The elderly
-
పండుటాకుల పాట్లు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు పోస్టాఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు నిరీక్షించి నీరసించిపోతున్న వృద్ధులు, దివ్యాంగులు సూర్యాపేట :వయస్సు మీదపడిన పండుటాకులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘ఆసరా’ పింఛన్ పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. మూడు నెలలుగా జిల్లాలోని లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ‘ఆసరా’తోనే బతుకీడుస్తున్న వారు ప్రస్తుతం డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేçస్తూ నిరీక్షించి నీరసించి పడిపోతున్నారు. పలు చోట్ల వృద్ధులు అనారోగ్యానికి గురైన సంఘటనలుచోటు చేసుకుంటున్నాయి. ఒకరిద్దరికే ఇచ్చి.... ప్రభుత్వం పెన్షన్ డబ్బులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నా.. లబ్ధిదారులకు మాత్రం మూడు నెలలుగా అందడంలేదు. పోస్టాఫీస్ల్లో ఒకరిద్దరికి ఇచ్చి డబ్బులు లేవని అధికారులు ముఖం చాటేస్తున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 23 మండలాలు రెండు మున్సిపాలిటీలు, హుజూర్నగర్ నగర పంచాయతీ పరిధిలో 51,310 వృద్ధాప్య, 51,408 వితంతు, 19,813 వికలాంగులు, 6,500 గీతకార్మికులు, 823 చేనేత కార్మికుల పెన్షన్లు మొత్తం 1,29,854 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతులకు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు నెలకు రూ.1,500 అందచేస్తారు. ఇలా జిల్లాలోని పెన్షన్‌దారులకు నెలకు రూ.15.15కోట్ల బడ్జెట్‌ను (ఆక్టోబర్ నెలకు) ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు 19 మండలాల పరిధిలో కేవలం 50,716 మంది లబ్ధిదారులకుగాను రూ.5,89,60,000 మాత్రమే పంపిణీ చేశారు. అంటే మిగిలిన రూ.10 కోట్లు పంపిణీ చేయాల్సింది. అదేవిధంగా పలుప్రాంతాల్లో సెప్టెంబర్ నెల డబ్బులు కూడా అందజేయకపోవడం గమనార్హం. వీటితో పాటు, డిసెంబర్ నెల కూడా గడిచిపోయిందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల డబ్బులు బ్యాంకులకు వచ్చేదెప్పుడు, వచ్చిన డబ్బులు తమకు అందచేసేదెప్పుడని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొడెక్కిన వృద్ధులు... మూడు నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో తమ కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆందోళన బాటపట్టి రోడెక్కారు. పెన్‌పహాడ్ మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటి వరకు ఆక్టోబర్ నెల డబ్బులు కూడా రాలేదని పోస్టాఫీస్ అధికారులు చెప్పడంతో ఇటీవల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద కూడా నిరసన తెలిపారు. ఇక ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గురువారం పెన్షనర్లు రాస్తారోకో నిర్వహించారు. ఇలా ప్రతీ రోజు ఏదో ఒక చోట నిరసనలు తెలియడం పరిపాటిగా మారింది. పెద్దనోట్ల రద్దుతో... ఆసరా పింఛన్‌దారులకు పెద్దనోట్ల రద్దు దెబ్బ కూడా బాగానే తగిలింది. 50 రోజుల క్రితం కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసింది. అప్పటికే నెల రోజుల పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు నోట్ల రద్దు ప్రభావంతో మళ్లీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఎంచేయాలో అర్థం కాని పరిస్థితిల్లో పడిపోయారు. కొన్ని చోట్ల నవంబర్ పింఛన్ డబ్బులు పంపిణీ చేసినా రూ.2 వేల నోటుతో చిల్లర ఇక్కట్లు తప్పలేదు. -
గ్రాండ్ అండ్ గ్రేట్
తాత సంఘం ‘వృద్ధాప్యం శాపం కాదు. సహజం. నీరసాలు, నిందలు వదిలేద్దాం. ఉత్సాహంగా ఉందాం. పిల్లలకు మార్గదర్శకంగా నిలుద్దాం’ అనే ఆదర్శంతో ఆవిర్భవించింది ‘తాత సంఘం’. మహాత్ముని స్ఫూర్తితో.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో ఈ సంఘం ఏర్పాటైంది. గడ్డం రాజిరెడ్డి అనే పెద్దాయన గాంధీ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. గ్రేట్ అనిపించే ఈ ‘గ్రాండ్’పా ల సంఘం గురించి నాలుగు మాటలు. తాత 2011 సంఘం ఏర్పాటైంది. గ్రామంలో అరవై ఏళ్లు పైబడిన వారందరూ సంఘంలో సభ్యులే. ప్రారంభంలో 60 మంది వృద్ధులు సభ్యులుగా చేరారు. తరువాత ఆ సంఖ్య 109 మందికి చేరింది. వారిలో ఇంతవరకు 17 మంది మరణించారు. ఎవరికైనా పిల్లలతో సమస్య వచ్చినా, వారితో పిల్లలకు సమస్య వచ్చినా ఇక్కడ పరిష్కారాలు ఆలోచిస్తారు. వ్యవస్థాపక సభ్యులుగా గడ్డం రాజిరెడ్డి, బీఏ సాయన్న, పాగల భూమయ్య, మచ్చ సాయన్న... ఇలా కొందరు ఈ సంఘం ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. సంఘానికి గ్రామంలో ఒక ప్రతిష్టను, పెద్దరికాన్ని తెచ్చారు. సమస్య పరిష్కారం కావాలంటే వ్యక్తిగా ముందు మనం మారాలన్న మహాత్మాగాంధీ మార్గాన్ని ఆచరించాలన్న ఉద్దేశ్యంతో సంఘానికి గాంధీతాత సంఘంగా మొదట నామకరణం చేశారు. అయితే సాంకేతికంగా గాంధీ పేరుతో రిజిస్ట్రేషన్ నిరాకరించడంతో ‘తాత సంఘం’ పేరుతో సంఘాన్ని కొనసాగిస్తున్నారు. ఏ కుటుంబంలోనైనా వృద్ధులు అనాదరణకు గురైతే సంఘ సభ్యులు కొందరు వారి ఇంటికి వెళ్లి విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. సమస్య ఎక్కడ ఉందో వెతుకుతారు. ఒకవేళ సమస్య వృద్ధులతోనే అయితే వారు మారేలా కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లల దగ్గర తప్పుంటే వారిని మందలించి దారికి తెస్తారు. సంఘం పేరిట సభ్యులు ప్రతి నెలా జమ చేసే 10 రూపాయల మొత్తంతో ‘నిధి’ కూడా ఏర్పాటయింది. ఆ నిధితో సంఘ సభ్యులు ఓ షెడ్డు నిర్మించుకున్నారు. గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వీటన్నింటికీ రూ.లక్షా 20 వేల దాకా ఖర్చయ్యాయి. సంఘ సభ్యులు ప్రతిరోజూ సమావేశమవ్వాలన్నది నియమం. అక్కడ సాధకబాధకాలుంటే మాట్లాడుకుని సమస్యలేవైనా ఉంటే ఆదిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ తరం కొడుకులతో ఎలా మెలగాలి, కోడళ్లతో ఎలా ఉండాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ వివాదాల విషయంలో సంఘం తరఫున ఇచ్చే తీర్పులను గ్రామస్థులు కూడా గౌరవిస్తున్నారని తాతసంఘ సభ్యులు చెబుతున్నారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
పెన్షన్..టెన్షన్
ఆన్లైన్లో నెలవారీ పింఛన్లు జమ ఏటీఎంలో డ్రా చేసుకోవాల్సిందే డెబిట్..రూపే కార్డుల్లేని వారెందరో.. వృద్ధులు..వికలాంగుల పరిస్థితి దయనీయం పండుటాకులకు పింఛన్ ఆందోళన మొదలైంది. పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతుండడం పెన్షనర్లలో గుబులు రేపుతోంది. నగదు రూపంలో పెన్షన్లు చెల్లించకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వస్తే ఆనందించే పెన్షనర్లు.. ఇప్పుడు మాత్రం దిగాలు పడుతున్నారు. సాక్షి: జిల్లాలో 3,97,728 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం రూ.41.85 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్షనర్లతో వేలిముద్ర వేరుుంచుకొని ప్రతినెలా పింఛన్ పంపిణీ చేస్తోంది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ నెల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో రిజర్వ్‌బ్యాంకు విధించిన ఆంక్షలతో కోట్లాది రూపాయలు పంచే పరిస్థితి కనిపించడం లేదు. నగదు రూపంలో పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం వెనకడుగు వేసింది. నిస్సహాయులకు మానవతాద క్పథంతో నగదు రూపంలో పంపిణీకి సర్కారు ససేమిరా అనడంతో.. అధికారులు ప్రత్యామ్నాయంగా ఖాతాల్లోనే జమచేయాలని నిర్ణరుుంచారు. ఖాతాల్లోని నగదును రూపే కార్డులతో డ్రా చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 40 వేల మందికే రూపే... 3.97లక్షల మంది పింఛనుదారులు ఉండగా సుమారు 3,22,691 మందికి బ్యాంకు ఖాతాలున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలు సుమారు 80 శాతం ఉన్నా.. నగదు డ్రా చేసుకోడానికి రూపే కార్డులు మాత్రం కేవలం 43,316 మందికి మాత్రమే జారీ చేశారు. దీంతో లబ్ధిదారులకు పింఛన్ అకౌంట్లో జమ చేసినా ప్రయోజం అంతంత మాత్రమే. బ్యాంకు మిత్రలు జిల్లాలో తగినంత మంది లేకపోవడం కూడా పెన్షనర్లను బాధించే అంశమే. రూ.2 వేలు మాత్రమే ఉంది.. ఏటీఎంలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నారుు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో కొన్ని ఏటీఎంలు పని చేయడం లేదు. ఒక వేళ పని చేసినా రూ.2 వేల నోట్లు మాత్రమేవస్తున్నారుు. మరి రూ.1000, రూ.1500 పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారనే సందేహం పెన్షనర్లలో నెలకొంది. కొత్త రూ.500 నోట్లు వచ్చినా కొంత మేర పంపిణీ జరిగింది. అకౌంట్లలో జమ చేస్తాం.. పింఛన్లు అకౌంట్లలో జమ చేస్తాం. రూపే కార్డులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు మిత్రల ద్వారా పింఛన్ పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం. - రవిప్రకాశ్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ, చిత్తూరు. -
ఉసురు తీసిన పింఛన్
బ్యాంక్‌కు వెళ్లి వస్తూ అప్పలనర్సమ్మ మృతి చిట్టినగర్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం వృద్ధులు ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో పింఛన్లకోసం వెళ్లి వస్తూ జైనాబీ, పడాల కాంతమ్మ, పిళ్లా లక్ష్మి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు మరిచిపోకముందే 32వ డివిజన్ పరిధిలో బుధవారం మరో వృద్ధురాలి ప్రాణం పోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కొత్తపేట ఆంజ నేయవాగు బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన వెండిముద్దల అప్పలనర్సమ్మ (70)కు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛను అందుతోంది. వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాలోనే పింఛను డబ్బులు వేస్తామని అధికారులు చెప్పడంతో రెం డు రోజులుగా బ్యాంక్‌లో ఖాతా తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కొత్తపేట కేబీఎన్ కాలేజీ సమీపంలోని ఓ జాతీయ బ్యాంక్‌కు వెళ్లి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వాలని అడగ్గా మరో పది రోజుల వరకు ఖాళీ లేదని అధికారులు చెప్పారు. బంగారయ్య కొట్టు సమీపంలోని మరో జాతీయ బ్యాంక్‌కు వెళ్లగా దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలని కోరారు. ఖాతా తెరిచి బుధవారం పాస్ పుస్తకం తీసుకుని ఆనందంగా ఇంటికి వెళుతుండగా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణం వదిలింది. -
నీడలేక.. నిలువలేక..
పింఛన్ల కోసం వృద్ధులు... వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. గౌలిపురా మేకల మండీలోని ఓ కేంద్రంలో పింఛను కోసం వెళ్లిన వికలాంగ బాలిక సోమవారం ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. విజయనగర్ కాలనీకి చెందిన గంగాధర శాస్త్రి పింఛను రాలేదని తెలిపేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్యూలో వేచి ఉన్న ఆయన కొద్దిసేపటి తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కుత్బుల్లాపూర్, మెహదీపట్నం, చార్మినార్ : హైదరాబాద్ నగరంలో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, పోలీసులు బాధ్యతా రాహిత్యం కారణంగా పింఛన్ పంపిణీ కేంద్రాలు ముష్ట్టియుద్ధాలు చేసే గోదాలను తలపిస్తున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు లేక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం తాజాగా ఓ వృద్ధుడు పింఛన్ కోసం వచ్చి మృత్యువాత పడ్డాడు. నగరంలోని విజయనగర్‌కాలనీకి చెందిన గంగాధర్‌శాస్త్రి(75) గత మూడు నెలలుగా తీసుకుంటున్నాడు. ప్రతి నెల పోచమ్మ బస్తీలో పింఛన్ డబ్బులు తీసుకునే అతను ఈ నెల పింఛన్ కోసం సోమవారం పంపిణీ కేంద్రానికి వెళ్లగా పింఛన్ రాలేదని తెలిపారు. దీంతో అతను ఉన్నతాధికారులకు మొరపెట్టుకునేందుకు విజయనగర్‌కాలనీలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయతే అప్పటికే పింఛన్ కోసం వచ్చిన లబ్ధిదారులు బారులు తీరి ఉండడంతో కొద్దిసేపు క్యూలో నిలుచున్న గంగాధర్ అలసి పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆ వెంటనే పక్కకు ఒరిగి ప్రాణాలు వదిలాడు. జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్ కమ్యూనిటీ హాలులో ఒకే ఒక కౌంటర్ ఏర్పాటు చేయటంతో పింఛన్‌దారుల మధ్య తొక్కిసలాట జరగడంతో కుత్బుల్లాపూర్ చెందిన గుడ్డి సత్తమ్మ అనే మహిళ కాలు విరగగా, దత్తాత్రేయనగర్‌కు చెందిన చంద్రమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. పాతబస్తీలోని చార్మినార్, బండ్లగూడ, బహదూర్‌పురా తహసీల్ధార్ కార్యాలయాల్లోని పింఛన్ల పంపిణి కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో పలువురు వృద్ధులు , వికలాంగులు గాయపడ్డారు. నగరంలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఎందుకిలా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ పింఛన్ల పంపిణీకి అధికారులు సరైన వసతులు చేపట్టకపోవడంతో లబ్థిదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరతా కారణంగా కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికితోడు ఈ నెల 10వ తేదీ నుంచే పింఛన్లు పంపిణి చేపట్టాల్సి ఉన్నా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 13 వ తేదీ నుంచి పంపిణీ చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 14.67 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 104 కేంద్రాలు ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిపై పర్యవేక్షణ చేపట్టక పోవడంతో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. దరఖాస్తులప్పడూ అంతే... పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలోనూ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసీఫ్ నగర్లో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ఒక వృద్ధుడు చనిపోగా, సైదాబాద్ మండలంలో మరొకరు క్యూలోనే ప్రాణాలు వదిలారు. రోడ్డు దాటుతుండగా మరొకరు దుర్మరణం పాలయ్యాయి. ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని అధికారులు పంపిణీ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోవడం లేదు... పింఛన్ కోసం పంపిణీ కేంద్రానికి వస్తే..ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదు. రోజూ వస్తున్నా పట్టించుకోవడం లేదు. వచ్చిన వారికందరికీ పంపిణీ ఇచ్చేలా చూడాలి. - ఎస్. విశ్వేశ్వరచారి, కందికల్‌గేట్. మంచినీళ్లు కూడా లేవు పంపిణీ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎండ కొడుతుంది. కనీసం టెంట్లు కూడా వేయలేదు. ఇబ్బందులకు గురవుతున్నాం. - కళమ్మ, గౌలిపురా. పర్యవేక్షణ లోపం... పంపిణీ కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో.... లేవో.. తెలుసుకునేందుకే లబ్ధిదారలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాయంత్రం వరకు లైన్లో ఉన్నా... లిస్టులో మీ పేరు లేదు... రేపు మరో సెంటర్లో ఇస్తాం అక్కడికి రావాలని చెబుతుండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల తీసుకునే సెంటర్లో కాకుండా... ఇంటికి దూరంగా ఉండే మరో ప్రాంతానికి బదలాయించడం వల్ల వృద్దులు, వికలాంగులు ఆందోళనకు గురవుతున్నారు. 90 వేల మందికే బ్యాంకు ఖాతాలు.. హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్ దారులుండగా, వారిలో 90 వేల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మిగతా వారందరు బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు సూచిస్తున్నా....ఫలితం కనిపించటంలేదు. మార్చిలోగా బ్యాంకు ఖాతాలు తెరవాలని హుకుం జారీ చేసిన అధికారులు ప్రస్తుతం పంపిణి కేంద్రాల వద్ద పింఛన్లు అందజేస్తున్నారు. -
పరిమళించిన మానవత్వం
పోరుమామిళ్ల: మానవత్వం పరిమళించింది.. ఇద్దరు యువకులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం పలువురిని కదిలించింది.. వారు అనాథ వృద్ధున్ని ఆశ్రమంలో చేర్చారు.. అయితే ఆయనను విధి చిన్నచూపు చూడటంతో సంఘటన మరో మలుపు తిరిగింది.. ఆ గడియల్లోనే మృతి చెందిన వృద్ధునికి వారు అన్నీ తామే అయి అంత్యక్రియలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆ యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్చార్జి, పోరుమామిళ్లకు చెందిన రామకృష్ణారెడ్డి ఒకరు కాగా, ఆయన మిత్రుడు సుభాన్‌బాషా మరొకరు. ఇంట్లో ఆదరించే దిక్కు లేక: ప్రొద్దుటూరు మండలం బుడ్డాయపల్లెకు చెందిన రామయ్య(70) ఇంట్లో ఆదరించే దిక్కులేక అనాథగా బజారున పడ్డాడు. పోరుమామిళ్లకు చేరిన ఆయన అనారోగ్యంతో స్థానిక 30 పడకల ఆసుపత్రిలో ఆదివారం చేరాడు. చికిత్స చేసిన సిబ్బంది వృద్ధుడి వివరాలు తెలుసుకొని ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్’ జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డికి సమాచారం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మిత్రుడు సుభాన్‌బాషా సహకారంతో ఆటోలో బాలమ్మ సత్రం వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో నుంచి దింపి, ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. అంత వరకు బాగానే వుంది. బాగా మాట్లాడుతున్న వృద్ధుడు, అక్కడ మంచినీరు తాగాక వీల్ కుర్చీలో కూర్చొని సేద తీరుతున్న సమయంలోనే ఊపిరి ఆగిపోయింది. తాము చేసిన కృషితో ఆశ్రమంలో ఆశ్రయం దొరికిందని ఆనందిస్తున్న ఇద్దరు యువకులకు వృద్ధుని హఠాన్మరణం ఆవేదన కలిగించింది. ఫాదర్ సర్వేశ్వరరెడ్డితో మాట్లాడి వారే ఆశ్రమ సమీపంలో గొయ్యి తీసి, సంప్రదాయ పద్ధతిలో అన్నీ తామే అయి, ఆశ్రమ సిస్టర్ సహాయంతో వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి దూరమయి, అనాథగా వున్న ఆయనకు సంబంధంలేని యువకులు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ మార్గదర్శకం. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్: ప్రతి నెలా ఠంచనుగా వచ్చే పింఛన్‌ను రెండు నెలల నుంచి రాకుండా చేశారని కందుకూరు మండలం ఓగూరుకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాపోయారు. సోమవారం ప్రకాశం భవనం ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వారు తమ గోడును కలెక్టర్ విజయకుమార్‌కు విన్నవించుకున్నారు. కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా?: కలెక్టర్ ‘50 మంది అధికారులు ఒకేచోట కూర్చొని నాలుగు గంటలు పనిచేస్తున్నారు. దానివల్ల సమస్యలకు పరిష్కారం రావాలి. మీరు(అధికారులు) మాత్రం ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చినట్లుంది’ అని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు స్పష్టమైన నిర్ణయాలు రాయకుండా తూతూ మంత్రంగా కలెక్టర్‌కు అందించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పంచాయతీలోని రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు తమకు 14 నెలల నుంచి వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇన్చార్జ్ డీఎల్పీవో నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. రెగ్యులర్ కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తారు : మండల పరిధిలో మీరు చేయాల్సిన పనులు చేయకుండా నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తున్నారని పొదిలి తహశీల్దార్‌ను కలెక్టర్ నిలదీశారు. పొదిలి మండలం రాజుపాలెంలో 448 మందికి 2009లో సర్వే నెం 1064లో ఇళ్ల పట్టాలిచ్చినా ఇంతవరకు పొజిషన్లు చూపించలేదు. దాంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఐదేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్ పట్టాలు పంపిణీ చేసిన వారిలో అర్హులైన వారితో జాబితాను ప్రచురించి వెంటనే పొజిషన్లు చూపించాలని పొదిలి తహశీల్దార్‌ను ఆదేశించారు. ఏ లోకంలో ఉన్నావు ? - మార్కెటింగ్‌శాఖ అధికారిపై కలెక్టర్ మండిపాటు సుబాబుల్, జామాయిల్ రైతుల నుంచి తక్కువ ధరకు కర్ర కొనుగోలుచేసి మద్దతు ధరకు కొన్నట్లు బిల్లులు ఇస్తుండటంపై కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ కమిటీల పరిధిలో జరుగుతున్న తంతును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, ఇతర నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకిలా జరుగుతోందని మార్కెటింగ్‌శాఖ అధికారిని కలెక్టర్ ప్రశ్నించారు. సుబాబుల్ టన్ను 4400, జామాయిల్ టన్ను 4600 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చెబుతున్న ధర జిల్లాలోదా లేక దేశంలోదా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏమి జరుగుతుందో తెలియకుండా ఊహల్లో ఉండి మాట్లాడతావా అని నిలదీశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ యార్డులపై పోలీసుల సాయంతో ఆకస్మిక తనిఖీలుచేసి నివేదికలు అందించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకులా? ఉలవపాడు మండలం చాకిచర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బారాయుడు సత్రం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ గృహాలకు చెందిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించిన విషయమై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో చుట్టుపక్కన ఉన్నవారు సెప్టిక్ ట్యాంకులు కట్టారని గ్రామ ఉప సర్పంచ్ కామేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సెప్టిక్ ట్యాంకులు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినా సాయం అందలేదు: ఉలవపాడు, సింగరాయకొండ మండలాల్లోని 58 మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి అయినా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని ప్రకాశం జిల్లా యానాది యువజన సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై జాలయ్య, వై అంజిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరులో వెట్టి నుంచి విముక్తి చేసినా ప్రభుత్వం నుంచి 20 వేల రూపాయల నగదు, ఇంటి స్థలం రాలేదన్నారు. దీనిపై విచారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్..కందుకూరు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. చదువులోనూ, మెనూలోనూ వివక్ష : సంతమాగులూరు మండలం ఏల్చూరులోని కేజీబీవీ ఎస్వో తమ పిల్లలకు చదువు చెప్పించడంలో, మెనూ పాటించడంలో వివక్ష ప్రదర్శిస్తోందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2011లో ఎస్‌వోగా బాధ్యతలు స్వీకరించిన ఆవుల సునీత ఎస్సీ విద్యార్థినులను, ఇతర కులాల విద్యార్థినులను వేర్వేరుగా విభజించి వారిమధ్య తగువులు పెట్టిస్తోందన్నారు. కేజీబీవీలో ఎస్సీ కులానికి చెందిన ఎస్వోను నియమించాలని కోరారు. -
మంచం పట్టిన కప్పరాళ్లతిప్ప
బిట్రగుంట: కప్పరాళ్లతిప్ప విషజ్వరాలతో మంచం పట్టింది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. పాఠశాలకు వెళ్లే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు, జ్వరాలతో మంచాలకు అతుక్కుపోతున్నారు. తిప్పలో సుమారు 2 వేల మంది జనాభా ఉండగా 600 మం దికి పైగా విషజ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు. 10 రోజుల వ్యవధిలో నే సగం గ్రామం జ్వరాల బారిన ప డటంతో ఊరంతా ఆందోళనగా ఉం ది. ఒక్కో ఇంట్లో ఇద్దరు..ముగ్గురు జ్వరపీడితులు ఉన్నారు. ఇప్పటికే పలువురు జ్వర పీడితులు నెల్లూరు, కావలిలోని పలు ప్రైవేట్ వైద్యశాల్లో చికిత్స పొందుతుండగా, మరికొంత మంది అప్పులు చేసి చెన్నైలోని ఆ సుపత్రుల్లో చికిత్స పొందుతున్నా రు. ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రంగా ఉన్న బాధితులు స్థానిక ఆ సుపత్రులపై ఆధారపడుతున్నారు. ైవెద్యారోగ్యశాఖ పట్టించుకోకపోవ డం, కోవూరుపల్లి పీహెచ్సీ సిబ్బం ది పూర్తిబాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో జ్వరాల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుంది. చికున్ గున్యా, మలేరియా ప్రబలుతున్నా, డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నా పీహెచ్సీ సిబ్బంది మాత్రం ఇంత వరకూ పరిస్థితి ని చక్కదిద్దే చ ర్యలు చేపట్టలే దు. స్థానికుల ఒత్తిడితో శుక్రవారం నామమాత్రంగా తా త్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేసి మాత్రలు పంపిణీ చేశారు. పరి స్థితి శృతిమించి వందల మంది మం చాన పడిన తరువాత పీహెచ్సీ సి బ్బంది నామమాత్రంగా శిబిరం ఏ ర్పాటు చేయడంపై మండిపడిన స్థా నికులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అధ్వానంగా పారిశుధ్యం విషజ్వరాల విజృంభణకు పారిశుధ్యలోపమే ప్రధాన కారణంగా క నిపిస్తోంది. అంతర్గత రహదారుల్లో ఎక్కడ చూసినా మురుగునీరు మడుగులు కట్టి దోమలకు నిలయంగా ఉంది. డ్రెయిన్స్ లేకపోవడంతో ము రుగునీరంతా రోడ్లపైనే ఉంది. ఇళ్ల మధ్యనే చెత్తాచెదారాలు పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ చేరడం తో దోమలకు ఆవాసంగా మారింది. దోమలు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎమ్మెల్యే ఎదురుగానే అనుచిత వాఖ్యలు తిప్పలో జ్వరాల విజృంభణపై పీహెచ్సీ సిబ్బంది ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎదుటే స్థానికులపై అ నుచిత వాఖ్యలు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మె ల్యే ఆధ్వర్యంలో సర్వసభ్య స మావేశం నిర్వహిస్తుండగా తిప్పవాసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. పీహెచ్సీ వైద్యాధికారిని ఎమ్మెల్యే వివరాలు అడుగుతుండగా వేదిక పైనున్న ఆమెకు బదులుగా కింది స్థాయి సి బ్బంది సమాధానం ఇచ్చారు. తిప్పలో కేవలం ఏడుగురికే జ్వరాలు ఉ న్నాయని, ఇళ్ల దగ్గర శుభ్రంగా ఉం చుకోకుంటే జ్వరాలు రాకుండా ఎ లా ఉంటాయని అనుచితంగా మా ట్లాడటంతో తిప్ప వాసులు తీవ్ర ఆ గ్రహానికి గురయ్యారు. దీంతో సభ లో గందరగోళం నెలకొంది. ఇంత జరుగుతున్నా వైద్యాధికారి మాధవీలత సమాధానం ఇవ్వకపోవడంపై ఎంపీటీసీ సభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. డాక్టర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు కప్పరాళ్లతిప్పలో జ్వరాల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతాం. జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారితో కూడా ఫోన్లో చర్చించాను. శనివారం నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జ్వరాలు అదుపులోకి వచ్చేలా వైద్యశిబిరాలు సేవలందిస్తాయి. జ్వరాలు నియంత్రణలోకి వచ్చే వరకూ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే విషజ్వరాల, వృద్ధుల, ప్రైవేట్ వైద్యశాల, -
విన్నపాలు వినేదెవరు?
ఒంగోలు టూటౌన్: సర్కారు నిర్వాకంతో పింఛన్లు కోల్పోయిన వేలాది మంది కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఒంగోలు తరలి వచ్చారు. జన్మభూమి అనంతరం కలెక్టరేట్లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో నిండిపోయింది. నడవలేని వారు..కర్ర ఊతంతోనో..కుటుంబ సభ్యుల సాయంతోనో మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చారు. పింఛన్లు తీసేశారంటూ వచ్చిన వారిని పలకరించే నాథుడే లేకుండాపోయారు. ఉదయం 10.30కు గ్రీవెన్స్‌సెల్ ప్రారంభించగా 12 కాకుండానే వేరే కార్యక్రమాలున్నాయంటూ కలెక్టర్ విజయకుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన డీఆర్వో ఎన్ఆర్ ఖాసీం, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో అర్జీ ఎవరికి ఇవ్వాలో తెలియక..ఎక్కువ దూరం నడవలేక ఎక్కడివారు అక్కడే నిరాశగా కూలబడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎవరైనా పలకరిస్తే చాలు.. ఆగని కన్నీళ్లతో అన్యాయంగా పింఛన్ తీసేశారంటూ విలపించిన పండుటాకుల పరిస్థితి వేదనాభరితం. పింఛన్లకు రాజకీయ రంగు: చూసేవాళ్లు లేక, ఆదరించే వాళ్లు కరువైన వృద్ధులకు ఏదో కంటితుడుపుగా ఇచ్చే పెన్షన్‌కు రాజకీయరంగు పులిమారు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓట్లేశారని పగబట్టి పెన్షన్లు తొలగించారని పొన్నలూరు మండలం ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బాధితులు వాపోయారు. తన పేరు మీద ఒకటిన్నర ఎకరపొలం ఉందని పెన్షన్ తొలగించారని కోడూరి తిరుపతయ్య వాపోయాడు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారికి, 20 ఎకరాలు ఉన్న వాళ్లకి, అనర్హుల పేర్లను మళ్లీ ఇటివల జాబితా తయారు చేసి పంపారని.. అర్హులమైన తమ పేర్లు పంపలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు చేయూత: పెన్షన్ల కోసం అష్టకష్టాలు పడి ఒంగోలు గ్రీవెన్స్సెల్కి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలు చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు వారికి మధ్నాహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బాధితులు వచ్చారు. వీరందరికీ స్థానిక అంబేద్కర్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా పెన్షన్ బాధితులు వచ్చారు. ఇలా అన్ని మండలాల నుంచి వేలాది మంది పండుటాకులు తరలిరావడం చూపరులను కలచివేసింది. కొందరు వృద్ధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇంత మంది వేదనకు కారణభూతమైన ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. -
బతుకు బజారు
పింఛన్ తీసేశారు.. పోషణ భారమైంది ! ఓ అమ్మ ఆవేదన కలెక్టరేట్ చుట్టూ {పదక్షిణల కరుణించని అధికారులు మునిసిపల్ ఆఫీసులోనూ చుక్కెదుర కన్నీటి పర్యంతమైన బజారమ్మ ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు ఆమెకు నా అనే వారు ఎవరూ లేరు. ఉన్నదల్లా ఒక్కగానొక్క కుమారుడు, భర్త. కుమారుడికి మతిస్థిమితం లేదు. భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వారి బాగోగులు చూసుకోవడమే ఆమె పని. వృద్ధాప్యంలో శక్తినంతా కూడగట్టుకొని వారిని పోషిస్తోంది. అయితే ఆమెకు ఆసరాగా ఉన్న పింఛన్‌ను ప్రభుత్వం తీసేసింది. నిబంధనల పేరుతో ఆమెకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. తనకు రెండు కళ్లుగా ఉన్న భర్త, కుమారుని పోషణ కోసం ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ‘పింఛన్ తీసేశారు.. ఆదుకోండి సారూ’ అంటూ ప్రాధేయపడినా కరుణించే అధికారులు కరువయ్యారు. కర్నూలు (జిల్లా పరిషత్) : ఆనందం ఐదింతలు అంటూ ఒక వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు పేదలకున్న ఆసరాను ప్రభుత్వం తొలగించి వేస్తోంది. నెలనెలా వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లూరు ఎస్టేట్‌లోని శివప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బజారమ్మ ఈ కోవకే చెందుతుంది. ఈమె ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులుకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. ఇప్పటికి 26 ఏళ్లు వచ్చినా అతనిలో మాత్రం మార్పులేదు. మాటలు రావు.. వినిపించవు, ఆకలని కూడా చెప్పలేడు. ఆమె భర్త మారెప్పదీ(62) అదే పరిస్థితి. పక్షవాతం వచ్చి 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కుమారునితో సమానంగా భర్తకూ అన్ని సపర్యలూ చేయాల్సి వస్తోంది. వారి ఆకలిని తీర్చేందుకు ఇరుగు పొరుగు వారి సహాయాన్ని అర్థిస్తుంది. అది కుదరకపోతే వీధిలో భిక్షమెత్తుకుని వచ్చి భర్త, బిడ్డ కడుపు నింపుతోంది. అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెకు వృద్ధాప్య పింఛనూ, కుమారునికి వికలాంగుల పింఛనూ ప్రభుత్వం తీసేసింది. పింఛన్ పునరుద్ధరించాలని బిడ్డను ఎత్తుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మునిసిపల్ కమిషనర్‌ను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని జేసీ చెప్పగా గురువారం సాయంత్రం ఆమె తన కుమారున్ని ఎత్తుకుని మునిసిపల్కార్యాలయానికి వెళ్లింది. గంటకు పైగా మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరకు అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే పింఛన్లు తీసేసేది తాము కాదని, డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాలంటూ వెనక్కి పంపించారు. దీంతో బజారమ్మ కన్నీటి పర్యంతమైంది. తనగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించింది. ‘ ఈ బిడ్డను భుజాన వేసుకుని ఎక్కడికని తిరగను. ఉన్నోళ్లకు చానా మందికి పింఛన్లు ఇస్తారు...మాలాంటోళ్లవి తీసేశారు. వీడికి(కుమారునికి) వేలిముద్రలు పడవు. అందుకే ఆధార్ రాలేదు. జిల్లా అధికారులు కనికరించి తనకు న్యాయం చేయాలి’ అని విలేకరుల ఎదుట వేడుకుంది. ప్రతి రోజూ కుమారునికి, భర్త పోషణకు రూ.200లకు పైగా ఖర్చు అవుతుందని, దాతలు సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. -
మండిపడ్డ పండుటాకులు
జన్నారం : అర్హుల పింఛన్లు కూడా తొలగించారని మండలంలోని చింతగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. చింతగూడ గ్రామ ప్రధాన రహదారిపై రెండు గంటలకుపైగా బైటాయించి ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో, తహశీల్దార్లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు వెళ్లేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదవత్ సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ పేదల పొట్టలు కొట్టి పెద్దలకు ఈ ప్రభుత్వం దోచి పెడుతుందని విమర్శించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను తొలగించి వృద్ధుల ఉసురుపోసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువదని పేర్కొన్నారు. ఎస్సై కలుగజేసుకుని ఆందోళనకారులను పక్కకు పంపించారు. తహశీల్దార్ రవీందర్ అక్కడికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బద్రినాయక్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట.. మండలంలోని కవ్వాల్, ఇందన్పల్లి, కామన్పల్లి, దేవునిగూడ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైటాయించారు. అరగంటపాటు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కనికరం రాజన్న మాట్లాడుతూ పింఛన్ తొలగించి ప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటుందన్నారు. పింఛన్లు తొలగించి ముసలి వాళ్లకు ఆసర లేకుండా చేసిందన్నారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో అంగడీబజార్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారోకో చేశారు. ఎస్సై స్వామి కలగజేసుకొని అధికారులతో మాట్లాడిస్తామని నచ్చజెప్పి వారిని తిరిగి కార్యాలయాలకు తీసుకెళ్లారు. ఎంపీడీవో శేషాద్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అంజన్న, నాయకులు గోపాల్, కొండగొర్ల లింగన్న , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, టీడీపీ నాయకుడు ప్రభాకర్, సర్పంచ్ వెంకటరాజం పాల్గొన్నారు. కాగజ్‌నగర్ కమిషనర్‌ను నిర ్బంధించిన కౌన్సిలర్లు కాగజ్‌నగర్ రూరల్ : పింఛన్ల పంపిణీపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ కంచె కుమారస్వామిని కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో నిర్భంధించారు. ఈ నెల 8న ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో నూతన పింఛన్లు మంజూరు చేయగా కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని కౌన్సిలర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆసరా పేరుతో అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి కొంత మంది లబ్ధిదారులకు ఎందుకు విస్మరించారన్నారు. తమ వార్డుల్లో అర్హులైన నిరుపేదలు ఉన్నా వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశకు గురవుతున్నారన్నారు. కొంత మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయడంతో తామూ సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన పింఛన్లు మంజూరు చేస్తోందో ప్రజలకు స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్‌ను కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 17 ప్రకారం అర్హులైన వారందికీ పింఛన్లు మంజూరు చే స్తామని చెప్పడంతో కౌన్సిలర్లు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దేశ్‌ముఖ్ శ్రీనివాస్, కనుకుంట్ల శివప్రసాద్, రాజేందర్, నియాజుద్దిన్, జానిమియా, నాయకులు షబ్బీర్‌హుస్సేన్, పంజాల మురళీగౌడ్, శ్రీరాం, మహేశ్, దెబ్బటి శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పింఛన్
జమ్మలమడుగు: పింఛన్ల పంపిణీ పేరుతో ప్రభుత్వం వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జమ్మలమడుగు పట్టణం గూడు మస్తాన్ స్వామి దర్గా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ కోసం వచ్చిన ఎల్. మాబున్నీ(70) అనే వృద్ధురాలు ఊపిరాడక మృతి చెందింది. పింఛన్‌కోసం పలు వార్డులకు చెందిన లబ్ధిదారులు రావడంతో పాఠశాల ప్రాంగణమంతా నిండిపోయింది. దీంతో పింఛన్ ను పక్క వీధిలో పంపిణీ చేస్తామని చెప్పి లబ్ధిదారుల కార్డులను పింఛన్ పంపిణీ సిబ్బంది తీసుకెళ్లారు. తమ కార్డులు ఎక్కడ తారుమారు అవుతాయో అనే ఆందోళనతో వృద్ధులంతా ఒకే చోట గుమిగూడారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మాబున్నీ(70) ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి ఆమె మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబానికి ఛైర్పర్సన్ పరామర్శ పింఛన్ కోసం వచ్చి మృతి చెందిన మాబున్ని కుటుంబ సభ్యులను మున్సిపల్ ఛైర్పర్సన్ తాతిరెడ్డి తులసి, వైస్ ఛైర్మన్ ముల్లాజానీ, కౌన్సిలర్ నూర్జహాన్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మృతురాలి కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అలాగే వైస్ ఛైర్మన్, 20వవార్డు కౌన్సిలర్ నూర్జహాన్‌లు రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. అస్తవ్యస్థ పంపిణీతో ఇబ్బందులు పింఛన్ పంపిణీ అస్తవ్యస్థంగా మారడంతోనే వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతినెల తమకు సంబంధించిన ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే అక్టోబర్ నుంచి ప్రభుత్వం పింఛన్లను రూ.200నుంచి రూ.1000కి పెంచి ఆ డబ్బులను జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేస్తామని పేర్కొంది. అయితే అధికారులు జన్మభూమి కార్యక్రమంలో సగం మందికి అక్టోబర్ నెలలో పింఛన్లు పంపిణి చేశారు. తిరిగి నవంబర్‌లో జన్మభూమిని ప్రారంభించి ఏ ప్రాంతంలో జన్మభూమి సమావేశాన్ని నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్ ఇస్తారని ప్రకటించారు. తమకు ఈనెల కూడా ఎక్కడ పింఛన్ రాకుండా పోతుందోననే ఆందోళనతో వృద్ధులంతా ఒక్కసారిగా వచ్చారు. అధికారుల వైఫల్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికావాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏడ్చారు.. దుమ్మెత్తిపోశారు
కూచున్న చోట నుంచి పట్టుమని పది అడుగులు నడవలేని స్థితిలో ఉన్నవారు..అవసాన దశలో ఆదెరువు లేక దేవుడా అంటూ బతుకులు ఈడుస్తున్న అభాగ్యులు..బతకడానికి వేరే దారిలేక పింఛన్లే ఆసరాగా జీవిస్తున్న వారు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే వారికి జీవనాధారం.. అలాంటి స్థితిలో ఉన్న వారి పేర్లు పింఛన్ జాబితాలో నుంచి తీసేశారు. దీంతో ఆ అభాగ్యులు షాక్‌కు గురయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వందలాదిమంది పానం కూడగట్టుకొని మహబూబ్ నగర్ కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడ అధికారుల ఎదుట కష్టాలు చెప్పుకొని ఏడ్చారు. చివరకు వారి కడుపు మండింది. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. దుమ్మెత్తి పోశారు. మహబూబ్‌నగర్ టౌన్: ‘ఇన్నాళ్లూ వచ్చే కాస్త పింఛన్‌తో మాకు బుక్కెడు బువ్వ దొరికేది. ఇప్పుడు ఆ ఆసరా కూడా లేకుండా చేసినవ్. మాకు అన్నం లేకుండా చేసిన నీకు పుట్టగతులుండవ్..’ అంటూ వృ ద్ధులు, వితంతువులు సీఎం కేసీఆర్‌కు శా పనార్థాలు పెట్టారు. ఏ దిక్కూలే ని మా పింఛన్ తీసేసి నోట్లో మట్టికొడతారా? అ ని మండిపడ్డారు. 65ఏళ్లు నిండి న వారికి మాత్రమే ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద పింఛన్‌ను ఈనెల 8న మంజూరుచేసింది. దీంతో వయస్సు అర్హత నిబంధనతో చాలామం ది పింఛన్లు కోల్పోయారు. ఈ క్రమంలో సోమవారం వందలాది మంది వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు తరలిరావడంతో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వారికి మద్దతుగా పాలకపక్షం, ప్రతిపక్షాల నాయకులు కూడా వే ర్వేరుగా ఆందోళన లు చేపట్టారు. ఇలా ని రసనలు, నిలదీతలతో రెవెన్యూ సమావేశ హాల్లో జరుగుతున్న ప్రజావాణి ద ద్దరిల్లింది. నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెల కొంది. కొందరు వృద్ధు లు చెప్పులు చూ పుతూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తమకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి చెప్పులతోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీరికి సర్దిచెప్పేందుకు వచ్చిన ఏజేసీ రాజారాం పరిస్థితిని చూసి వెనక్కి వెళ్లిపోతుంటే ఆయన వెనుక నుంచి వారంతా దుమ్మెత్తిపోశారు. ఒకాకనొక దశలో పరి స్థితి చేయిదాటిపోయింది. ఈ సందర్భం గా పలువురు వృద్ధులు మాట్లాడుతూ.. మా దేవుడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యంతో నెలకు వచ్చే పింఛన్‌తో తమకు కాస్త ఆసరా ఉండేదన్నారు. ఏ తోడు లేకపోయినా ప్రతినెలా వచ్చే పింఛన్ పైన ఆధారపడ్డామని, తెలంగాణ రాష్ట్రం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తమ పింఛన్లు తొలగిస్తావా? అని ధ్వజమెత్తారు. మాలాంటి వాళ్లకు అన్యాయం ఎలా చేయాలనిపించిందని నిలదీశారు. అఖిలపక్షం నేతల మద్దతు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మద్దతు పలికారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలమూరు మునిసిపల్ చైర్పర్సన్ రాధ కలెక్టరేట్ ఆవరణలో వారితో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల కడుపుకొట్టిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్ని అర్హతలు ఉన్నా కావాలనే పింఛన్లను తొలగించారని మండిపడ్డారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ మహబూబ్‌నగర్ పట్టణాధ్యక్షుడు అమరేందర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు ఇచ్చామని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిరాగానే వారి కడుపు కొట్టిందని ధ్వజమెత్తారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. పింఛన్లను తొలగించడంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన బాట పట్టారు. అర్హత ఉన్న పింఛన్లు రాని కారణంగా తమపై దాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ రాములు, టీడీపీ ఫ్లోర్‌లీడర్ కృష్ణమోహన్, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ హాదీ, టీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రసన్న ఆనంద్, జ్యోతి పాల్గొన్నారు. -
మాకు ‘ఆసరా’ ఏదీ!
ధర్పల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్హులైన వారికి పింఛన్లు రద్దు చేశారని సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి మూడు ట్రాక్టర్లలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వందల సంఖ్యలో తరలి వచ్చారు. కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. పండుటాకులమైన తమకు పింఛన్ ఎం దుకు రద్దు చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వృద్ధులు నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. అర్హులైన వారికి పింఛన్ మంజూరు అయ్యేంత వరకు గ్రామంలో పింఛన్ పంపిణీ చేయనివ్వబోమని వారు తీర్మానించారు. అనంతరం వారందరు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. అర్హులైన వారిని గుర్తించి జాబితాను అందించాలని ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓ సూచించారు. పింఛన్ రాని వారందరు మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ధర్నాలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మఠముల శేఖర్, ప్రతినిధి కర్క గంగారెడ్డి, వైస్ ఎంపీపీ నాయిడి విజయ రాజన్న, ఉపసర్పంచ్ బాపురావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామకమిటీ ప్రతినిధులు, వృద్ధులు, వింతతువులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ ఇప్పించండి సారూ..
జిల్లా నలుమూలాల నుంచి ప్రతీ సోమవారం ఫిర్యాదుల విభాగానికి వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు స్పందించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. తమకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని వికలాంగులు, వితంతులు, వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు వ్యవసాయ భూమిని ఇప్పించాలని, ఇంటి స్థలం ఇప్పించేలా చూడాలని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.- ఆదిలాబాద్ రూరల్ టవర్ నిర్మాణం రద్దుచేయాలి ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిర్మాణ పనులను వెంటనే రద్దు చేయాలని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గంగారెడ్డి, మామిడి లక్ష్మణ్, సభ్యులు మామిడి భాస్కర్, చిలుక స్వామి, మునేశ్వర్, రవి, జి.శ్రీనివాస్, సాయ్యన్న ఫిర్యాదు చేశారు. తమ కాలనీలో గృహ సముదాయంలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిబంధనాలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో రేడియేషన్ ప్రభావంతో గర్భిణులకు, మానసిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించి సెల్‌టవర్ నిర్మాణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పింఛన్ కట్ అయింది కొన్నేళ్ల నుంచి మొన్నటి వరకు నాకు పింఛన్ వచ్చింది. ప్రస్తుతం పింఛన్ రావడం లేదు. వితంతువులం, వృద్ధులం. మాకు ఎవరు అన్నం పెడుతారు. కనీసం పింఛన్‌తోనైనా బతుకుదామని ఆశతో ఉంటే వస్తున్న పింఛన్ కూడా కట్ అయింది. వెంటనే మాకు పింఛన్ వచ్చేలా చూడాలి. - సుశీల, అడేల్లా, దేవమ్మ, వితంతువులు, జందాపూర్, ఆదిలాబాద్ ఏఏఈవో ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న 440 పోస్టుల్లో ఏఏఈవో ఉద్యోగాల్లో మాకు సైతం అవకాశం కల్పించాలి. మరికొన్ని రోజులైతే మా కోర్సు పూర్తవుతుంది. ఈ నోటిఫికేషన్లో తమకు అవకాశం కల్పించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో సుమారు 5 వేల మంది ఈ కోర్సు పూర్తి చేసిన వారము ఉన్నాం. మాకు అవకాశం కల్పించకుండా కేవలం అగ్రికల్చర్ డిప్లొమా, పాలిటెక్నిక్ చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారితో పాటు తమకు కూడా అవకాశం కలిగేలా చూడాలి. కాగా, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో అగ్రికల్చర్ విద్యార్థులు సుధాకర్, స్వాగత్, సునీల్, నర్మద, శైలజ, పద్మ, శ్రీలత ఉన్నారు. - అగ్రికల్చర్ అసిస్టెంట్ విద్యార్థులు పోలీసులు జర పట్టించుకోవాలి ఆగస్టులో మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే నా భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఎవరో దొంగ నా భార్య మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగలించుకుపోయాడు. అప్పుడు సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశాను. దొంగతనం జరిగినప్పటి దృశ్యం రిమ్స్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి. దొంగను పట్టుకుని మా బంగారం మాకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. - నాయిని సుదర్శన్, ఖుర్షీద్‌నగర్, ఆదిలాబాద్ -
పండుటాకులకు ‘అసరా’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పండుటాకులకు ‘ఆసరా’గా, వికలాంగులకు ఊతకర్రగా నిలిచేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. వృద్ధులు, వితంతవులు, గీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు రూ.1000, వికలాంగులకు రూ. 1,500 చొప్పున శనివారం నుంచి ‘ఆసరా’ పథకం కింద పింఛన్లు అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. లబ్ధిదారుల జాబితా ఇప్పటికే తయారు చేసిన జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.10 లక్షల పింఛన్ దరఖాస్తులు రాగా, వీటిని అధికారులు వడబోసి 2.85 లక్షల మంది అర్హులను తేల్చారు. రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినా... తెల్లవారగానే పింఛన్ల పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. తాజాగా ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పంపిణీ వాయిదా పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరగనున్న దరఖాస్తులు ఆహార భద్రత, పింఛన్ దరఖాస్తుల పునఃపరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హతలకు సంబంధించి గతంలో పేర్కొన్న నిబంధనలు కాకుండా పలు మార్పులు చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు, ఇక పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచింది. అదే విధంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని గ్రామాల్లో 3.75 ఎకరాల్లోపు మాగాణి, ఏడు ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వాళ్లందరినీ అర్హులుగా గుర్తించాలని వెల్లడించింది. అయితే 65 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిలో ఎలాంటి సడలింపు లేకపోవడం, రేషన్‌కార్డు నిబంధనల్లో కూడా స్వల్పంగా మాత్రమే మార్పులుండడంతో దరఖాస్తులు ఓ మోస్తారుగా పెరిగే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో అదనంగా మరో 50 వేల దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పరిశీలనలో అర్హత కోల్పోయిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునేలా సర్కార్ తన తాజా ఆదేశాల్లో వెసులుబాటు కల్పించింది. ఆహార భద్రత, పింఛన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తహశీల్దారును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అర్హులను తేలుస్తారు. పింఛన్ల పంపిణీకి తొలి ప్రాధాన్యత కొంతకాలంగా పింఛన్ దరఖాస్తుల విచారణ చేసిన అధికారులు అర్హత సాధించిన దరఖాస్తులను 4, 5 తేదీల్లో కంప్యూటరీక రించారు. 6,7 తేదీల్లో అర్హులైన వారికి కార్డులు ముద్రించారు. శనివారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించేందుకుజాబితా సిద్ధం చేశారు. తహశీల్దారు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, ఏఈఓలకు ఒక్కొక్కరికి మూడు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించనున్నారు. మొదటి నెల పింఛన్లు నగదు రూపంలో చెల్లిస్తున్నందున ప్రత్యేక అధికారుల సమక్షంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆహార భద్రత కార్డులకు మరింత సమయం ఆహార భద్రత కార్డులు కోసం జిల్లా వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి విచారణ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే ఆహార భద్రత కార్డుల జారీకి మరింత సమయం పట్టనుంది. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికిచ్చే కార్డులను అధికారులు గులాబి రంగులో ముద్రించనున్నారు. కొత్త కార్డులు డిసెంబర్లో చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలోగా జారీ కానున్నాయి. ప్రస్తుతానికి అధికార యంత్రాంగం పింఛన్ల పంపిణీ పైనే దృష్టి సారించింది. అందువల్లఈ దరఖాస్తుల పరిశీలనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిబంధనలు సడలించిన నేపథ్యంలో అదనంగా 50 వేల వరకు కార్డుల దరఖాస్తుల పెరిగే అవకాశం ఉంది. కార్డులు గుర్తులు వృద్ధాప్య పింఛన్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు గులాబి రంగు కార్డు వికలాంగులకు ఆకుపచ్చ రంగు కార్డు వితంతువులకు నీలిరంగు కార్డు గీతకార్మికులకు ఆహారభద్రత కార్డులు(బీపీఎల్ కుటుంబాలకు) గులాబి రంగు కార్డు -
వృద్ధుడి ప్రాణం తీసిన జన్మభూమి
కడప కార్పొరేషన్: సమస్యల పరిష్కారానికే జన్మభూమి అంటూ ఊదరకొడుతున్న ప్రభుత్వం .. ఓ వృద్ధుడి ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమైంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పెంచిన పింఛన్లను అక్టోబర్ నెలలో పంపిణీ చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారు.. పింఛన్లు పంపిణీ చేయడానికి జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాలలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెరిగిన పింఛన్‌ను తీసుకోవడానికి బాలాజీపేటకు చెందిన ఆదినారాయణ (75) అనే వృద్ధుడు ఎంతో ఆశగా వచ్చాడు.. కొద్దిసేపటికే ఆదినారాయణకు గుండెపోటు వచ్చింది.. జన్మభూమి శిబిరం వద్ద అలాగే కుప్పకూలిపోయాడు.. అక్కడున్న మున్సిపల్ అధికారులు 108కు సమాచారం అందించారు.. నిముషాలు గడిచినా 108 రాలేదు.. విషయాన్ని అక్కడే వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు.. వృద్ధుడిని పరీక్షించేందుకు వైద్యశిబిరంలో బీపీ పరికరంతో పాటు ఎటువంటి మందులు లేవు.. వృద్ధుడి ఎదపై ఒత్తిడి తెచ్చి గుండె ఆడేలా విఫలయత్నం చేశారు. ఇంతలో ఓ మున్సిపల్ ఇంజినీర్ వాహనంలో వృద్ధుడిని రిమ్స్‌కు తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. పెరిగిన పింఛన్‌ను ఒక్క నెలైనా తీసుకోకుండానే ఆదినారాయణ తుదిశ్వాస విడిచాడు. -
కొందరే ‘భద్రం’
ప్రైవేటు ఉద్యోగులకు ఆహార భద్రత కార్డులు కట్ ఒక ఇంట్లో ఒక్క వృద్ధునికే పింఛను నిబంధనలు కఠినతరం సాక్షి, సిటీబ్యూరో: మీకు ఎంత చిన్నదైనా సరే... ప్రైవేటు ఉద్యోగం ఉందా? అయితే ఆహార భద్రత కార్డులపై ఆశలు వదులుకోండి. మీ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారా? ఇద్దరికీ పిం ఛను అందుతోందా? అయితే ఇద్దరిలో ఒకరు త్యాగానికి సిద్ధంగా ఉండండి... ఇది మా మాట కాదు. ప్రభుత్వ నిబంధనలు చెబుతున్న నిజం. సంక్షేమ ఫలాలను నిజమైన లబ్ధిదారులకు అందించే పేరిట ప్రభుత్వం భారీ కోతలకు సిద్ధమవుతోంది. ఆహార భద్రత కార్డులు, పింఛనుదారుల ఎంపికపై నిర్వహించనున్న విచారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ దరఖాస్తులను కుటుంబ సమగ్ర సర్వేతో ముడిపెట్టి పరిశీలించాలని పేర్కొంది. రేషన్ కార్డులు, పెన్షన్లకు ఆధార్ లింక్ చేసిన సమ యంలో భారీగా బోగస్ రేషన్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో 1.84 లక్షల రేషన్ కార్డులు, 60 వేలకు పైగా పింఛన్లు బోగస్‌గా తేలాయి. ఇలాంటివి నివారించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం అమలులో భాగంగా రాష్ట్ర సర్కారు తాజాగా రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు ప్రవేశపెట్టాలని, దరఖాస్తులు స్వీకరించింది. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి.జంట జిల్లాల్లో ప్రసుతం రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా, ఆహారభద్రతకు 21.88 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సామాజిక భద్రత పింఛన్లు 3,49,759 ఉండగా... కొత్తగా 4,96,429 దరఖాస్తులు వచ్చాయి. వీటిని చూసిన యంత్రాంగం వడపోతకు సిద్ధమైంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలివీ... ఆహార భద్రత కార్డులకు అర్హులు మూడు గదుల్లో నివసించే/సొంత ఇళ్లు కలిగిన వారు, రెగ్యులర్ ఆదాయం లేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు, ఇంటిలో మంచినీరు, మరుగు దొడ్డి సదుపాయం లేని వారు, వితంతువులకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయనున్నారు. అనర్హులు వీరే.. ప్రభుత్వ, ప్రవేట్ రంగాల ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు, వ్యాపారులు, ప్రభుత్వ పింఛనుదారులు, సమర యోధులు, ఫోర్ వీలర్, ఏసీ కలిగిన వారు, నాలుగు/ అంతకన్న ఎక్కువ గదులు ఉన్న ఇంటి యజమానులు, ఆదాయ పన్ను చెల్లించువారు, ఆహార భద్రత కార్డులకు అనర్హులు. పింఛన్లకు ఇలా... కుటుంబంలో పిల్లలు ఉద్యోగం చేస్తుంటేపింఛన్లకు అనర్హులు. ఇతర పింఛన్లు పొందుతున్నా, వ్యాపారాలు, నాలుగు చక్రాల వాహనాలు, పరిమితికి మించి భూమి ఉన్నా అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. భార్యాభర్తలిద్దరూ వృద్ధులైతేప్రస్తుతమున్న విధంగా ఒక్కరికి మాత్రమే పింఛను ఇవ్వాలన్న నిబంధనను కొనసాగించనున్నారు. ఇంట్లో వితంతువులు, వికలాంగులు ఎంత మంది ఉన్నప్పటికీ, అందరికీ పింఛను మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. కఠిన నిబంధనల వల్ల అర్హులైన పేదలు నష్టపోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ షురూ... ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం దరఖాస్తుల వడపోతపై విచారణ ప్రారంభించింది. తొలుత పింఛన్లపై విచారణ చేపట్టనుంది. దీని కోసం 225 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. స్థానికంగా ఉన్న 125 మంది రెవెన్యూ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్, భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని ఎస్టేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు మరో 100 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం 20 కుటుంబాలను కలిసి, 40 నుంచి 50 దరఖాస్తులను పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈప్రక్రియ పూర్తి కాగానే ఆహార భద్రత కార్డులు, ఆదాయ, కుల, నివాస పత్రాల దరఖాస్తు విచారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ఈ దరఖాస్తుల విచారణలో 1000 మంది ఉద్యోగులు పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. -
నవ్వుల..పువ్వులు..
* జేసీ వర్సెస్ జనం * అందోలులో సరదా సంభాషణ జోగిపేట: ఆహార భద్రత , పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన తనిఖీలో భాగంగా బుధవారం ఆందోలు గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ శరత్‌కు పలువురు వృద్ధులు, వివిధ పథకాల లబ్ధిదారులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి.. దీంతో అధికారులు, స్థానికుల మధ్య నవ్వుల పువ్వులు వికసించాయి... గ్రామంలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఇలా పలకరించారు.. జేసీ: అమ్మా మీరు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారా? వృద్ధురాలు: ఎలచ్చన్లకు ఇంటికొచ్చి దండాలు పెడ్తరు.. ఇంటికి పా.. (అని వృద్ధురాలు అనగానే జేసీతో సహా అక్కడి వారంతా ఘొల్లున నవ్వారు) జేసీ: అమ్మా నీకు తప్పనిసరిగా పింఛను వస్తది.. నీకు ఎంత మంది కొడుకులు? వృద్ధురాలు: ఒక్కడు సచ్చిపోయిండు, ముగ్గురు కొడుకులున్నా ఒంటరిగానే ఉన్నా.. అంటూ వారిని తిట్టబోయింది... జేసీ: నీవు అన్నదాంట్లో తప్పేమి లేదు.. వచ్చేనెల నుంచి నీకు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తది.. వాళ్లే అమ్మా.. అమ్మా అంటూ నీ చుట్టు తిరుగుతారు. వృద్ధురాలు: దండం పెడుతూ నీ దయ అంది. అందోలులోని అంబేద్కర్ కాలనీలో ఏసయ్య ఇంటి వద్ద రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు పరిశీలిస్తుండగా జేసీ అక్కడికి వెళ్లారు. జేసీ: నీ వయస్సు ఎంత ఉంటుంది? ఏసయ్య: 66 వరకు ఉంటది సార్.. జేసీ: ఏమయ్యా.. మీ అక్క వయస్సు 65 అని చెప్పావ్.. నీ వయస్సు 66 ఎలా ఉంటుంది? ఏసయ్య: మీ దయ సార్. జేసీ: నీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఏసయ్య: వస్తుంది సార్ జేసీ: ఇక నుంచి రాదు, బాధ పడకు, నాలుగేళ్లు ఓపిక పట్టు వస్తుంది. అవును ఈ ఇల్లు ఎప్పుడు మంజూరైంది. ఏసయ్య: తెలుగుదేశం వాళ్లిచ్చారు సార్.. జేసీ: అలా కాదు.. ప్రభుత్వం ఇచ్చిందనాలి. ఏసయ్య: రాజయ్య ఎమ్మెల్యే ఇప్పించిండు సార్. జేసీ: మరి వెయ్యి రూపాయల పెన్షన్ ఎవ్వరు ఇస్తున్నరు? గోపాల్ (స్థానికుడు): బాబూమోహన్ సార్.. జేసీ: నవ్వుతూ ముందుకు కదిలారు. -
పింఛన్ల మంజూరుకు అర్హతలివే..
హన్మకొండ అర్బన్ : వివిధ రకాల పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా యి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఐదు లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, దరఖాస్తుదారుల్లో ఎవ రు అర్హులో, ఎవరు అనర్హులో అనే విషయమై ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. ఆ వివరాలు విభాగాల వారీగా ఇలా ఉన్నాయి. దరఖాస్తు విధానం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాం గులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు సంచార గిరిజన జాతుల వారికి వేర్వేరు గా పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేర కు అర్హతలు కలిగిన వారు తెల్ల కాగితంపై వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్‌తో సంబందిత గ్రామపంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడించిన విషయాల ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ వివరాలు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అర్హుల దరఖాస్తులను పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. వృద్ధాప్య పింఛన్ ఈ పింఛన్ కోసం 65 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి. జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు జాబితా, ఆధార్ కార్డు ఆధారంగా వ యస్సు నిర్ధారిస్తారు. వాటిలో వివరాలు వాస్తవదూరంగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితి, వివాహ సమయం, పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తారు. ఇంట్లో భార్యాభర్తలు పింఛన్‌కు అర్హులని తేలితే భార్యకు మాత్రమే మంజూరవుతుం ది. ఇక ఐకేపీ ఉన్నతి సర్వేలో పేదలుగా గుర్తిం చిన వారిని తప్పనిసరిగా పింఛన్ కోసం అధికారులు ప్రతిపాదిస్తారు. వితంతు పింఛన్ 18ఏళ్లు వయస్సు నుంచి వివాహమై భర్త మరణించిన మహిళలు వితంతు పింఛన్‌కు అర్హులవుతారు. దరఖాస్తుతోపాటు భర్త మరణ ధ్రు వీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భర్త మరణించి పదేళ్లు దాటి రికార్డులు లభించని వారి నుంచి దరఖాస్తు స్వీకరించి ఆ తర్వాత ఆర్డీఓ ధ్రువీకరణ పత్రం ఇస్తే పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. ఇక్కడ కూడా ఉన్నతి సర్వేలో నిర్ధారణ అయిన వారికి ప్రాధాన్యముంటుంది. వికలాంగుల పింఛన్ కుటుంబంలో వైకల్యం ఉన్న వారు 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ పొంది ఉండాలి. వినికిడి లోపం ఉన్న వారైతే 51శాతం వైకల్యంతో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సదరం సర్టిఫికెట్ లేని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే అధికారులే సదరం క్యాంపునకు పంపిస్తారు. ఉన్నతి సర్వేలో ప్రతిపాదించిన వికలాంగులను అధికారులు విధిగా పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. చేనేత, గీత కార్మికులు 50ఏళ్ల వయస్సు నిండి చేనేత సహకార సం ఘంలో సభ్యుడైన వ్యక్తి చేనేత పింఛన్ కోసం అర్హులవుతారు. కుటుంబంలో చేనేత పింఛన్‌తో పాటు వితంతువులు, వికలాంగులు ఉన్నట్లయితే వారు కూడా పింఛన్‌కు అర్హులుగా అధికారులు గుర్తిస్తారు. గీత కార్మికుల విషయంలో కూడా 50ఏళ్లు నిండి గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి. ఈ పింఛన్‌తో పాటు కుటుంబంలో అర్హులు ఉంటే ఇతర పిం ఛన్లు పొందవచ్చు. అలాగే, 50ఏళ్ల వయస్సు నిండిన వారు సంచార గిరిజన జాతుల పింఛన్ కు అర్హులవుతారు. -
పింఛన్ కోసం పాట్లు
పరిగి: ఓపక్క కొత్త పింఛన్లు వస్తున్నాయని ఊరిస్తుండగా.. మరో పక్క రెగ్యులర్‌గా ఇచ్చే పాత పింఛన్ కోసం వృద్ధులకు పాట్లు తప్పటం లేదు. ఐదారు నెలలుగా ఓ నెల ఇచ్చినట్లు, మరో నెల మరచినట్లు చేస్తూ వస్తున్న అధికారులు ఈనెల 17వ తేదీ దాటినా పింఛన్ ఇవ్వలేదు. దీంతో శుక్రవారం ఉదయం పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. పింఛన్ ఇచ్చే వారు ఎంతకూ రాకపోవటంతో పరిగి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ కోసం వారం రోజులుగా తిరుగుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కూడా ఈ విషయం ఎంపీడీఓ విజయప్ప దృష్టికి తీసుకెళ్లామని, ఆయన పింఛన్ ఇచ్చే సీఎస్పీని అక్కడికి పిలిపించి మందలించారని తెలిపారు. అయినా శుక్రవారం మళ్లీ సీఎస్పీ రాలేదని తెలిపారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తరువాత గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి సాయంత్రం వరకు పడిగాపులుగాశారు. చిన్న పంచాయతీల్లాగే మేజర్ పంచాయతీ అయిన పరిగికి కూడా ఒక్కరే సీఎస్పీ ఉండటం వల్ల సమస్య తలెత్తుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పరిగి లాంటి పెద్ద పంచాయతీకి కనీసం నలుగురు సీఎస్పీలు ఉంటే పింఛన్లు పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు. -
పింఛను మంటలు
పెన్షన్ల లబ్ధిదారుల ‘సర్వే’లో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వం అర్హతలున్నా 84,617 మందినిఅనర్హులుగా చిత్రీకరించిన వైనం నోటికాడ ముద్దను లాగేయడంతో వృద్ధులు, వికలాంగుల ఆకలికేకలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది. నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించి.. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి 84,617 మందిని తొలగించేసింది. జిల్లాలో అనర్హులను జాబితా నుంచి తొలగించడం వల్ల ఖజానాకు నెలకు రూ.8.61 కోట్లు.. ఏడాదికి రూ.103.32 కోట్లు మిగులుబాటు అవుతుందని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలు చరుచుకుంటుండడంపై సామాజికవేత్తలు విస్తుపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తు వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. పింఛనుదారుల్లో అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి ఉన్న వారు పింఛను పొందడానికి అనర్హులు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు.. కారు ఉన్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ఉద్యోగం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులే.. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు సైతం అనర్హులే. వృద్ధాప్య పెన్షన్‌దారులకు కనీస వయస్సు 65 సంవత్సరాలు.. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు. వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం కలిగి ఉన్న వాళ్లే అర్హులు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారూ అనర్హులే. కానీ.. ఈ నిబంధనలను సర్వేకమిటీ తుంగలో తొక్కిం ది. అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమన్హాం. తప్పులతడకగా లబ్ధిదారుల సర్వే! పింఛను లబ్ధిదారులపై నిర్వహించిన సర్వే తప్పులతడకగా అధికారవర్గాలే అభివర్ణిస్తుండడం గమనార్హం. కమిటీలో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగిందని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోం ది. తిరుపతి మండలం ఎమ్మార్పల్లెకు చెందిన వికలాం గుడు బాలకృష్ణను సకలాంగుడుగా తేల్చడమే అందుకు తార్కాణం. భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇళ్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. ఒకరి పేరును నిర్ధాక్షిణ్యంగా తొలగిం చారు. ఇదే పద్ధతిలో 84,617 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నెలనెలా వృద్ధాప్య, వితం తు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డెక్కుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పింఛను జాబితా నుంచి తొలగించిన వృద్ధులు, వికలాం గులు, వితంతువులు ఆందోళనలు చేయడమే అందుకు తార్కాణం. -
తేలని పింఛన్ల జాబితా
మచిలీపట్నం : జిల్లాలో పింఛనుదారుల అర్హత జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అక్టోబర్ రెండో తేదీ నుంచి అర్హులైన వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, 80 శాతం కన్నా వైకల్యం అధికంగా ఉన్న వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెల ప్రారంభమవుతున్నా జిల్లాలో పింఛనుదారుల వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో మొత్తం 3,12,185 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వారిలో ఇప్పటివరకు 2,97,710 పింఛనుదారుల వివరాలు పరిశీలించిన అధికారులు 12,857 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇంకా 16,475 మందికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. వీరిలో ఎంతమంది అనర్హులుగా ఉంటారో తేల్చాలి. అధికారులు పింఛనుదారుల వివరాలు సేకరించే సమయంలో వారికి ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డులు రెండుచోట్ల నమోదయ్యాయా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండుచోట్ల నమోదై ఉంటే ఒకచోట తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. వితంతు పింఛను పొందేవారి వద్ద మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వారు పింఛను వస్తుందా, రాదా అనే అంశంపై లోలోపల మధనపడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య పింఛను వస్తుంటే వారిలో ఎవరికి నిలిపివేస్తారోననే అంశంపైనా చర్చ సాగుతోంది. పింఛన్ల తుది జాబితా ఇంకా ఖరారు చేయలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు తెలిపారు. కొత్తగా వివిధ రకాల పింఛన్ల మంజూరు కోసం 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. -
సదరం..‘పరీక్ష'
కర్నూలు(హాస్పిటల్): వికలత్వ ధ్రువీకరణ పత్రం పొందాలంటే చుక్కలు చూడాల్సిందే. డివిజన్ పరిధిలోని ప్రాంతాల నుంచి తరలివచ్చే వృద్ధులు.. వికలాంగులు.. మానసిక వికలాంగులు ఎంతో ఆశతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నా.. ఇక్కడ వారి ‘ఓపి’కను పరీక్షిస్తున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడం.. అరొకర సిబ్బంది.. దళారుల కారణంగా ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆసుపత్రిలోని 41వ నెంబర్ ఓపీని సదరం క్యాంపు నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వందలాదిగా తరలివచ్చిన వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రత్యేక కౌంటర్లు లేకపోవడం.. గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఎండ తీవ్రత కారణంగా వారి అవస్థలు వర్ణనాతీతం. కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేక దాహంతో అలమటించారు. కంప్యూటర్ ఆపరేటర్ల కొరతతో వందల సంఖ్యలో తరలివచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం.. కంప్యూటర్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపు వద్దే పడిగాపులు కాయాల్సి రావడంతో బాత్రూం, మరుగుదొడ్ల సమస్యతో అల్లాడిపోయారు. ఓపీ వద్ద దళారులను నమ్మి మోసపోవద్దనే పోస్టర్లు అతికించినా.. వీరి పాత్రే కీలకంగా ఉంటోంది. మీకు వికలత్వ శాతం తక్కువగా ఉంది.. పింఛన్‌కు అనర్హులవుతారు.. రూ.800 ఇస్తే వికలత్వ శాతం ఎక్కువ వచ్చేలా చూస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మరికొందరు సంఘాల పేరిట 20 నుంచి 30 దరఖాస్తులతో కార్యాలయంలోకి వచ్చి తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుకు రూ.500 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం. పింఛన్ పొందాలంటే సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడం.. ఇక్కడ చూస్తే పరిస్థితి గందరగోళంగా ఉండటం వికలాంగులను కలచివేస్తోంది. -
పెన్షన్ల కోతే..
10,600 మంది పెన్షన్ల తొలగింపు నేడుమరో 15 వేలు కట్! కోతే లక్ష్యంగా పెన్షన్ తనిఖీలు జిల్లాలో సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘పచ్చ’ కమిటీలు లబ్ధిదారులను కుదించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న సర్వేలో అప్పుడే 10,600 మందిని అనర్హులుగా గుర్తించి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రాకుండా చేశారు. మంగళవారం కూడా ఇంటింటా తనిఖీలతో 15 వేల మందికి పైగా లబ్ధిదారులను తొలగించాలని కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. విశాఖ రూరల్: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పెన్షన్ల సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత తగ్గించాలని ప్రభుత్వం ఇంటింటా సర్వేకు ఆదేశించింది. కొన్ని చోట్ల ఇంటింటా సర్వే నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయాల్లోను, చెట్ల కింద కూర్చొని లబ్ధిదారుల వడపోతను చేపడుతుండడంతో పెన్షన్‌దారుల్లో ఆందోళన నెలకొంది. మాకవరపాలెం మండలం రాచపల్లిల్లో పంచాయతీ కార్యాలయంలో కూర్చుని పెన్షన్లు తనిఖీ చేస్తున్న కమిటీ సభ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల్లో టీడీపీ నేతలు,కార్యకర్తలు అధికంగా ఉండడంతో వారికి అనుకూలమైన వారిని చూసీచూడనట్లు వదిలేసి, ఇతర పార్టీల వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం నుంచి ఈ సర్వే ప్రారంభం కాగా, తొలి రెండు రోజులు సర్వే నామమాత్రంగా జరిగింది. దీంతో మరో రెండు గడువు పొడిగించారు. జిల్లాలో మొత్తం 3,20,895 మంది పెన్షన్‌దారులు ఉండగా ఇంటింటా సర్వేలో ఇప్పటి వరకు 2,14,736 మంది వివరాలను పరిశీలించారు. ఇందులో 10,600 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. ఇంకా 1,06,159 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంది. ఒక్కరోజులో ఇంత మంది ఇళ్లకు వెళ్లడం కష్టం. అయినప్పటికీ మంగళవారం సాయంత్రంతో సర్వేను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చివరి నిమిషంలో ఇష్టానుసారంగా లబ్ధిదారులను గుర్తింపును చేపట్టే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 రాత్రికి అప్లోడ్ లబ్ధిదారుల వివరాలతో పాటు అనర్హుల జాబితాను ఈ నెల 25వ తేదీ రాత్రికి అధికారులు అప్లోడ్ చేయనున్నారు. అలాగే పెన్షన్ల కోసం కొత్త దరఖాస్తులను మంగళవారం మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంటింటా సర్వేలోనే సిబ్బంది కొత్త దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను కూడా అక్కడే నిర్ధారిస్తున్నారు. మంగళవారం కొత్త దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వాటిని పరిశీలించనున్నారు. కొత్త దరఖాస్తులను కూడా 25వ తేదీ రాత్రిలోగా అప్లోడ్ చేయనున్నారు. అయితే కొత్త వారికి పెన్షన్ల మంజూరు అక్టోబర్ 2 నుంచి జరుగుతుందా లేదా అన్ని విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు. రద్దు సరికాదు నాది పెదబయలు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వికలాంగుల కోటాలో పెన్షన్ మంజూరయింది. నాటి నుంచి నెలకు రూ. 500లు ఇస్తున్నారు. అది చాలక ఇటీవల పాఠశాలలో పార్టుటైం ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం రద్దు చేస్తామనడం సరికాదు. వికలాంగుడినా కాదా అన్నది చూడాలి తప్ప.. ఇలాంటి చర్యలు సరికాదు. - విద్యాకుమార్ పట్నాయక్