తాడిపూడి ఎత్తిపోతల పథకం భూ సేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి రూ.4 లక్షలు స్వాధీనం
అధికారుల ప్రశ్నలతో కంటతడి పెట్టిన అధికారి సమజ
నల్లజర్ల రూరల్ :తాడిపూడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు ఫోన్‌లో చేసిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం నల్లజర్లలో తాడిపూడి ఎత్తిపోతల పథకం భూ సేకరణ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేష్ నుంచి రూ.4 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం.సమజను ప్రశ్నించారు.
ఆమె చెబుతున్న సమాధానాలకు, రైతులు చేస్తున్న ఆరోపణలకు పొంతన లేకుండా ఉంది. కాలువ తవ్వకంలో భూములు కోల్పోయిన రైతులకు కనీస సమాచారం అందించక పోవడం, అవార్డు ఎంక్వైరీ జరిగినా తదుపరి కార్యక్రమాలకు నోటీసులు జారీ చేయకపోవడం, రైతులను తమ కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకోవడం భారీ స్ధాయిలో ముడుపులు దండుకోవడానికేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికంగా ధరలు నిర్ణయించేందుకు పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ విషయాలను స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ వద్ద ఏసీబీ అధికారులు ప్రస్తావించినపుడు బయట జరిగే లావాదేవీలతో తమకు సంబంధం లేదంటూ తోసిపుచ్చారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏమి చేయగలుగుతాడని రైతులు అన్ని లక్షల డబ్బు అతని చేతికి ఇచ్చాడని అధికారులు ఆమెను ప్రశ్నించారు. కార్యాలయ ఉద్యోగులైతే వాస్తవ విషయాలు బయటకు వెల్లడవుతాయన్న కారణంగా తమ లావాదేవీలు నిర్వహించడానికి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు.
రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ కుదుర్చుకున్న ఒప్పందంలో ఆమె హస్తం ఉందంటూ అందుకు సంబంధించిన సంభాషణల ఫోన్ రికార్డింగ్‌ను ఏసీబీ అధికారులు ఆమెకు వినిపిం చారు. దీంతో కంగుతిన్న ఆమె కన్నీరు పెట్టారు. గడచిన రెండేళ్లలో గోపాలపురం, దేవరపల్లి, ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల రైతుల నుంచి భారీస్థాయిలో సొమ్ములు దండుకున్నట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు కార్యాలయంలో జరిగే నిత్యకార్యకలాపాలపై ఉద్యోగుల నుంచి విడివిడిగా స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. ఏసీబీ దాడులతోనైనా తమకు సత్వర న్యా యం జరుగుతుందా ?అన్న సందేహాలు రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
నిడదవోలులోనూ తనిఖీలు
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్‌లో సూర్య అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నెం. 102లో నివాసముంటున్న నలజర్ల మండలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం యూనిట్ నెం. 2, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం.సమజ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు.
తాళ్ళపూడి మండలం అన్నదేవర పేటకు చెందిన రైతు కరుటూరి సూర్యప్రకాశరావు తన పొలం 3.10 ఎకరాలను ఎత్తిపోతల పథకానికి భూసేకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి రూ.73 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వవలసి ఉంది. దీనికి సంబంధించిన బిల్లు మంజూరు కోసం రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు రైతు సూర్యప్రకాశరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అధికారి సమజ వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గండి సురేష్‌కు రైతు డబ్బు ఇస్తుండగా అధికారులు రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు నిడదవోలులో నివాసముంటున్న సమజ అపార్ట్‌మెంట్‌కు సాయంత్రం 4.45కు చేరుకుని గదిలో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. సమజ గదిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో డీఎస్పీ కరణం రాజేంద్రబాబు, సీఐ యూజేవిల్సన్ బాబు పాల్గొన్నారు.
ఫోన్‌లో విన్నారు.. వల పన్నారు
Published Sun, Jan 24 2016 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement