అక్షరాస్యత పెంపునకు కృషి చేయూలి
► కలెక్టర్ ఎం.జగన్మోహన్
► జిల్లా అధికారులతో సమావేశం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ప్రస్తుతమున్న 61.01 అక్షరాస్యతా శాతాన్ని వందశాతానికి పెంచి, అధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జూన్ 6న మంచిర్యాలకు రానున్న సందర్భంగా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలో విద్యను పటిష్టం చేయడానికి అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ముందుగానే సిద్ధం చేసుకొని రావాలని డీఈవో, ఆర్వీఎం పీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీవో కేశవ్‌రావ్, ఆర్వీఎం పీవో రాజేశ్వర్, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, నాబార్డ్ ఏజీఎం పురోహిత్, గిరిజన శాఖ డీడీ రాంమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాగునీటిపై ఫిర్యాదులు రాకుండా చూడాలి
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదులు రాకుండా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకున్నారు. ఎక్కడైనా ఇబ్బందులున్నాయా అని వివరాలు అడిగారు. జిల్లా వ్యాప్తంగా 498 ఆవాస ప్రాంతాలకు రవాణా ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, రవాణా సౌకర్యం లేని గ్రామాలకు ఎడ్లబండ్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
సమస్యలున్నట్లైతే తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎడ్లబండ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న వారికి డబ్బులు చెల్లింపులు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల ప్రగతిపై వాటర్ గ్రిడ్ ఎస్‌ఈ ఎన్. ప్రసాద్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 30లోగా 169 గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని, మిగితా గ్రామాలకు ఆగష్టు 30లోగా అందించాలన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్, ఈఈ మూర్తి, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, ఐలయ్య, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.