నీడలేక.. నిలువలేక.. | Pensions for the elderly | Sakshi
Sakshi News home page

నీడలేక.. నిలువలేక..

Published Tue, Feb 17 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

నీడలేక.. నిలువలేక..

నీడలేక.. నిలువలేక..

పింఛన్ల కోసం వృద్ధులు... వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. గౌలిపురా మేకల మండీలోని ఓ కేంద్రంలో పింఛను కోసం వెళ్లిన వికలాంగ బాలిక సోమవారం ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. విజయనగర్ కాలనీకి చెందిన గంగాధర శాస్త్రి పింఛను రాలేదని తెలిపేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ  క్యూలో వేచి ఉన్న ఆయన కొద్దిసేపటి తరువాత  ప్రాణాలు కోల్పోయాడు.
 
కుత్బుల్లాపూర్, మెహదీపట్నం, చార్మినార్ : హైదరాబాద్ నగరంలో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, పోలీసులు బాధ్యతా రాహిత్యం కారణంగా పింఛన్ పంపిణీ కేంద్రాలు ముష్ట్టియుద్ధాలు చేసే గోదాలను తలపిస్తున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు లేక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం తాజాగా ఓ వృద్ధుడు పింఛన్ కోసం వచ్చి మృత్యువాత పడ్డాడు. నగరంలోని  విజయనగర్‌కాలనీకి చెందిన గంగాధర్‌శాస్త్రి(75) గత మూడు నెలలుగా తీసుకుంటున్నాడు. ప్రతి నెల పోచమ్మ బస్తీలో పింఛన్ డబ్బులు తీసుకునే అతను ఈ నెల పింఛన్ కోసం సోమవారం పంపిణీ కేంద్రానికి వెళ్లగా పింఛన్ రాలేదని తెలిపారు. దీంతో అతను ఉన్నతాధికారులకు మొరపెట్టుకునేందుకు విజయనగర్‌కాలనీలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయతే అప్పటికే పింఛన్ కోసం  వచ్చిన లబ్ధిదారులు బారులు తీరి ఉండడంతో కొద్దిసేపు క్యూలో నిలుచున్న గంగాధర్ అలసి పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆ వెంటనే  పక్కకు ఒరిగి ప్రాణాలు వదిలాడు.

జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్ కమ్యూనిటీ హాలులో ఒకే ఒక కౌంటర్ ఏర్పాటు చేయటంతో పింఛన్‌దారుల మధ్య తొక్కిసలాట జరగడంతో కుత్బుల్లాపూర్ చెందిన గుడ్డి సత్తమ్మ అనే మహిళ కాలు విరగగా, దత్తాత్రేయనగర్‌కు చెందిన చంద్రమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. పాతబస్తీలోని చార్మినార్, బండ్లగూడ, బహదూర్‌పురా  తహసీల్ధార్ కార్యాలయాల్లోని పింఛన్ల పంపిణి కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో పలువురు వృద్ధులు , వికలాంగులు గాయపడ్డారు. నగరంలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
 
ఎందుకిలా...

 
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ పింఛన్ల  పంపిణీకి అధికారులు సరైన వసతులు చేపట్టకపోవడంతో లబ్థిదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.  సిబ్బంది కొరతా కారణంగా కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికితోడు ఈ నెల 10వ తేదీ నుంచే పింఛన్లు పంపిణి చేపట్టాల్సి ఉన్నా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 13 వ తేదీ నుంచి పంపిణీ చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 14.67 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 104 కేంద్రాలు ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిపై పర్యవేక్షణ చేపట్టక పోవడంతో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి.
 
దరఖాస్తులప్పడూ అంతే...
 
పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలోనూ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసీఫ్ నగర్‌లో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ఒక వృద్ధుడు చనిపోగా, సైదాబాద్ మండలంలో మరొకరు క్యూలోనే ప్రాణాలు వదిలారు. రోడ్డు దాటుతుండగా మరొకరు దుర్మరణం పాలయ్యాయి. ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని అధికారులు  పంపిణీ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
 
పట్టించుకోవడం లేదు...
 
పింఛన్ కోసం పంపిణీ కేంద్రానికి వస్తే..ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదు. రోజూ వస్తున్నా పట్టించుకోవడం లేదు. వచ్చిన వారికందరికీ పంపిణీ ఇచ్చేలా చూడాలి.
  - ఎస్. విశ్వేశ్వరచారి, కందికల్‌గేట్.
 
మంచినీళ్లు కూడా లేవు

 
 పంపిణీ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎండ కొడుతుంది. కనీసం టెంట్లు కూడా వేయలేదు. ఇబ్బందులకు గురవుతున్నాం.                                      - కళమ్మ, గౌలిపురా.
 
 పర్యవేక్షణ లోపం..
.
 
పంపిణీ కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో.... లేవో.. తెలుసుకునేందుకే లబ్ధిదారలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాయంత్రం వరకు లైన్‌లో ఉన్నా... లిస్టులో మీ పేరు లేదు... రేపు మరో సెంటర్‌లో ఇస్తాం అక్కడికి రావాలని చెబుతుండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల తీసుకునే సెంటర్‌లో కాకుండా... ఇంటికి దూరంగా ఉండే  మరో ప్రాంతానికి బదలాయించడం వల్ల వృద్దులు, వికలాంగులు ఆందోళనకు గురవుతున్నారు.
 
90 వేల మందికే బ్యాంకు ఖాతాలు..
 
హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్ దారులుండగా, వారిలో 90 వేల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మిగతా వారందరు బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు సూచిస్తున్నా....ఫలితం కనిపించటంలేదు. మార్చిలోగా బ్యాంకు ఖాతాలు తెరవాలని హుకుం జారీ చేసిన అధికారులు ప్రస్తుతం పంపిణి కేంద్రాల వద్ద పింఛన్లు అందజేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement