ర్యాలీ సకాలంలో ప్రారంభించకపోవడంతో నిలువు కాళ్లపై నీరసంగా నిల్చొన్న బాలికలు
ఒంగోలు టౌన్: రాజ్యాంగపరంగా బాలికలకు కల్పించిన హక్కులు, సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బాలికా సంరక్షణతో పాటు సాధికారత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజని మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడటంతో పాటు బాలిక విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. బాలికలు బాల్యం నుంచే పలు ఆంక్షలకు గురవుతున్నారన్నారు.
నేటి సమాజంలో బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, అత్యాచారాలు వంటివి అక్కడకక్కడా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సతీసహగమనం, కన్యా శుల్కం వంటి దురాచారాలను రూపుమాపినా ప్రస్తుతం బాలికలు ఎదుర్కొంటున్న ఇతర దురాచారాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. బాలికల చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీడీ జి. విశాలాక్షి, ఆంధ్రప్రదేశ్ ప్రొచైల్డ్ గ్రూపు ప్రతినిధి బీవీ సాగర్, చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.
గంటకుపైగా నిలువు కాళ్లపై నిరీక్షణ
జాతీయ బాలికా దినోత్సవం రోజు బాలికలు గంటకుపైగా నిలువు కాళ్లపై నిలబడాల్సి వచ్చింది. బాలికా దినోత్సవ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ప్రకటించడంతో అంతకంటే ముందుగానే పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలతో పాటు బాలురను కూడా కలెక్టరేట్‌కు తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు ర్యాలీ ప్రారంభిస్తారని మహిళా శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో పాటు బాల బాలికలు ఎదురు చూశారు. నిమిషాలు, గంటలు అవుతున్నా ఉన్నతాధికారుల జాడ మాత్రం కనిపించలేదు. 11.15 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు హడావుడిగా వచ్చి ర్యాలీకి సంబంధించిన జెండా ఊపి వెళ్లారు. అప్పటివరకు నిలువు కాళ్లపై నిరీక్షించిన బాల బాలికలు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్థానిక రామనగర్‌లోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ర్యాలీలు జరిగే ప్రతిసారీ బాల బాలికలకు పరీక్ష పెట్టడం జిల్లా యంత్రాంగానికి పరిపాటైంది.
Comments
Please login to add a commentAdd a comment