అవర్‌ ఆనర్‌ | Asifa rape and killing: The girl her family and the accused | Sakshi
Sakshi News home page

అవర్‌ ఆనర్‌

Published Tue, Apr 17 2018 12:07 AM | Last Updated on Tue, Apr 17 2018 8:10 AM

Asifa rape and killing: The girl  her family and the accused - Sakshi

న్యాయదేవాలయంలో జడ్జిగారిని యువరానర్‌ అని సంబోధిస్తారు.ఆ దేవాలయంలోనే సమాజానికి న్యాయం దొరుకుతుందన్న నమ్మకం మనందరిదీ!!ఆ దేవాలయంలోనే మన గౌరవంకాపాడుతారన్నది కూడా మన నమ్మకం!!మన గౌరవం (ఆనర్‌) కోసం పోరాడటంమన బాధ్యత అయితే ఇతరుల గౌరవాన్ని తన గౌరవంగా పోరాడ్డం ఒక ప్రార్థనలాంటిది!!అసీఫా ఆత్మగౌరవాన్ని అవర్‌ ఆనర్‌గా... భావించారు లాయర్‌ దీపికా సింగ్‌ రజావత్‌.

చిన్నారి అసీఫాను చంపేశారు. ఇప్పుడు ఆమె కేసును వాదిస్తున్న న్యాయవాది దీపికాసింగ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీపికకు అష్టమి అనే ఐదేళ్ల కూతురు ఉంది. ‘‘అసీఫా కూడా అష్టమి లాంటిదే. అందుకే ఈ కేసును టేకప్‌ చేశాను’’ అంటున్నారు లాయర్‌ దీపిక. 

జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల అసీఫా అనే చిన్నారిని గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపివేస్తోంది. ఈ దారుణం మీద మొట్ట మొదట రిట్‌ పిటీషన్‌ వేసిన లాయర్‌ దీపికా సింగ్‌ రజావత్‌. లాయరే కాక ‘వాయిస్‌ ఫర్‌ రైట్స్‌’ అనే సంçస్థను ఆమె నిర్వహిస్తున్నారు.  చిన్నపిల్లల హక్కుల కోసం పనిచేసే ‘చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ’ (క్రై)కి కూడా సేవలందిస్తారు రజావత్‌.  చిన్నారి అసీఫా పై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలసి దీపిక కేస్‌ ఫైల్‌ చేశారు. అసీఫా వాళ్లది నిరుపేద కుటుంబం. వాళ్లకు న్యాయం దక్కలేదు. లంచం తీసుకున్న పోలీసులు సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. ఆ కుటుంబాన్ని భయపెట్టారు. నోరుమూయించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుసుకున్న దీపికా ఆ చిన్నారి  తరపు వాళ్లకు న్యాయం అందించాలనుకుంది. అందుకు ఆమెకు ఎదురైందేంటో తెలుసా? ఈ కేస్‌ తీసుకున్న వెంటనే ఆమె బార్‌ మెంబర్‌షిప్‌ రద్దయింది! ఎక్కడెక్కడినుంచో, ఎవరెవరి దగ్గర్నుంచో బెదిరింపులు వచ్చాయి. అయినా భయపడలేదు ఆమె. హంతకులకు శిక్ష పడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేదిలేదని పోరాడుతోంది.

బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్‌
‘‘హ్యుమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌గా నాకీ ధమ్కీలు (బెదిరింపులు), బ్లాక్‌మెయిల్స్‌ కొత్తేం కాదు. ఎనిమిదేళ్ల బాలిక కనిపించడం లేదని పోలీస్‌ రిపోర్ట్‌ ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు స్థానిక పోలీసులు. ఈ కేస్‌ తీసుకోవడానికి నాకు ఇంతకన్నా ఇంకో కారణం అవసరం లేదనిపించింది. ఈ కేసు పనిలో భాగంగా నేను జమ్మూకశ్మీర్‌ కోర్టుకు వెళితే ‘నువ్వు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు’ అంటూ జమ్మూ బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బీఎస్‌ సలాథియా బెదిరించారు. ‘మీరు నన్ను శాసించడానికి నేను ఇక్కడి బార్‌ అసోసియేషన్‌ మెంబర్‌ను కాను’ అని చెప్పాను. ‘నిన్నెలా ఆపాలో మాకు తెలుసు’ అన్నాడు. నేను వెంటనే జమ్మూకశ్మీర్‌ హైకోర్ట్‌ చీఫ్‌ జస్టి్టస్‌కు ఓ కంప్లయింట్‌ ఇచ్చాను.. నాకు ఇక్కడ భద్రత లేదు రక్షణ కల్పించమని. అంతేకాదు నేను కోర్టుకు హాజరైనప్పుడల్లా నాకు రక్షణ ఏర్పాట్లు కల్పించమనీ కోరాను’’ అని చెప్పారు దీపిక ఈ పోరాటం గురించి మాట్లాడుతూ. 
అయితే అసీఫా కేసుతో ఆమె ఆగిపోవాలని అనుకోవడం లేదు. నిర్భయ చట్టాన్ని మించిన మరో అత్యాచార నిరోధక చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బాల ఖైదీల కోసమూ పనిచేస్తు న్నారు. దీపిక ఉద్యమిస్తోన్న మరో తాజా సమస్య ఫ్రూట్‌ మాఫియా. కృత్రిమ రసాయనాలతో పళ్లను పక్వానికి తెస్తున్న వ్యాపారుల మీద కేసులతో దండెత్తుతున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలనీ డిమాండ్‌ చేస్తున్నారు. 

అంతులేని న్యాయ పోరాటం
కొన్నేళ్ల కిందట పన్నెండేళ్ల ఓ అమ్మాయి ఒక లాయర్‌ ఇంట్లో అనుమానాస్పద పరిసితుల్లో మరణించింది. ఆ లాయర్‌ ఆ అమ్మాయిది ఆత్మహత్య అని చెప్పాడు. కాని ఆ పిల్ల తల్లిదండ్రులు అది హత్యని, తమ తరపున వాదించమనీ దీపికను కోరారు. ఆ కేసు తీసుకున్నప్పుడు కూడా లాయర్లందరూ దీపికను బెదిరించారు. బార్‌ సభ్యత్వం రద్దు చేసే దాకా వెళ్లారు.
సాధారణంగా దీపిక ‘చైల్డ్‌ అండ్‌ విమెన్‌ ట్రాఫికింగ్‌’కు సంబంధించిన కేసులను తీసుకుంటుంటారు. నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలలో ఉంటున్న పిల్లలంతా గనుల్లో పనులకు వెళ్తారు. దాంతో అక్కడ ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారుతున్నారు. దీన్ని అరికట్టడానికి, వాళ్ల తరపున న్యాయం కోసం దీపికా సింగ్‌ రజావత్‌ పోరాడుతున్నారు. 2012లో ఓ పిల్‌ కూడా దాఖలు చేశారు. దాంతో గనిలో ప్రమాదాలకు గురైన వాళ్ల మీద కోర్టు ఓ సర్వే జరిపించి మనిషికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించింది. ఇది దీపిక సాధించిన మరో విజయం.

ఎవరీ దీపికా సింగ్‌?
దీపికా సింగ్‌ రజావత్‌ స్వస్థలం కశ్మీర్‌లోని కరిహామా. కాని 1986లో వాళ్ల కుటుంబం జమ్మూలో స్థిరపడింది. ఆమె భర్త ఆర్మీ చీఫ్‌గా రిటైరై ప్రస్తుతం బహెరెన్‌లో ఉంటున్నాడు. ‘‘ఎన్ని అడ్డంకులెదురైనా న్యాయాన్ని సాధించే వరకు వెనక్కి తిరిగేదే లేదు’’ అని స్పష్టం చేస్తోంది దీపికా సింగ్‌ రజావత్‌.ఈ యేడాది మొదట్లో కూడా ఒక జడ్జికి సంబంధించిన కేసులో దీపిక ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొన్నారు. ఆ జడ్జి తనింట్లో పనిచేసే అమ్మాయిని రేప్‌ చేశాడు. ఆ పనమ్మాయి తరపున కేస్‌ వాదించింది దీపిక. ఇప్పుడా జడ్జి జైల్లో ఉన్నాడు.  
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement