘటన తమకు సంబంధం ఉండదని, బ్యాంకు అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని ఆలయ ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ వివరణ ఇచ్చారు. బ్యాంకు అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో కూడా సదరు వ్యక్తి దేవస్థానం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లోనే రూ.25వేలు వాడుకున్నట్టు కూడా గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సదరు వ్యక్తిని విధులకు హాజరు కావొద్దని దేవస్థానం ఈవో బుధవారం చెప్పినట్టు తెలుస్తోంది. అంతా అవుట్సోర్సింగ్ మాయాజాలం అప్పన్న దేవస్థానంలో అంతా అవుట్సోర్సింగ్ మాయాజాలంగా మారింది. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ఆడిందే ఆటగా పేట్రేగిపోతున్నట్టు ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం కూడా వారిని చూసీ చూడనట్టు వదిలేస్తోంది. కీలకమైన నగదు లావాదేవీలు జరిగే కౌంటర్లలో వారిని నియమిస్తుండటం కూడా అవకతవకలకు ఆస్కారమిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో వచ్చిన వారే కావడంతోనే దేవస్థానం అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు దేవస్థానంలో పనిచేసే పలువురు ఉద్యోగుల మద్దతు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉండటంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు వెల్లడవుతోంది. ఇటీవల ప్రసాద విక్రయశాలలో చోటుచేసున్న లడ్డూల అవినీతి వెలుగుచూసి వారం రోజులు గడవకముందే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి బయటపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
రక్తంలోనూ కల్తీ!
రక్తంలో ‘సెలైన్’ కలుపుతూ నకిలీ ప్యాకెట్ల తయారీ హైదరాబాద్: నిత్యావసరాలే కాదు నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూ ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్నీ కల్తీ చేస్తున్నారు.. పాలలో నీళ్లు కలిపినట్లుగా బ్లడ్ బ్యాంకుల నుంచి సేకరించిన రక్తంలో సగం గ్లూకోజ్ (సెలైన్) కలుపుతున్నారు.. ఈ కల్తీ చేసి రక్తాన్ని వేరే ప్యాకెట్లలో నింపి రోగులకు అమ్ముకుంటున్నారు.. అంతా పక్కాగా కనిపించేందుకు ఆ రక్తం ప్యాకెట్లకు బ్లడ్‌బ్యాంకుల నకిలీ స్టిక్కర్లు అతికిస్తున్నారు.. నకిలీ రసీదులూ సృష్టిస్తున్నారు.. మొత్తంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం. ఏడాది నుంచి.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో సరూర్‌నగర్‌కు చెందిన నరేందర్ (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వమే ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందజేస్తుంది. రక్తం అందుబాటులో లేనప్పుడు రోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. బయట ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకున్న నరేందర్... దాతల నుంచి బ్లడ్‌బ్యాంకుకు వచ్చే రక్తంలో గ్లూకోజ్ (సెలైన్) కలిపి, నకిలీ రక్తం ప్యాకెట్లను తయారు చేస్తున్నాడు. ఇతరబ్లడ్ బ్యాంకుల పేరుతో నకిలీ స్టిక్కర్లు తయారు చేయించి వాటికి అతికిస్తున్నాడు. రోగుల అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు అమ్ముకుంటున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ వ్యవహారం సాగుతోంది. మరొకరికి బాధ్యతలు అప్పగించడంతో.. నరేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాడు. దీంతో అధికారులు ఆ స్థానంలో మరో ల్యాబ్ టెక్నీషియన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ రక్తనిధిలో నిల్వ చేసిన రక్తం తేడాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ వలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మారెడ్డి తన బృందంతో కలసి సరూర్‌నగర్‌లోని నరేందర్ ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో నరేందర్ పారిపోయాడు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారమివ్వగా... వారు గురువారం నరేందర్ ఇంటితో పాటు బ్లడ్‌బ్యాంక్‌లో తనిఖీ చేసి 29 నకిలీ రక్తం ప్యాకెట్లు, నకిలీ స్టిక్కర్లు, రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే సాధారణంగా రక్తం ప్యాకెట్లో 250 మిల్లీలీటర్ల రక్తం ఉండాలి, కానీ ఈ ప్యాకెట్లలో 150 మిల్లీలీటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కిస్తే.. గుండె ఫెయిలయ్యే అవకాశం ఉంటుందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిలోఫర్ ఆస్పత్రి ముందు దళారులు నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం ముందు రక్తం దళారులు తిష్టవేశారు. రోగుల బంధువులెవరైనా ఆస్పత్రి లోనుంచి చీటీ తీసుకుని బయటికి రావడమే ఆలస్యం వారిని చుట్టుముడతారు. ‘రక్తం కావాలా, బ్లడ్ బ్యాంకుకు తీసుకెళతాం..’ అని వెంటపడతారు. వారిని కమీషన్లు ఇచ్చే బ్లడ్ బ్యాంకులకు తీసుకెళతారు. అక్కడ రోగుల బంధువులకు నకిలీ రక్తం ప్యాకెట్లను ఇవ్వడం, అడ్డగోలుగా డబ్బు వసూలు చేయడం చేస్తుంటారు. ఈ ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం.. ‘‘రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ రక్తం అందిస్తున్న వారిపై, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఔట్సోర్సింగ్ ఉద్యోగి నరేందర్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం..’’ - రత్నకుమారి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
ఫోన్లో విన్నారు.. వల పన్నారు
తాడిపూడి ఎత్తిపోతల పథకం భూ సేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు స్వాధీనం అధికారుల ప్రశ్నలతో కంటతడి పెట్టిన అధికారి సమజ నల్లజర్ల రూరల్ :తాడిపూడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఫోన్లో చేసిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం నల్లజర్లలో తాడిపూడి ఎత్తిపోతల పథకం భూ సేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేష్ నుంచి రూ.4 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం.సమజను ప్రశ్నించారు. ఆమె చెబుతున్న సమాధానాలకు, రైతులు చేస్తున్న ఆరోపణలకు పొంతన లేకుండా ఉంది. కాలువ తవ్వకంలో భూములు కోల్పోయిన రైతులకు కనీస సమాచారం అందించక పోవడం, అవార్డు ఎంక్వైరీ జరిగినా తదుపరి కార్యక్రమాలకు నోటీసులు జారీ చేయకపోవడం, రైతులను తమ కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకోవడం భారీ స్ధాయిలో ముడుపులు దండుకోవడానికేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికంగా ధరలు నిర్ణయించేందుకు పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలను స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వద్ద ఏసీబీ అధికారులు ప్రస్తావించినపుడు బయట జరిగే లావాదేవీలతో తమకు సంబంధం లేదంటూ తోసిపుచ్చారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏమి చేయగలుగుతాడని రైతులు అన్ని లక్షల డబ్బు అతని చేతికి ఇచ్చాడని అధికారులు ఆమెను ప్రశ్నించారు. కార్యాలయ ఉద్యోగులైతే వాస్తవ విషయాలు బయటకు వెల్లడవుతాయన్న కారణంగా తమ లావాదేవీలు నిర్వహించడానికి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ కుదుర్చుకున్న ఒప్పందంలో ఆమె హస్తం ఉందంటూ అందుకు సంబంధించిన సంభాషణల ఫోన్ రికార్డింగ్‌ను ఏసీబీ అధికారులు ఆమెకు వినిపిం చారు. దీంతో కంగుతిన్న ఆమె కన్నీరు పెట్టారు. గడచిన రెండేళ్లలో గోపాలపురం, దేవరపల్లి, ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల రైతుల నుంచి భారీస్థాయిలో సొమ్ములు దండుకున్నట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు కార్యాలయంలో జరిగే నిత్యకార్యకలాపాలపై ఉద్యోగుల నుంచి విడివిడిగా స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఏసీబీ దాడులతోనైనా తమకు సత్వర న్యా యం జరుగుతుందా ?అన్న సందేహాలు రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. నిడదవోలులోనూ తనిఖీలు నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్‌లో సూర్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెం. 102లో నివాసముంటున్న నలజర్ల మండలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం యూనిట్ నెం. 2, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం.సమజ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. తాళ్ళపూడి మండలం అన్నదేవర పేటకు చెందిన రైతు కరుటూరి సూర్యప్రకాశరావు తన పొలం 3.10 ఎకరాలను ఎత్తిపోతల పథకానికి భూసేకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి రూ.73 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వవలసి ఉంది. దీనికి సంబంధించిన బిల్లు మంజూరు కోసం రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు రైతు సూర్యప్రకాశరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అధికారి సమజ వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గండి సురేష్‌కు రైతు డబ్బు ఇస్తుండగా అధికారులు రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు నిడదవోలులో నివాసముంటున్న సమజ అపార్ట్‌మెంట్‌కు సాయంత్రం 4.45కు చేరుకుని గదిలో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. సమజ గదిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో డీఎస్పీ కరణం రాజేంద్రబాబు, సీఐ యూజేవిల్సన్ బాబు పాల్గొన్నారు. -
పోలీసు స్టేషన్ ఎదుట ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
తిరుపతి: తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్ ఎదుట అటవీశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సుధాకర్ అర్థరాత్రి కలకలం సృష్టించాడు. అకారణంగా తనపై ఎస్సీఎస్టీ కేసు పెట్టారంటూ ఫారెస్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధాకర్ అతడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులు సైతం న్యాయం చేయలేదంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. దాంతో అతడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ పరిస్థితి విషమంగా ఉందని... మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సుధాకర్ భార్యకు సూచించారు. దాంతో సుధాకర్ స్వస్థలం ఏలూరు తీసుకువెళ్లాలని అతడి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.దాంతో సుధాకర్‌ను ఏలూరు తీసుకువెళ్తున్నారు. అయితే అలిపిరి పోలీసుల వేధింపుల వల్లే తన భర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సుధాకర్ బార్య హైమావతి ఆరోపించారు.