ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘దేశవ్యాప్తంగా 74 శాతం మంది అక్షరాస్యులున్నారు. రాష్ట్ర స్థాయిలో చూస్తే 67 శాతం ఉన్నారు. ప్రకాశం జిల్లా పరంగా చూస్తే కేవలం 63 శాతం మాత్రమే. దేశవ్యాప్త అక్షరాస్యత శాతంతో పోల్చుకుంటే 11 శాతం తక్కువగా ఉన్నాం. అక్షరాస్యతను సాధించడంలో చాలా వెనుకబడిపోయాం. 100 రోజుల్లో 10 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని చాలెంజ్‌గా అక్షరోద్యమం తీసుకున్నాం. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించాం. డిసెంబర్ 1వ తేదీన ఇన్‌చార్జి మంత్రి శైలజానాథ్ చేతుల మీదుగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి మార్చి 15 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తున్నాం..’ అని కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు.
స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్షరోద్యమానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 11 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు. ఇప్పటి వరకూ వారిలో లక్ష మందిని అక్షరాస్యులుగా చేశాం. మిగిలిన 10 లక్షల మందిని 100 రోజుల్లో అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం 34 వేల అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 33 వేల మంది వలంటీర్లు, 15 వేల మంది ఉద్యోగులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో అక్షరాస్యత కేంద్రంలో 30 మందికి మించకుండా ఉంటారని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నిరక్షరాస్యులను కేంద్రాలకు తీసుకురావడం, వలంటీర్లను ఏర్పాటు చేయడం కష్టమైనా దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 20 నుంచి 25 తేదీల మధ్య భారత సాక్షరతా సమితి నిర్వహించనున్న పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 15 వేల మంది ఉద్యోగుల్లో 10 వేల మంది ఉపాధ్యాయులు, 5 వేల మంది జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్‌ఓలు, అంగన్‌వాడీలు ఉంటారన్నారు. ప్రతి 1000 మందికి ఒక సూపర్‌వైజర్, ప్రతి రెండు గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారి, మండల స్థాయిలో జిల్లా అధికారిని నియమిస్తామని చెప్పారు. అక్షరాస్యత కేంద్రాలను రోజూ తనిఖీ చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.
భారీ వర్షాలకు రూ 928 కోట్ల నష్టం
అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 928 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ 259 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ 669 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర చెప్పారు.
అక్షరోద్యమం
Published Sat, Nov 30 2013 5:31 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
Advertisement
Advertisement