సింహాచలం(పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని టిక్కెట్ కౌంటర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. నాలుగు రోజుల కిందట ఆ వ్యక్తి రూ.56వేలు తస్కరించాడు. ఇంత జరిగినా దేవస్థానం అధికారులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే... దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో ఒక ఇంజినీర్‌కి అసిస్టెంట్‌గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు.
సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కేంద్రాలు, కార్యాలయంలోని కంప్యూటర్లు ఏమైనా మొరాయిస్తే సరిచేయడం ఆ ఉద్యోగి విధుల్లో భాగం. అలా అతను సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లకు తరచూ వెళ్తుంటాడు. కౌంటర్లలో కూర్చుంటూ టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నాడు.
నాలుగు రోజుల కిందట సింహగిరిపై ఆంధ్రాబ్యాంకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది జారీ చేసే 100 రూపాయల టిక్కెట్లు జారీ చేసే కౌంటర్‌లో అప్పటి వరకు పనిచేసే ఉద్యోగి ఆలయంలోకి వెళ్లడంతో కొంతసేపు కూర్చుని టిక్కెట్లు జారీ చేశాడు.
తొలి షిప్టు అవ్వగానే రెండో షిప్టులో కౌంటర్‌లో పనిచేయడానికి వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నగదు లెక్క చూసుకోగా సుమారు రూ.56వేలు తేడా వచ్చింది. దీంతో విషయం బయటపడింది. ఈ విషయంపై సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారించగా ఆ తర్వాత రూ.52వేలు తిరిగి కట్టేశాడు.
బ్యాంకు అధికారులు, దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లినా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ విషయం బయటపడటంతో తీవ్ర చర్చాంశనీయమైంది. ఆంధ్రాబ్యాంకు కౌంటర్‌లో జరిగిన సంఘటన తమకు సంబంధం ఉండదని, బ్యాంకు అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని ఆలయ ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ వివరణ ఇచ్చారు.
బ్యాంకు అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో కూడా సదరు వ్యక్తి దేవస్థానం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లోనే రూ.25వేలు వాడుకున్నట్టు కూడా గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సదరు వ్యక్తిని విధులకు హాజరు కావొద్దని దేవస్థానం ఈవో బుధవారం చెప్పినట్టు తెలుస్తోంది.
అంతా అవుట్‌సోర్సింగ్ మాయాజాలం
అప్పన్న దేవస్థానంలో అంతా అవుట్‌సోర్సింగ్ మాయాజాలంగా మారింది. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ఆడిందే ఆటగా పేట్రేగిపోతున్నట్టు ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం కూడా వారిని చూసీ చూడనట్టు వదిలేస్తోంది. కీలకమైన నగదు లావాదేవీలు జరిగే కౌంటర్లలో వారిని నియమిస్తుండటం కూడా అవకతవకలకు ఆస్కారమిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో వచ్చిన వారే కావడంతోనే దేవస్థానం అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనికి తోడు దేవస్థానంలో పనిచేసే పలువురు ఉద్యోగుల మద్దతు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉండటంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు వెల్లడవుతోంది. ఇటీవల ప్రసాద విక్రయశాలలో చోటుచేసున్న లడ్డూల అవినీతి వెలుగుచూసి వారం రోజులు గడవకముందే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి బయటపడడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment