ఒంగోలు టూటౌన్: సర్కారు నిర్వాకంతో పింఛన్లు కోల్పోయిన వేలాది మంది కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఒంగోలు తరలి వచ్చారు. జన్మభూమి అనంతరం కలెక్టరేట్‌లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో నిండిపోయింది. నడవలేని వారు..కర్ర ఊతంతోనో..కుటుంబ సభ్యుల సాయంతోనో మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చారు.
పింఛన్లు తీసేశారంటూ వచ్చిన వారిని పలకరించే నాథుడే లేకుండాపోయారు. ఉదయం 10.30కు గ్రీవెన్స్‌సెల్ ప్రారంభించగా 12 కాకుండానే వేరే కార్యక్రమాలున్నాయంటూ కలెక్టర్ విజయకుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన డీఆర్వో ఎన్‌ఆర్ ఖాసీం, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో అర్జీ ఎవరికి ఇవ్వాలో తెలియక..ఎక్కువ దూరం నడవలేక ఎక్కడివారు అక్కడే నిరాశగా కూలబడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎవరైనా పలకరిస్తే చాలు.. ఆగని కన్నీళ్లతో అన్యాయంగా పింఛన్ తీసేశారంటూ విలపించిన పండుటాకుల పరిస్థితి వేదనాభరితం.
పింఛన్లకు రాజకీయ రంగు:
చూసేవాళ్లు లేక, ఆదరించే వాళ్లు కరువైన వృద్ధులకు ఏదో కంటితుడుపుగా ఇచ్చే పెన్షన్‌కు రాజకీయరంగు పులిమారు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారని పగబట్టి పెన్షన్లు తొలగించారని పొన్నలూరు మండలం ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బాధితులు వాపోయారు. తన పేరు మీద ఒకటిన్నర ఎకరపొలం ఉందని పెన్షన్ తొలగించారని కోడూరి తిరుపతయ్య వాపోయాడు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారికి, 20 ఎకరాలు ఉన్న వాళ్లకి, అనర్హుల పేర్లను మళ్లీ ఇటివల జాబితా తయారు చేసి పంపారని.. అర్హులమైన తమ పేర్లు పంపలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధులకు చేయూత:
పెన్షన్ల కోసం అష్టకష్టాలు పడి ఒంగోలు గ్రీవెన్స్‌సెల్‌కి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలు చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు వారికి మధ్నాహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బాధితులు వచ్చారు. వీరందరికీ స్థానిక అంబేద్కర్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారు.
కనిగిరి నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా పెన్షన్ బాధితులు వచ్చారు. ఇలా అన్ని మండలాల నుంచి వేలాది మంది పండుటాకులు తరలిరావడం చూపరులను కలచివేసింది. కొందరు వృద్ధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇంత మంది వేదనకు కారణభూతమైన ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
విన్నపాలు వినేదెవరు?
Published Tue, Nov 18 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement